దర్బార్ : అంతా  రజినీ మాయ (మూవీ రివ్యూ)

(సలీమ్ బాష)
రజినీకాంత్ ఫ్యాన్ అయిన డైరెక్టర్ మురుగదాస్ రజిని ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా “దర్బార్”. ఇందులో ప్రేక్షకులు రజనీ నుంచి కోరుకునే యాక్షన్, స్టైల్, మేనరిజమ్స్ ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ అయిన మురుగదాస్ ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్ తీయాలనుకోవడం విశేషం. తొలి భాగం గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ మలి భాగం లో  మ్యాజిక్ మిస్సయ్యి  పట్టు కోల్పోయాడు మురుగదాస్. సెకండ్ హాఫ్ లో సాగతీత సన్నివేశాలు, సెంటిమెంట్ తదితర అంశాలు సినిమా రన్ టైంను పెంచేశాయి. 20 నిమిషాల నిడివిని తగ్గించి ఉంటే సినిమా కొంత  గ్రిప్పింగ్ గా ఉండేది. సినిమా ఆసాంతం రజిని స్టైల్ లో నడిచిపోతూ ఉంటుంది. అయితే ఫస్టాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ సీన్స్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక రెండు సీన్స్ లో మాత్రమే మురుగదాస్ మార్క్ కనబడింది. మరోసారి రజిని ఈ సినిమాను తన భుజాలపై మోసాడు.
మురుగదాస్ ఈ  సారి ముంబై డ్రగ్స్ నేపథ్యంలో  తీసిన ఈ సినిమాలో కథ తక్కువయ్యి కథనం మీద ఆధార పడటం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొని, మరోసారి రజిని మాయను నమ్ముకోవటం వల్ల, కొన్ని అనవసర సీన్లు ఎక్కువ కావటం, దాంతో సినిమా కొంత స్లో అయిపోవటం ఒక మైనస్సయ్యింది.. కొన్ని చోట్ల రజిని  మ్యాజిక్ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా పూర్తిగా సినిమాకు బలం కాలేదు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ గా నటించిన సునీల్ శెట్టి (హిందీ నటుడు) ఫర్వాలేదు. కాని ఎక్కువ సీన్లు లేకపోవటంతో విలనీ పండలేదు.ఇక ఇతర తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నివేదా థామస్ మంచి నటనతో కొంత ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కోసం తీసిన వీడియోలో మంచి ఎమోషన్స్ చూపించింది. ఈ వీడియో అలోచన బావుంది. కొన్ని సందర్భాల్లో రజిని  నటన కూడా బావుంది. తండ్రీ కూతుళ్ళ బంధం బానే తీసినప్పటికి, అదే ఎక్కువగా సాగదీయటం వల్ల సినిమా నిడివి
 (2 గంటలా 40 ని!!) పెంచింది.  చిత్రంగా సినిమాకు అదే బలం, బలహీనతానూ! నయనతారకు ఈ సినిమాలో పెద్దగా అవకాశం లేదు. ఉన్న కొన్ని సీన్లలో (పాటల్లో) కొంత గ్లామరస్ గా కనిపించటం తప్ప. యోగిబాబు కొంత హాస్యాన్ని పండించాడు. వివిధ పోలీసు  పాత్రల్లో కొంతమంది బానే చేశారు. ముఖ్యంగా లేడీ పోలిస్ పాత్రలో హిందీ  టీ.వీ నటి “శమత అంచన్” బాగా నటించింది. విలన్ పాత్రలో “ప్రతీక్ బబ్బర్” చిన్న పాత్రలో ఉన్నాడు(?). ఈ సినిమాలో మురుగదాస్ ముంబై నేపథ్యాన్ని  చక్కగా చూపించాడు. అందుకు అనుగుణంగానే నటీనటులను ఎంపిక చేసుకోవటం సినిమాకు కలిసొచ్చే అంశం.
అది కూడా సినిమాను ఓ రేంజ్ లో ఉంచింది. దాదాపుగా సినిమా మొత్తం ముంబై లో చిత్రీకరించటం వల్ల ఇది సాధ్యమయ్యింది. హిందీ  ప్రేక్షకులకు ఈ సినిమా కొంత నచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో చిత్రీకరణ రిచ్ గా ఉంది.
కొన్నిచోట్ల కథనం పేలవంగా సాగడం ,చాలా సన్నివేశాలు సాగడం ఒక లోపం. సెకండ్ హాఫ్ లో బిగువైన కథనం తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనుక ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అనిరుధ్ మంచి సంగీతాన్ని అందించాడు ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉన్నది. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఆకట్టుకునే స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ కథ కు కనెక్ట్ కాకపోవటం వల్ల  చాలా సన్నివేశాలు తేలిపోయాయి. మురగదాస్ చేసిన ఇంకో పొరపాటు లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ను ఎక్కువ సేపు నడపటం  దాన్ని కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈసారి పూర్తి స్థాయి లో ఆకట్టుకోలేదు అని చెప్పాలి. స్క్రీన్ ప్లే పై పెట్టిన శ్రద్ద  కథపై పెట్టలేదు. కొన్ని చోట్ల బ్రిలియంట్ అనిపించినా, చాలా చోట్ల సాదా సీదాగా ఉండటం వల్ల సినిమా కొంత వీక్ అయినట్లు అనిపిస్తుంది.. అయితే కబాలి, కాలా, 2.0,పేట తర్వాత రజిని కి ఈ సినిమా కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అలాగే “స్పైడర్” డిజాస్టర్ తర్వాత “దర్బార్” మురుగదాస్ కు  కూడా కొంత రిలీఫ్ ఇవ్వొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇది రజినీ ఫ్యాన్స్ ను అలరించడానికి తీసిన సినిమా.ఈ సినిమా రజనీ అభిమానులకు ఫర్వాలేని విందు భోజనమే!

(సలీమ్ బాష,రచయిత, మూవీ క్రిటిక్, జర్నలిస్టు, మోటివేషనల్ స్పీకర్)