అక్కినేని నాగేశ్వరరావుకు ‘ప్రేమ పాఠాలు’ నేర్పిన రాయలసీమ అమ్మాయెవరు?

(Chandamuri Narasimhareddy)
పూర్వం సినిమా రంగంలో స్వార్ధం, అసూయ,ద్వేషాలు లేవు . కేవలం కళ కోసం నటించే రోజులవి. డబ్బు సంపాదించాలనే యావ ఏకోశానా ఉండేది కాదు. నటన కోసం పోటీ పడేవాళ్ళు.
మంచి పాత్రల కోసం తపించేవాళ్ళు. వచ్చిన పాత్రను ఎలా మెప్పించాలా అని రేయింబవళ్ళు కృషి చేసే వాళ్ళు . దర్శకుడే దేవుడు. ఆయన మాటే వేదం.ఇది మొదటి తరం సినీ సాంప్రదాయం.
అప్పుడు నటీనటులు జీతాల పద్ధతిలో పనిచేసేవారు.
ఒక్కొక్క చిత్రం 4 నుంచి 6 నెలల నిర్మాణం జరిగేది. ఆ చిత్రం పూర్తయి, ఆ నిర్మాణ సంస్థ ‘రిలీవ్ ఆర్డర్” ఇచ్చే వరకూ మరో చిత్రంలో నటించడానికి వీల్లేదు.
సకాలంలో చిత్ర నిర్మాణం పూర్తి కాక పోతే అదనపు రోజుల కు అదనపు డబ్బు ఇచ్చేవారు. దర్శకుడంటే గురువు, దేవుడు. ఆయన సెట్లోకి వస్తే భయపడేవాళ్లు. దర్శకుడే అప్పుడు సమస్తం.అలాంటి రోజుల్లో సినీ నాయిక గా అడుగు పెట్టిన తార వెల్లాల సుబ్బమ్మ అలియాస్ శాంతకుమారి.
http://sobhanaachala.blogspot.com
1936లో పివి దాసుగారు తీసిన ‘మాయాబజార్’ చిత్రాన్ని ‘శశిరేఖా పరిణయం’ అని కూడా అంటారు. రెండు పేర్లు ఉన్న సినిమా ఇది.ఈ చిత్రం ద్వారా చిత్ర రంగంలో అడుగు పెట్టారుశాంతకుమారి. ఈ చిత్రంలో శశిరేఖ పాత్ర ధరించారు. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు.
Source: http://sobhanaachala.blogspot.com
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 1920 మే17 న వెల్లాల సుబ్బమ్మ జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఇష్టం.
వెల్లాలసుబ్బమ్మను మద్రాసులో ఉన్న ప్రొ పి సాంబమూర్తి వద్ద కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్పించారు. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. కర్నాటక సంగీతాన్ని క్షుణ్నంగా అభ్యసించిన ఒకే ఒక తెలుగు నటిగా ఆమెకు పేరుంది.
తరువాత గురువుతో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.
వెల్లాలసుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పివి దాసు 1936 మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ మొదట నిరాకరించారు. అయితే సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది.
పి వి దాసు  వెల్లాలసుబ్బమ్మ పేరు పాతగా ఉందని పేరు ను శాంతకుమారి గా ఈ సినిమాలో మార్చారు.
ఇది తెలుగులో ‘మాయాబజారు’ ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయం అని కూడా ఇంకో పేరు ఉంది. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించారు.
సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. వేల్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో పి.వి.దాసు చిత్రాన్ని నిర్మించారు. గాలిపెంచల నరసింహారావు సంగీతం అందించారు.
తరువాత 1937 లో రెండవ సినిమా సారంగధర లో నటించింది.సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైంది. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించాడు.
ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రలో ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని 1937లో ఇష్టపడి ప్రేమపెళ్ళిచేసుకొంది.
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. పద్మశ్రీ పిక్చర్స్ అధిపతి. పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.
పెళ్ళిచేసుకొన్న తరువాత కూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పద్మ పేరును వెంటేశ్వర మహాత్యం సినిమా గుర్తుగా పెట్టారు.
శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ “చిరు చిరు నగవులు చిందే తండ్రి” అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.
1937లో రుక్మిణీ కల్యాణము లో నటించింది. 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమాఇది. విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా,
పి.మునుస్వామి సంగీతం అందించాడు.
శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని.
ఈ సినిమా 1941లో విడుదలైంది. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.మరాఠీలో మొదటి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఈయనే.
పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ’ చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. శాంతకుమారి ఈ చిత్రంలో హీరోయిన్‌.
కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. ఇందులో పనిచేసిన టెక్నిషియన్లంతా మరాఠీ వారే. మ్యూజిక్ అన్నాసాహెబ్ మైన్ కర్.  అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు ఉప్పులూరి సంజీవరావు కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈచిత్రానికి మాటలను విశ్వనాథ సత్యనారాయణ చేత రాయించాలనుకున్నారు. అయితే, మరీ గ్రాంధికమవుతుందేమో నని ఆలూరి వెంకటసుబ్బారావు చేత రాయించారు. ఆయనే చక్రపాణి. ఈచిత్రం విడుదల తర్వాత ఆమెకు కూతురుపుట్టారు. పాపకి హీరోయిన్ పేరు రాధ అని పేరుపెట్టారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాల నటుడిగా విద్యార్థి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. అపుడు ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలు.  అన్న రామబ్రహ్మం నాగేశ్వరరావు ఈ చిత్రంలో హీరోకావాలని ఆశించి కోల్లాపూర్ కు తీసుకు వెళ్లారు. మరీ చిన్న వయసు కావడంతో అది సాధ్యపడలేదు. అపుడు పుల్లయ్య ‘ఆనందమాయెగా, మన మోహనుడు పెళ్లి కొడుకాయెగా, మనరాధమ్మ పెళ్లికూతురాయెగా’ అనే పాట సీక్వెన్స్ లో కనిపించిన పది మంది విద్యార్థుల్లో ఒకరిగా కనిపించే అవకాశాన్ని పుల్లయ్య కల్పించారు. అయితే, అదే పుల్లయ్య  నాగేశ్వరరావును అర్థాంగి (1955) చిత్రంలో హీరోని చేశారు.
అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు.
మాయలోకం సినిమాలో అక్కినేని ప్రక్కన హీరోయిన్ గా శాంతకుమారి నటించారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం.మాయలోకం సినిమా కు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. త్రిపురనేని గోపీచంద్ సంభాషణలు రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సినిమాలో శాంతకుమారి “మోహనాంగ రార నవ మోహనాంగ రారా “- పాట,.మరియు “ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి “- ఈ రెండు పాటలు పాడింది. అపుడు టాప్ హీరోయిన్ అయిన శాంతకుమారితో నటించేందుకు నాగేశ్వరరావు సిగ్గుపడేవారట. ఆయనకు ప్రేమ పాఠాలు తానే చెప్పానని ఒక సారి ఆమెయే రాశారు.
“మాయలోకం లో నాగేశ్వర్రావుతో నాయికగా వేశాను. అప్పటికినేనే సీనియర్ ను. షావు కారు చిత్రంలో ఎన్టీయార్ తో నటించాల్సింది. కాని ఆయన పీలగా ఉండేవారు. నేను  కాస్త పుష్టి. దాన్తో కుదర్లేదు. నాపక్కన నటించడానికి నాగేశ్వర్రావు భయపడేవాడు. అతనిని  నేనే ప్రేమ పాఠాలు చెప్పేదాన్ని…’ అని ఆమె జ్యోతిచిత్ర లో ‘అయిదు దశాబ్దాల తెలుగు  చిత్ర చరిత్ర’ మీద రాస్తూ చెప్పారు. Source: Sobhanaachala blogspot
నాగేశ్వరరావు నటించిన జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలో సవతి తల్లిగా నటించారు.
ఎన్.టీ.ఆర్ కు తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.
పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.
సుమారు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మాయబజార్, సారంగధరలలో ఆమె పాటిన పాటలు దొరకడం లేదు. అయితే, కృష్ణ ప్రేమ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
శ్రీ వెంకటేశ్వర మహాత్యం  చిత్రంలో ఆమె గొప్పగా పాడిన, ఈ చిత్రం తమిళ డబ్బింగులో పాడింది పి లీల.అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్బు చేసినపు హిందీ పాటలు చక్కగా పాడి ఆందరినీ ఆశ్చర్యం పరిచారు
మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం,సారంగధర
రుక్మిణీ కల్యాణం , భక్తజయదేవ,
శ్రీ వేంకటేశ్వరమహత్యం,
ధర్మపత్ని,పార్వతీ కల్యాణం,
కృష్ణప్రేమ,మాయాలోకం,
గుణసుందరి కథ, షావుకారు,
ధర్మదేవత,అర్ధాంగి,
సారంగధర,జయభేరి
శ్రీ వెంకటేశ్వర మహత్యం,
సిరిసంపదలు,ప్రేమించి చూడు,ప్రాణమిత్రులు,
బంగారు పిచ్చుక,ప్రేమనగర్,
కొడుకు కోడలు,సోగ్గాడు ఇలా వందకు పైగా సినిమా ల్లో నటించారు.
1975లో ‘సోగ్గాడు’ విడుదలైంది . పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా శోభన్ బాబును “సోగ్గాడు శోభన్ బాబు” అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. ఈ సినిమా లో శాంతకుమారి శోభన్ బాబు అత్త పాత్రలో జయచిత్ర తల్లిగా నటించింది.
సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె  మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.
1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు. ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీకళాకారులకు ఇచ్చే ‘కళా నీరాజన’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.
దీర్ఘకాలికంగా అస్వస్థత కు గురైన శాంతకుమారి 2006 జనవరి17 న చెన్నై లోని స్వగృహంలో మరణించింది.
Chandamuri Narasimhareddy

(Chandamuri Narasimhareddy, senior journalist, Khasa Subbarao rural journalism award winner. Mobile:9440683219)