Home Entertainment పడి లేచిన ఒక సంగీత తరంగం – మహమ్మద్ రఫీ

పడి లేచిన ఒక సంగీత తరంగం – మహమ్మద్ రఫీ

156
0
SHARE
Mohammad Rafi (Twitter picture)
(జూలై 31, మహమ్మద్ రఫీ వర్దంతి)
(Ahmed Sheriff)
సరిగ్గా నలభై సంవత్సారల క్రితం, 1980 జూలై 31 న సంగీత ప్రపంచం లో ఒక అపశృతి ధ్వనించింది. యావత్ప్రపంచం లోని సంగీత ప్రియుల ను  సుమధుర గానం తో అలరిస్తూ వచ్చిన మహా గాయకుడు మహమ్మద్ రఫీ గళం హఠాత్తుగా మూగవోయింది.   
పదివేలకు పైగా జనం.  కుండపోతగా వర్షం.  ఆ రోజు  వర్షాన్ని కూడా లెక్క చేయకుండా  తమ ప్రియతమ గాయకుడికి వీడ్కోలు పలకడానికి గొడుగులు పట్టు కుని రఫీ అభిమానులు ఒక ఉప్పెన లాగా ప్రవహించారు.
అంతవరకూ  ఒక రాజకీయ నాయకుడి విషయం లో కానీ, మరో సినీ ప్రముఖుడి విషయం లో కానీ అటువంటి జనసమూహాన్ని, ముంబై ప్రజలు చూసి వుండలేదు. సినీ ప్రపంచం – ముఖ్యంగా బాలీవుడ్ దుఖం లో మునిగిపోయింది. రఫీ బంధువులూ, మిత్రులూ, ప్రత్యక్షంగా ఆయన ని ఎరిగి వున్న వారూ, పరోక్షంగా ఆయన పాటలు వినే అభిమానులూ అందరూ ఆయన హఠాన్మరణం గురించి విని విస్తుపోయారు. 
ముస్లిం లకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం. అందులో చివరి పది రొజుల్లొ బేసి సంఖ్యల రాత్రులు (షబ్ – ఎ – ఖదర్) మరింత పవిత్రమైనవి, (మాసపు 27 వ రోజు), స్వర్గ ద్వారాలు తెరిచి, దేవుడు మహమ్మద్ రఫిని తీసుకెళ్ళి పోయాడు అన్నారు ఆయన అభిమానులంతా . మరుసటి రోజు రంజాన్ మాసపు చివరి శుక్రవారం (జుమతుల్ – విదా) ఆయన భౌతిక కాయం సమాధి చేయబడింది. ముంబై ఆకాశం భోరున ఏడ్చింది  
మహమ్మద్ రఫీ వ్యక్తిగత జీవితం చాలా సీదా సాదా గా వుండేది. రికార్డింగ్ అయిపొగానే, ఇంటి కి వెళ్ళడం, కుటుంబ సభ్యుల్తో సమయాన్ని గడపటం, వీలైతే డాబా మీదికి వెళ్లి  గాలిపటాలు ఎగురవేయడం వీటిని ఎక్కువ ఇష్టపడెవాడు రఫీ. వ్యక్తిగా రఫీ స్నేహ శీలి, మిత భాషి, ఎప్పుడు ముఖం మీద చెరగని చిరునవ్వు తో సినీ ప్రపంచపు తళుకు బెళుకులకూ, వివాదాలకూ దూరంగా వుండే వాడు. తాను దూరంగా వుండటమే కాకుండా తన పరివారాన్ని కూడా ఈ విషయాలకు దూరంగానే వుంచాడు రఫీ. ఆయన పరివారం లో (కొడుకులూ, కూతుర్లూ) ఒక్కరు కూడా రఫీ లాగా సంగీతాన్ని వృత్తి లా చేసుకోక పోవడానికి కారణం ఇదే. 
ఎవరైనా కష్టాల్లో వున్నారంటే ఆదు కోవాలనే మృదు స్వభావం కలిగిన వాడు రఫీ. ఈ విషయం లో అతణ్ణి ఎరిగివున్న వారిని ఎవరిని అడిగినా ఉదాహరణ గా ఏదో ఒక సన్నివేశాన్ని ప్రస్తావిస్తారు. స్నేహం కోసం కానీ, పాటలో తన వంతుగా ఒక లైనే, పాడినప్పుడు కానీ, సంగీత దర్శకులకు సహాయం చేసే నిమిత్తం కానీ రఫీ కొన్ని సార్లు పాటల్ని వుచితంగా పాడినట్లు చేబుతారు. ఫీజు నిర్ణయం కాలేదనో, తక్కువగా వుందనో ఆయన పాట పాడటం మానేసిన దాఖలాలు లేవు. 
స్వరాల్లో, రాగాల్లో, స్థాయిల్లో సునాయాసంగా ప్రవహించే గళం రఫీది.  భజనల దగ్గర్నుండీ, భాంగ్రాల వరకూ,  రొమాంటిక్ పాటలు, దేశభక్తి గీతాలు, చిలిపి పాటలూ, జోల పాటలూ, ఒకటనేమిటీ అన్ని రకాలూ అందర్నీ మెప్పించే విధంగా, సంగీత దర్శకుల కు తృప్తి నిచ్చే విధంగా పాడటం తెలిసిన వ్యక్తి రఫీ. సినీ ప్రపంచం లో రఫీని ఎరిగి వున్న వారిని ఎవరిని అడిగినా, పాటలతో పాటు అతడి వ్యక్తిత్వాన్ని ప్రస్తావించని  వారు వుండరేమో. 
సినీ సంగీతపు వినీలాకాశపు ఎత్తుల్లో ఆనంద మయంగా సాగుతున్న రఫీ జీవితం లో 1970 మొదలు దాదాపు 6 సంవత్సరాలు విషాద చాయలు అలుముకున్నాయి. అందుకు కారణమేమిటీ, అసలు ఏం జరిగింది?
1969, నవంబర్ 7 
రాజేష్ ఖన్నా “ఆరాధన” చిత్రం విడుదలయిన రోజు. ఆ చిత్రం  రాజేష్ ఖన్నాను అతడి తో పాటు ఆ సినిమాలో సూపర్ హిట్ అయిన పాట “మెరి సప్నోంకి రాణి కబ్ ఆయెగి తూ” ను పాడిన కిశొర్ కుమార్ నూ ఓవర్ నైట్ సూపర్ స్టార్స్ గా మార్చేసింది.   అంతవరకూ మామూలు గాయకుడిగా చలామణి అవుతున్న కిశోర్ కుమార్ ఆకాశం లో కి ఎగిశాడు. 
అవి పాశ్చాత్య సంగీత బాణుల్తో ఆర్. డీ బర్మన్ బాగా పాప్యులర్ అవుతున్న రోజులు. అతడికి  ఎన్నో రోజుల్నించి  రఫీ స్థానం లో కిశొర్ ను తేవాలని వుండింది. ఈ విషయం లో అతడు తన తండ్రి ఎస్.డీ. బర్మన్ నుండి  ఆశించినంత సహకారాన్ని పొందలేక పోయాడు  ఎస్.డీ. బర్మన్ గాయకుడి కంటె గానానికి విలువ నిచ్చే వ్యక్తి. కిశోర్ కుమార్ వున్నా, నటుడు దేవానంద్ తన పాటల్ని కిశొర్ కుమార్ తో నే పాడించాలని సూచనలిచ్చినా, ఎస్.డీ. బర్మన్  “ గైడ్”  చిత్రం లో “దిన్ ఢల్ జాయే..”, “క్యాసె క్యా హొగయా..”, “తెరీ మెరె సపునే అబ్ యేక్ రంగ్ హై”  మొదలైన పాటల్ని రఫీ చేతే పాడించాడు.  రఫీ పాడిన ఈ పాటలు ఎస్. డీ. బర్మన్ కి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. 
అయితే, తండ్రి అనారొగ్య కారణాల వల్ల “ఆరాధన” చిత్రానికి సగం లో సంగీత బాధ్యతల్ని తీసుకున్న  ఆర్. డీ. బర్మన్ కి ఈ చిత్రం విజయం తో   దారి సుగమం అయింది.. అప్పటికే ఈ చిత్రానికి రఫీ ద్వారా రెండు పాటలు రికార్డు చేసివున్నా,  అతడి స్థానం లో కిశోర్ ను తెచ్చి” రూప్ తెరామస్తానా”, “మెరి సపునోంకి రాణి కబ్ ఆయేగి తూ”  పాడించాడు. ఆ తరువాత ఎం జరిగిందో అభిమానులకందరికీ తెలిసిందే.
ఈ చిత్రం విజయం తో రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ అయిపోయాడు.  తన చిత్రాల్లో కిశొర్ తప్ప వేరే గాయకుడు పాడటానికి వీల్లేదని షరతు పెట్టాడు. అతణ్ణి ఎదిరించే శక్తి నిర్మాతలకు లేదు. అందుకే రఫీ తో పాటలు పాడించడానికి జంకారు, వెనక్కి తగ్గారు.  
రఫి గాత్రాన్నందించిన హీరో లు  దిలీప్ కుమార్, ధర్మేంద్ర, జితేంద్ర,  బిస్వజీత్, జాయ్ ముఖర్జీ, షమ్మీకపూర్, రాజేంద్రకుమార్, మొదలయిన వారంతా మెల్లగా తెరమరుగవుతున్న రోజులు.  కొత్త తరపు తారలు, రాజేష్ ఖన్నా, రిషికపూర్, రాకేష్ రోషన్, గొవిందా, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్ మొదలైన వారు సినీ ప్రపంచాకాశం లో ఉదయిస్తున్న రోజులు. వీరిలో కొందరికి రఫీ గాత్రం అతకదు. మరికొందరికి అతనంటె ఇష్టం లేదు.  
ఈ విషయాలు రఫీ గాయక జీవితపు వినీలాకాశం లో నల్ల మబ్బుల్లా కమ్ముకున్నాయి. రఫి పాటల ఒరవడి తగ్గి, కిశోర్ హవా మొదలయింది. పత్రికలు రఫి గాయక జీవితం ముగిసిందని రాశాయి.
1970  నుండి  1976 వరకు రఫీ పాటలు బాగా తగ్గి పోయాయి. అతడిని అభిమానించే సంగీత దర్శకులున్నా వారి చిత్రాలు ఎక్కువగా వుండెవి కావు. ఈ సమయం లో బాగా ప్రాచుర్యం లో కి వస్తున్న “లక్ష్మి కాంత్ ప్యారేలాల్” సంగీత ద్వయం మాత్రం రఫీ కి అండగా నిలిచే వున్నారు. అయితే ఆర్.డీ. బర్మన్ ప్రభంజనాన్ని తట్టుకోవడం వారికి కూడా కష్టంగానే వుండేది.  అంత వరకూ సాఫీ గా సాగిన రఫీ గాయక వృత్తి మెల్లగా తిరోగతి మొదలు పెట్టింది. 
ఈ సమయం లో అతడి కి అత్యంత ఆప్తుడూ శ్రేయోభిలాషి అయిన సంగీత దర్శకుడు నౌషాద్ రఫీ ని ఇంటికి పిలిచి “నువ్వు మహమ్మద్ రఫీ వి, రఫీ లాగే వుండు, అలాగే పాడు. నీలో ఎటువంటి పాటలు పాడటానికైనా కావలిసిన సత్తా వుంది, దానికి తోడు, శాస్త్రీయ సంగీతపు శిక్షణ కూడా వుంది”  అని ధైర్యం చెప్పాడు. అతడిలో ఆత్మ విశ్వాసం నూరి పోశాడు . వూరికే మాటలు చెప్పడమే కాకుండా తన వంతు భాగంగా రఫీ ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని “మై ఫ్రెండ్” (1974), చిత్రానికి “ నయ్యా మేరి చల్తి జాయే సహారే తెరె బఢ్ తీ జాయె”  అనే పాటను భైరవి రాగం లో స్వరపరిచి రఫీ తో పాడించాడు. ఈ పాటను హస్రత్ జైపురి రాశాడు. అయితే ఈ చిత్రం బి గ్రేడు సినిమా కావడం, బాక్సాఫీసు వద్ద ఘోర పరజయం పొందడం  రఫీ కి కలిసి రాలేదు.  
ఇంచుమించు ఇదేసమయం లో, సావన్ కుమార్ చిత్రం “హవస్” (1974) విడుదలయింది. ఈ చిత్రం కోసం ఉషా ఖన్నా సంగీత దర్శకత్వం లో రఫీ పాడిన “తెరి గలియో మె న రఖేంగే ఖదం”
 పాట అతడికి “ఫిల్మ్ వరల్డ్” ఉత్తమ గాయకుడి గా అవార్డు సంపాదించి పెట్టింది. అడపా దడపా అవార్డులు తీసుకునే రఫీ జీవితం లో దాదాపు ఆరేడు సంవత్సరాలుగా ఎటువంటి అవార్డులూ లేవు.  ఆ సమయం లో రఫీకి ఈ అవార్డు గొప్ప  ఊరట కల్గించింది, ప్రేరణ ఇచ్చింది.. 
అయితే రఫీ ని అతడి పూర్వ వైభవపు సింహాసనం మీద కూర్చోబెట్టిన ఘనత “లైలా మజ్ఞూ” (1976) చిత్రానికీ, దాని సంగీత దర్శకుడు మదన్ మోహన్ కి దక్కుతుంది. 
హెచ్. ఎస్. రవైల్ దర్శకత్వంలో రిషీ కపూర్, రంజీతా జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు  వద్ద ఘన విజయం సాధించింది. కిశోర్ హవా ఇంకానడుస్తున్న రోజులు. ఈ చిత్ర సంగీత దర్శకుడు మదన్ మోహన్, ఈ సినిమాలో పాటలు రఫీ తో పాడించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి చిత్ర దర్శకుడి నుంచీ, రిషీకపూర్ నుంచి గట్టి నిరోధం వచ్చింది. రిషీ కపూర్ కి రఫి గొంతు సరిపోదు అన్నారు. రిషీ కపూర్ తన పాటల్ని కిశోర్ కుమార్  తో పాడించాలని  ప్రతిపాదించాడు. దీనికి మదన్ మోహన్ ఒప్పుకోలేదు. తనదైన బాణీ లోనే “ఈ చిత్రం లో రఫీ పాడతాడు, లేదా మీరు మరో సంగీత దర్శకుడిని చూసుకోండి” అన్నాడు. మదన్ మోహన్ సత్తా తెలిసిన దర్శకుడు మారు మాట్లడలేదు. ఈ చిత్రం లో రఫీ లతా మంగేష్కర్ తో కలిసి పాడిన మూడు యుగళ గీతాలతో కలుపుకుని మొత్తం ఏడు పాటలు పాడాడు.  అన్నీ హిట్ లే  
తరువాత ఏం జరిగింది ? చరిత్ర పునరావృతమైంది. రఫీ గాయక జీవితం లోకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. 
తరువాత రిషీ కపూర్ కి రఫీ గొంతు చాలా బావుంటుంది అని ప్రచారమయింది.  ఈ క్రమం లో రిషీ కపూర్ కోసం చాలా పాటలే పాడాడు రఫీ.. అతడి గొంతు ద్వారా రిషీ కపూర్ కి “దర్దె దిల్ దర్దె జిగర్” (కర్జ్),  “పర్దాహై పర్దా” , “షిర్ది వాలే సాయి బాబా”(అమర్ అక్బర్ ఆంథోని),  “హం కిసీసె కం నహి” టైటిల్ సాంగ్  మొదలైన  గొప్ప పాటలు వచ్చాయి.  రిషీ కపూర్ కొసం “సర్గం” (తెలుగు సిరి సిరి మువ్వ) చిత్రం లో ని పాటలన్నీ రఫీ పాడటం కూడా విశేషమే.
ఆర్.డీ. బర్మన్ సంగీత దర్శకత్వం లో , “హం కిసీసె కం నహీ”  చిత్రానికి (1977) గాను రఫీ పాడిన “క్యా హువా తెరా వాదా”  పాటకు ఉత్తమ గాయకుడిగా రఫీ జాతీయ ఫిల్మ్ అవార్డు పొందటం మరో విశెషం . అటు తరువాత  రఫి మళ్లీ వనక్కి తిరిగి చూడలేదు.
రఫీ హీరో కి, సైడ్ హీరో కి, కమేడియన్ కీ, కొత్తతరం నటులకీ, పాతవారికీ, ఏ నటుడికి పాట పాడినా ఆ నటుడే పాడినట్లు వుంటందని హింది సినీ సంగీత ప్రియులందరు ఒప్పుకున్న విషయం. ఏ నటుడికైనా, ఎలాంటి పాటనైనా పాడగలిగిన రఫీ, కిశోర్ కుమార్ కి మాత్రమే ప్రత్యేకమయిన “యోడ్ లేడీ, యోడ్ లేడీ” పాడలేడని రఫీ అభిమానులు అనుకున్నప్పుడు, ఆ కోరిక కూడా తీర్చాడు రఫీ ఫిరోజ్ ఖాన్ కోసం “రాజూ రిపోర్టర్ ” (1962) సినిమాలో ని “గుస్సా ఫుజూల్ హై, హమే ఖుబూల్ హై”  పాటతో.
గాయకుడిగానే కాకుండా, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి గా  ప్రజల మన్ననలు పొందాడు రఫి. అభిమానులను సంపాదించు కున్నాడు. కుల మతాలూ, భాషా, ప్రాంతీయ  తత్వాలు, వీటికి అతీతంగా సాగింది రఫి పై ప్రజలుకున్న అభిమానం. రఫి అభిమానులూ, వీరాభిమానులు కూడా ఎక్కువమంది అన్య మతస్తులే. 
1949 వ సంవత్సరం – ఆప్పుడప్పుడే పేరుప్రఖ్యాతులు పొందుతున్న మహమ్మద్ రఫీ,  సంగీత దర్శకుడు నౌషాద్ అలి దగ్గరికి వెళ్ళీ “నాకు ముంబై నచ్చడం లేదు. నేను పంజాబ్ వెళ్ళి పోతున్నాను. అక్కడికి వెళ్ళి శాస్త్రీ య సంగీతపు రాగాల్తో కూడిన పాటలు పాడుకుంటాను” అన్నాడట.
అప్పుడు నౌషాద్ నాకు కొద్ది రోజులు గడువు ఇవ్వు, నేను  నీకోసం అటువంటి పాటల్ని తయారు చేస్తాను అన్నాడట. అలాగే ఒక పాటను తయారు చేసి రఫీ తో పాడించాడు. ఆ పాటే దులారి చిత్రం కోసం   షకీల్ బదాయుని రాసిన “సుహానీ రాత్ ఢల్ చుకీ, న జానె తుం కబ్ ఆవొగీ”.
ఈ పాట రఫీ కి ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.  ఈ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ స్టార్ & స్టైల్ పత్రికలో (ఇప్పుడు ఆ పత్రిక లేదు) బన్నీ రూబెన్ “నౌషాద్ లేక ఫొయివుంటే హిందీ చిత్ర సంగీతం రఫీ ని కోల్పోయి వుండేది” అని రాశాడు.

Like this story? Share it with a friend!

వీరి కలయికలోనే , సర్వ మత సౌభ్రాతృత్వానికి చరిత్రలొ నిలిచి పోయి, జాతీయ స్థాయిలొ మన్నలు పొందిన పాటలు “ఓ దునియాన్ కే రఖ్ వాలే”, “మన్ తడపథ్ హరి దర్శన్ కో” (రచన : షకీల్ బదాయుని, నౌషాద్, సంగీతం : నౌషాద్, చిత్రం : బైజు బావ్రా), ఎవరు మరిచి పోగలరు?
“తుం ముఝె యుం భులాన పావోగే, జబ్ కభీబి సునోగె గీత్ మెరే,  సంగ్ సంగ్ యు హి గున్ గునావో గె “  
(“నువ్వు నన్ను మరిచి పోలేవు, ఎపుడైనా నా పాటలు విన్నప్పుడు, నాతో పాటు నువ్వుకూడా పాడతావు”)
“పగ్లా కహింకా”  చిత్రం లో మహమ్మద్ రఫీ పాడిన ఈ పాట ఆయన ప్రపంచాని కిచ్చిన తుది సందేశం లాగా మిగిలిపోయింది.
నటుడు జితేంద్ర ఒక సారి రఫి  జన్నదిన వేడుకలప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ “ఈ సమావేశం రఫి జ్ఞాపకార్థం అనడం తప్పు.  మనం మరిచి పోయిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటాం, రఫి మరుపు రాని వ్యక్తి  అతణ్ణి జ్ఞాపకం చేసుకోవడమేమిటీ ?” అన్నాడు.
నిజమే, “అతడు”  సినిమాలో డైలాగులా, “మరిచి పొవడానికి అతడేమైనా జ్ఞాపకమా? జీవితం” అంటారు అతడి అభిమానులంతా.

 

(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM,  Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)