రీమేక్ చిత్రాల ట్రెండ్ సెట్టర్ ఎల్ వి ప్రసాద్, దేశంలో మొదటి రీమేక్ చిత్రమెవరిది?

సినిమాలను ఒక భాష నుంచి మరొక భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య చాలా సాధారణమయింది. అందునా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేయడం ఇంకా సర్వసాధారణమయింది.
ఆమాటకొస్తే బాలివుడ్ కష్టాల్లో ఉన్నపుడు రీమెక్ చిత్రాలే ఆదుకునేవి. తెలుగు  చిత్రాలను, కాకపోతే,తమిళ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసి నిర్మాతలు ఆర్థికంగా గట్టెక్కిన సందర్భాలు కోకొల్లలు.
శ్రీదేవి భర్త  బోనీ కపూర్ తెలుగు రీమేక్ చిత్రాలద్వారాలో సక్సెస్ అయ్యారు. మొత్తం ఇండస్ట్రీ పరంగా తీసుకంటే  బాలివుడ్ ఎపుడూ సౌత్ లో హిట్టయిన చిత్రాల మీద ఒక  కన్నేసే ఉంచేది.
సౌత్ లో సూపర్ డూపర్ గా హిట్టయిన చిత్రాలను హిందీలో తీసేవాళ్లు. ఉత్తరాది ప్రజలుకు వాటిని విరగబడి చూసేవారు. ఈ ట్రెండ్ కు ఆధ్యుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్(ఎల్ వి ప్రసాద్ 1908 జనవరి 17- 1994 జూన్ 22). ఆయనకు హిందీ సినిమా రంగంతో బాగా పరిచయడం ఉండటంతో ఉత్తరాది ప్రజలేం కోరుకుంటారో తెలుసుకుని రీమేక్ లు మొదలుపెట్టారని చెబుతారు.  అందుకే ఆయన రీమేక్ చిత్రాలన్నీ హిట్టే.
తెలుగు/తమిళంలో తాను తీసిన సూపర్ హిట్  లను 1950 దశాబ్దంలో  హిందీలో  బాగా రీమేక్ చేసి విజయవంతమయి  రీ మేక్ ట్రెండ్ సృష్టించారు.
1956లొ తెలుగులో హిట్టయిన ఇలవేల్పును శారద (1957)గా హిందీలో రాజ్ కపూర్ తో తీశారు.  ఇదే విధంగా 1955లో తెలుగులో హిట్టమయిన మిస్సమ్మ   1957 ఫిబ్రవరిలో మిస్ మేరీ గా హిందీలో వచ్చింది. 1969 తమిళ హిట్ చిత్రం ఎన్ థంగై ని చోటీ బహెన్ గా బలరాజ్ సహానితో తీశారు. (ఇదే తెలుగులో ఆడపడచుగా ఆలస్యంగా1967లో విడుదలయింది.) 1959 నాటి ఇల్లరికం హిందీలో ససురాల్ గా 1961లో  రీమేక్ అయింది. ఇలా ఆయన రీమేక్ ట్రెండ్ 1970 దశాబ్దం దాకా కొనసాగింది. ఇవన్నీ విజయవంతం కావడంతో జితేంద్ర, తర్వాత బోనీ కపూర్ లు ఈ ట్రెండ్ ని పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్లారు.
1970లో జితేంద్ర, 1980,1990 దశాబ్దాలలో బోనీకపూర్ తెలుగు చిత్రాలను బాలివుడ్ లో భారీగా పునర్నిర్మించారు. 1980 నుంచి 2015 వరకు బోనీ కపూర్  15 తెలుగు సూపర్ హిట్ చిత్రాల రీమేక్ రైట్స్ కొనుకున్నారు. వోసాత్ దిన్ (అందా ఏళ్ నాటకల్/రాాధాకల్యాణం),  జుదాయ్ (శుభలగ్నం) , తేవర్ (ఒక్కడు) లు  సూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజుకి కనీసం పది తెలుగు సినిమాలను హిందీలో రిమేక్ చేసేందుకు బాలివుడ్ పెద్దలు హక్కులు కొన్నట్లు సమాచారం.
మీకు తెలుసో లేదో మొదటి టాకీ ఆలమ్ ఆరాలో నటించిన ఇద్దరు తెలుగు జూనియర్ నటుల్లో ఎల్ వి ప్రసాద్ ఒకరు. ఆయన అలా అలా పెరిగి దక్షిణాది చిత్రసీమలో ఆకాశమంతెత్తు ఎదుగుతారని ఆరోజెవరూ అనుకోని ఉండరు. ఆయన జూనియర్ ఆర్టిస్టుగా హిందీలో నటించిన ముచ్చట మరొక సారి చెపుకుందాం.ఇపుడు మళ్లీ రీమేక్  దగ్గరికి వద్దాం.
తమిళ తెలుగు చిత్రాలను హిందీ ఆడియన్స్ కు పెద్ద ఎత్తున పరిచయం చేసినా తొలి రీమేక్ చిత్రం ఆయనది కాదు.
 1950 దశాబ్దంలో కొత్త ఐడియాల కోసం బాలివుడ్ మద్రాసు రాష్ట్రం వైపు చూసింది. అపుడు దక్షినాది సినిమా కేంద్రం మద్రాసే కదా.అలాగే తమిళ నిర్మాతలు కూడా పెద్ద మార్కెట్ కోసం హిందీ వైపు చూసే వారు.  తమిళ సినిమాని హిందీలో  రీమేక్ చేయాలన్న ఆలోచన మొదట ఏవిఎం ప్రొడక్షన్స్ కు  వచ్చింది. 1951 లో వారి రీమేక్ హిందీ చిత్రం  అక్టోబర్ 26న  విడుదలయింది. ఆచిత్రం పేరు బహార్ (Bahar). ఇదే ఇండియాలో తొలి రీమేక్ చిత్రం.
వైజయంతిమాలను హీరోయిన్ గా హిందీకి పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే.  హీరో కరణ్ దీవాన్. సంగీతం ఎస్ డి బర్మన్.పాటలు రాజేంద్ర క్రిషన్.  బహార్  1949లో తమిళంలో సూపర్ హిట్టయిన  వాళ్ కై  (Vazhkai) రీమేక్. దాని దర్శకుడు ఎంవి రామన్. ఆయనే  వైజయంతిమాలను ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయంచేశారు.  బహార్ ఎవిఎం ప్రొడక్షన్స్ వారి తొలి హిందీ చిత్రం కూడా. హిందీ  బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో వైజయంతిమాల తొలి చిత్రంతోనే హిందీలో పాపులర్ అయ్యారు.ఇదిగో ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే.
బహార్ తర్వాత వైజయంతిమాలను లడ్కీ (1953), నాగిన్ (1954) చిత్రాలు ఆకాశానికెత్తేశాయి. దీనితో దక్షిణాది హీరోయిన్లు హిందీ చిత్రసీమను డామినేట్ చేసేందుకు బాట ఏర్పడింది.  పద్మినీ, హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రదలు ఈ వరవడిలోనే బాలివుడ్ ను మెస్మరైజ్ చేసిన సౌత్ఇండియా హీరోయిన్లు.
వాళ్ కై   1949లో మద్రాసు కోడంబాకమ్ లో   ఏవిఎం స్టూడియోస్ లో నిర్మాణమయిన తొలిసినిమా కూడా. నిజానికి వాళ్లు తమ కరైకూడి స్టూడియోలో ఈ చిత్రాన్ని కొంతవరకు తీశారు. అయితే, అది ముందకు సాగలేదు.  తర్వాత మద్రాసు స్టూడియో నిర్మాణం పూర్తయ్యాక  వాళ్ కై కి మోక్షం లభించింది. ఈ చిత్రానికి ఒక చక్కటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి  హీరోయిన్ గా కావాలి. ఎవియం మైయప్పన్ హీరోయిన్ కోసం వెదుకుతున్నపుడు రామన్ తనకు తెలిసిన వైజయంతిమాల గురించి చెప్పారు. ఆమ్మాయి ముఖంలోని కళ, రంగు, నాట్యం, మాటతీరు అన్ని నిర్మాతకు తెగ నచ్చాయి. మూడేళ్ల కాంట్రాక్టుతో వైజయంతిమాలను ఎవియం చిత్రాల్లోకి తీపుకు వచ్చింది. హీరోయిన్ ప్రాతని వైజయంతిమాల డ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని బాగా మార్చారు. చిత్రంలో ఆమెకు మూడు డ్యాన్సలున్నాయి. అందులో ఒకటి భారత దేశం మీద సుబ్రమణియ భారతి రాసిన దేశభక్తి గేయం ఉంది.దీనిని డికె పట్టమ్మాళ్ పాడారు. ఇతర పాటలను కర్నాటకసంగీత విద్వాంసురాలు ఎమ్ ఎల్ వసంతకుమారి పాడారు.

హిందీ బహార్ విషయానికి వస్తే 1951 లో సూపర్ హిట్టయిన పది చిత్రాలలో ఇదొకటి. ఎవిఎంకు బ్రహ్మాండమయిన కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఈ చిత్రంలో కిషోర్ కుమార్  ఖసూర్ ఆప్ కా పాటతో బాగాపాపులర్ అయ్యారు. అదే ఆయన గొప్పగాయకుడిగా నిలబెట్టిందని కూడా చెబుతారు.