బీదలపాట్లు (1950) సినిమా విశేషాలు తెలుసా?

(అహ్మద్ షరీఫ్)
విక్టర్ హ్యూగో అనే ఫ్రెంచి నవలా రచయిత, 1862 లో “లే మిసరాబ్లా (Les Misérables) అనే నవల రాశాడు. విక్టర్ హ్యూగొ పేరూ, ఆ నవల పేరూ దాదాపు అందరికి సుపరిచితమే. ప్రపంచంలో అరడజను బెస్టు నవలు ఎంపిక చేస్తే అందులో ఇదొకటవుతుంది.
చదవని వాళ్లకూ గుర్తుండే పుస్తకం ఇది. అన్ని కాంపిటీషన్ పరీక్షల్లో, ఒక జీకె ప్రశ్న గా ఈ నవల ఎపుడూ ప్రత్యక్ష మవుతూ ఉంటుంది.  ఈ నవల ఆధారంగా ప్రపంచం లో సినిమాలు  తీయగల్గిన అన్ని భాషల్లోనూ దాదాపు 30 కి పైగా సినిమాలొచ్చాయి.
ఇదే నవల ఆధారంగా తెలుగులోనూ  1950 లో మొదట ఒక సినిమా వచ్చింది. అదే  “బీదల పాట్లు” . ఈ సినిమాలో చిత్తూరు నాగయ్య హీరో. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి నిర్మించారు. రెండింటిలోనూ హీరో నాగయ్యే. రెండు భాషల్లోనూ ఈ సినిమా అప్పాట్లొ సూపర్ హిట్ అయింది.
దాదాపు 22 సంవత్సారాల తరువాత ఇదే కథ అధారంగా బి. విఠలాచార్య దర్శకత్వంలో 1972 లో  అక్కినేని నాగేశ్వర రావు హీరో గా మరో సినిమా వచ్చింది.

ఇదీ టూకీగా బీదల పాట్లు (1950) సినిమా కథ:
 కొండయ్య (నాగయ్య) అనే యువకుడు ఆకలి తో వున్న తన మేనకోడలి కోసం  ఓ రొట్టె ను దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన కొండయ్య దొరికి పోయి జైలు కి వెళతాడు. కొన్ని రోజులు జైలు లో వున్న కొండయ్య, జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇన్స్పెక్టర్ జావర్ చేతి కి  మళ్లీ    దొరికిపోతాడు. ఈ సారి పదేళ్లు కారాగార శిక్ష పడుతుంది. శిక్ష పూర్తి అయి బయటికి వచ్చిన కొండయ్య ఒక చర్చి ఫాదరు బోధనల ద్వారా మంచి వాడిగా మారతాడు. కరుణాకర్ అనే మారు పేరు తో ఒక గాజు ఫ్యాక్టరీని స్థాపిస్తాడు. మెల్లగా అతడు మేయర్ అవుతాడు.  ఈ లోపు అతడి మేనకోడలు రాజం చనిపోతుంది. ఆమె చనిపోయిన తరువాత కొండయ్య ఆమె కూతురు  లక్ష్మి ని  పెంచుతాడు. ఆ అమ్మాయి ఉమాకాంతం అనే స్వాతంత్ర యోధుడిని ప్రేమిస్తుంది.
ఒక రోజు ఆందోళన కారులకూ పోలీసులకూ మధ్య జరిగే ఘర్షణలో ఇన్స్పెక్టర్ జావర్ అందోళన కారులకు బందీ అవుతాడు. కొండయ్య అతణ్ణి రక్షిస్తాడు. ఈ విషయాన్ని పక్కన బెట్టి జావర్   కొండయ్యను ఎలాగైనా పట్టుకుని మళ్లీ జైలుకు పంపించాలనే వుద్దేశ్యం తో వుంటాడు. ఒక రోజు ఉమాకాంత్ పోలీసుల కాల్పులతో గాయ పడతాడు. అతడిని కొండయ్య ఇంటి కి తెచ్చు కుంటాడు. అప్పుడు  కొండయ్యను వెంబడించిన జావర్  కొండయ్యను కలుసుకుంటాడు. కొండయ్య జావర్ కి లొంగి పోవాలనుకుంటాడు. వృత్తి ధర్మం, న్యాయాల మధ్య ఎటూ తేల్చు కో లేని జావర్ ఆత్మ హత్యకు పాలు పడతాడు. చివర్లో లక్ష్మి కి ఉమాకాంత్ కు పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి చూసిన  కొండయ్య ఆ తరువాత ప్రశాంతంగా చనిపోతాడు.
ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు
చిత్తూరు నాగయ్య ఇప్పటి తరానికీ, గత తరానికీ కూడా ఒక క్యారక్టర్ నటుడి గానే తెలుసు. అయితే నాగయ్య హీరో గా అందులోనూ అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఏ కొద్దిమందికో తెలుసు. 1950 దశకం ప్రాంతం లో తెలుగు హీరో లు  ఒక సినిమాకి పాతిక ముప్ఫై వేల పారితోషికం తీసుకునేటప్పుడు నాగయ్య లక్ష రూపాయల పారితోషికం తీసుకునే వాడట.  ఈ సినిమాలో హీరో వేషం వేయటమే కాకుండా నాగయ్య దర్శకత్వాన్ని, సంగీతాన్ని పర్యవేక్షించాడు. సినిమాలో పాటలు కూడా పాడాడు. ఈ సినిమాలో “ధన్యుడ నైతిని గా” మరియు “చిన్నారి పాపా బంగారు కొండా” అనే రెండు పాటలకు బాణీలు కూడా సమకూర్చాడు.

LIKE THIS STORY? SHARE IT WITH FRIENDS?

దీన్లొ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించిన సీతారామన్ నిజానికి ఒక స్క్రిప్టు రచయిత. ఈ సినిమా కథా చర్చల కోసం దర్శకుడు రాం నాథ్ పిలుపు మేరకు స్టుడియో కి వచ్చిన సీతారామన్ ను చూసి రాం నాథ్ “నా జావర్ దొరికాడు” అన్నాడట. అలా ఆ సినిమాలో జావర్ పాత్ర పోషించిన సీతారామన్ తన అద్భుత నటనతో ఆ తరువాత సినిమా అభిమానుల్లో జావర్ ఇంటి పేరులా “జావర్ సీతా రామన్” అయిపోయాడు.
ఈ సినిమాలో సెరుకులాథూర్ సామా బిషప్ పాత్రను పోషించాడు. కొండయ్య గా నటించిన  నాగయ్య కు మంచి తనం బోధిస్తాడు. అక్కినేని నాగేశ్వర రావు హీరో గా వచ్చిన బీదల పాట్లు (1972) సినిమాలో ఈ బిషప్ పాత్రను 1950 బీదల పాట్లు సినిమాలో హీరో గా నటించిన నాగయ్య పోషించడం ఓ విశేషం.
“అన్నింటికంటే ముఖ్యంగా ప్రముఖ గీత రచయిత, ఆరుద్ర “ఓ చిలుక రాజా నీ పెళ్లెపు డయ్యా”  అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశాడు.
ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. భాగవతుల సదాశివశంకర శాస్త్రి అంటే ఆరుద్ర అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసివుండవచ్చు , “ఆరుద్ర” అంటే సినీ ప్రేక్షకులకి కనీసం గత తరం వారికి అందరికీ తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *