యముడితో గోల … ఎపుడూ సూపర్ హిట్ సినిమాయే

(సిఎస్ఎ షరీఫ్)

ఒక యువకుడు  (హీరో), చనిపోయో, లేక యమకింకరుల పొరపాటు వల్లో యమలోకానికి వెళ్ళడం అక్కడ యముడితో సవాళ్లు చేయడం, గందర గోళం సృష్టించడం, యమలోకం లోని ఆచార వ్యవహారాలు, భూలోకం లోని, సమకాలీన జీవితం, సాంఘిక సమస్యలు  అన్నీ కలిపి నవ్వు పుట్టించే సన్నివేశాల తో సరదాగా సాగిపోయే కథాంశాన్ని కొద్దిపాటి మార్పుళూ చేర్పులూ చేస్తూ  అప్పటినుండీ ఇప్పటివరకూ  తెలుగు లో అనేక సినిమాలు తీశారు. ఇది ఒక సోసియల్ ఫాంటసీ కథ.

ప్రఖ్యాత దర్శకుడు సి. పుల్లయ్య దర్శకత్వం లో 1953 లో “పక్కింటి అమ్మాయి” అనే చిత్రం వచ్చింది. ఇది ఒక బెంగాలి చిత్రం అధారంగా నిర్మించ బడింది. ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. అలాంటిదే ఇంకో సరదా చిత్రపు  కథ కోసం వేచి వున్న పుల్లయ్య కు 1958 లో “జమలాయె జి బాంతో మాణుస్” (యమలోకం లో జీవం తో వున్న మనిషి) అనే బెంగాలి చిత్రం దొరికింది. ఈ చిత్రం దీన బంధు మిత్రా అనే ప్రఖ్యాత బెంగాలి నాటక రచయిత అదే పేరు తో రాసిన కథ ఆధారంగా తీశారు. బెంగాలీ లో ఆ చిత్రం సూపర్ హిట్ అవడం చూసి పుల్లయ్య ఆ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో నిర్మించడానికి అవసరమైన హక్కులు కొనుక్కుని తెలుగులో దాన్ని “దేవాంతంకుడు” (1960) గానూ, తమిళం లో “నాన్ కంద సొర్గం”  గానూ ఒకే సారి నిర్మించాడు.

చిత్ర కథ :

సుందర్ (ఎన్.టీ. రామారావు), మీనాక్షి (కృష్ణకుమారి) ప్రేమించు కుంటారు. సుందర్ అంటే ఇష్టం లేని మీనాక్షి తండ్రి భద్రయ్య (కె.వి.ఎస్.శర్మ) మీనాక్షి పెళ్లి ఒక ధనవంతుడితో చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఇదిలా వుండగా సుందర్, మీనాక్షిలు,  సుందర్ స్నేహితుల సహాయం తో పెళ్ళిచేసుకుంటారు.  ఇది తెలిసి భద్రయ్య గూండాలతో సుందర్ ను కొట్టించి మీనాక్షిని ఇంటికి తీసుకు వెళతాడు. ఇది భరించలేని మీనాక్షి ఒక నదిలో దూకి ఆత్మ హత్య కు పాల్పడుతుంది. యమకింకరులు వేరెవరి కోసమో భూలోకానికి వచ్చి పొరపాటున, నిద్ర పోతున్న సుందర్ ని యమలోకానికి తీసుకు వెళతారు.  అక్కడ సుందర్ నానా గందరగోళం సృష్టిస్తాడు. చివరికి దేవతల ఆశీర్వాదం తో వైకుంఠం లో వున్న మీనాక్షితో పాటు తనూ పునర్జీవితులై భూలొకానికి  వెళతారు.  ఈ చిత్రం లో యముడిగా ఎస్ వి రంగారావు నటించాడు.

 

దాదాపు 17 సంవత్సరాల తరువాత మళ్ళీ దేవాంతకుడు సినిమాలో హీరో గా చేసిన  ఎన్. టీ. రామారావే హీరో గా ఈ కథాంశం “యమగోల” సినిమాగా వచ్చింది.  ఎన్. టీ. రామా రావు, జయప్రదలు జంటగా 1977 లో తాతినేని రామారావు దర్శకత్వంలో “యమగోల” వచ్చింది. . ఈ చిత్రం లో యముడిగా కైకాల సత్యనారాయణ నటించాడు. ఇది సూపర్ హిట్

చిరంజీవి, రాధ  జంటగా 1988 లో  ఈ కథాంశం రవిరాజా పినిశెట్టి దర్శకత్వం లో “యముడికి మొగుడు” పేరు తో వచ్చింది. ఈ చిత్రం లో యముడిగా కైకాల సత్యనారాయణ నటించాడు.  ఇది సూపర్ హిట్

ఆ తరువాత 1994 లో ఎస్.వి. కృష్ణారెడ్డి  దర్శకత్వం లో అలి, ఇంద్రజల జంట తో యమలీల వచ్చింది. ఈ చిత్రం లో యముడిగా కైకాల సత్యనారాయణ నటించాడు. ఈ సినిమా కూడా అప్పట్లో హిట్ కొట్టింది.

జూనీయర్ ఎన్.టీ.ఆర్, ప్రియమణి జంటగా, 2007 లో “యమదొంగ”  చిత్రం వచ్చింది. దీనికి దర్శకత్వం ఎస్. ఎస్. రాజమౌళి. యముడిగా మోహన్ బాబు నటించాడు. ఇదీ సూపర్ హిట్టే.

ప్రేమకథలూ, రాజకీయాలూ, ఫాక్షన్లు, మాఫియా, టెర్రరిజం కథలతో బరువైన సినిమాలు చూసే ప్రేక్షకులకి ఆపుడప్పుడు ఇటువంటి సోషియో ఫాంటసీ కామెడీ సినిమాలు కొంత రిలీఫ్ ఇస్తాయనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *