సినిమాని తన పాట చుట్టూ తిప్పుకున్న తెలుగు మేటి నటి కమలాదేవి

( చందమూరి నరసింహారెడ్డి)
టిజి కమలాదేవి బాల్యం నుంచే నటనలో అధ్బుతమైన ప్రతిభ ను కనపరిచింది. ఆమె నటనకే పరిమితము కాలేదు. సినీ గాయని గా, క్రీడాకారిణి గా, రంగస్థల నటిగా, రేడియో గాయని గా అనేక రంగాల్లో పేరు గడిచింది.
కమలాదేవి అందం అభినయం శ్రావ్యమైన గొంతు ఆమె సొంతం. ఆమె తన గానంతో,నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను 1940,50 దశాబ్దాలలో మైమరపించింది.
రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు రంగాలలో కూడా ఆమె ఎదరులేని శక్తిగా నిలబడ్డారు.
టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్‌ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. ఈమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి తోట కృష్ణస్వామి నాయుడు. కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. కమలాదేవి అసలు పేరు తోట గోవిందమ్మ.
తండ్రి వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా నివాసాన్ని కార్వేటినగరం నుండి పుత్తూరుకు మార్చాడు.
కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్ లో ఐదవక్లాస్‌ వరకు చదివింది.
ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచురామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్‌ తరపున ఓపెన్‌ రికార్డింగ్‌లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది.
సిహెచ్ బి వెంకటాచలంతో కలసి ఆమెో చేసిన  తొలి  గ్రామఫోన్ రిక్డార్డు 11వ యేటనే విడుదలయింది. ఒక గాయకుడికి ఆరోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డు విడుదల కావడంలో ఎంతో గొప్పవిషయం.అలాంటిది కమలా దేవికి 11 వ యేటనే ఆ ఆవకాశం లభించింది.
ప్రాథమిక పాఠశాలలో చదవువుతున్నపుడు ’ఒక తార‘ అనే నాటకంలో ప్రధాన పాత్ర ‘తార’ ని పోషించారు.
టి.చలపతిరావు ఈమెకు ‘నేను కనలేని జీవితము…’ అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్‌ రికార్డింగ్‌లో పాడించాడు. చిన్న వయస్సులోనే గుణసుందరి, కనకతార, భూపుత్రి, ఐదు పువ్వుల రాణి వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది.
 అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్యతో జరగడంతో  ఆమె మిగతా బాల్యం చెన్నై కి మారింది.  అక్కడి  మైలాపూర్, మాంబళంలలో పెరిగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలో సంగీత, పౌరాణిక నాటకాలలో, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.  అమెరికన్ స్కూలులో మెట్రిక్యులేషన్  పూర్తి చేశారు. అపుడే రేడియోలో కూడా పలు పాటలుపాడారు.
పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు.
మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా టిపికల్ రాజుగారి లాగా బంగారపు గొలుసు బహూకరించబోయారు.  అయితే, ఆ సమయానికి ఆయన మెడలో గొలుసు లేదు. అందువల్ల ఆ  బహుమానం వాయిదా పడింది రాజాగారు మరో కార్యక్రమంలో గొలుసును బహూకరించారు.
ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
1941లో ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. ఆ సంవత్సరం తమిళ డైరెక్టర్  పి.కె. రాజా శాండో జానకి పిక్చర్స్‌ పతాకం మీద  తెలుగులో ‘ చూడామణి ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అందులో నటించే అవకాశం కలిపించారు. అందులో సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు చెల్లెలుగా నటించింది. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరును గోవిందమ్మగానే ఉంది.
అదే సంవత్సరం వరసగా మూడు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. రోహిణీ పిక్చర్స్‌ నిర్మాత హెచ్‌.ఎం. రెడ్డి నిర్మించిన ‘ తెనాలి రామకృష్ణ’ లో   ఎల్ వి ప్రసాద్ తో కలపి  నటించారు. పార్వతి కళ్యాణం సినిమాలోనే తన పేరును కమలాదేవి గా మార్చుకుంది. ఈ సినిమా లో ఐదు పాటలను ఆమెమే పాడారు.
తరవాత దక్షయజ్ఞం ’ సినిమాలో ‘రోహిణి’ పాత్రను పోషించింది. అందులో చంద్రుడుగా నటించిన ఆదిశేషయ్యతో కలిసి ‘ఆహా జగమంతా ప్రేమా, ఆనందముగా శశిధర కళల పులకాంకితమౌ ఘనమోహన లీలా’ అనే పాటను కూడా పాడింది. ఈ మూడు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. ఇదే సమయంలోనే ఆమె తొలిసారి తమిళ చిత్రం ‘సెల్లాదు కాసు’ లో నటించారు.
1943లో ‘ గరుడ గర్వభంగం’ సినిమా లో కమల పాత్రకోసం ‘ పురుషులు సామాన్యులా, మురిపించి నమ్మింతురే…ఈ పురుషులు సామాన్యులా’ అనే పాటను పాడింది.
1944లో ‘ సీతారామ జననం’ సినిమాలో అహల్య పాత్రను కమలాదేవి పోషించింది. ‘ అహో…నే ధన్యనైతినిగా తారకనామా శ్రీరామా’ అనే పాటను ఈమె పాడింది. ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘ తుమ్మెదా తుమ్మెదా.. దిగులెందుకు తుమ్మెదా’ అనే పాటను పాడుతూ నటించింది కమలాదేవి.
మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది.
ఈ సినిమాలన్నింటిలోకూడా ఆమె చెల్లెలు పాత్ర లేదా అలాంటిసహాయ నటి పాత్రలే పోషించారు. ఇలా సుమారు 70 చిత్రాలు నటించాక ఆమెకు హిరోయిన్ అవకాశం లభించింది. ముగ్గురు మరాఠీలు సినిమాలోఅక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా నటించారు . అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌. ముగ్గురు మరాటీలలో హీరో, హీరోయిన్ ఒకే పాట ఉంది. కమాల దేవికి అయిదు సోలో పాటలున్నాయి. దీనిని బట్టి ఆమె పాటలకు ఎంతమంది అభిమానులున్నారో అర్థమవుతుంది.

తరువాత ఆమె చక్రపాణి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.
కమలాదేవి తనపాత్రలకు పాడుకోవడమే కాకుండా ఇతర నటీమణులకు డబ్బింగ్ చెప్పేవారు.మంచి డబ్బింగ్ కళాకారిణి గా కూడా ఆమె పేరు వచ్చింది. 1964లో చిత్తూరు నాగయ్య నిర్మించిన భక్తరామదాసు సినిమాలో కన్నాంబకు, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలో జి.వరలక్ష్మికి , ‘పాండురంగ మహాత్మ్యం’లో బి.సరోజాదేవికి, ‘సంపూర్ణ రామాయణం’లో పద్మినికి డబ్బింగ్‌ చెప్పారు.
జూపిటర్‌ ఫిలిమ్స్‌ భాగస్వామి కోవై అయ్యముత్తు 1947లో తమిళంలో నిర్మించిన ‘కంజన్‌’(పిసినారి) సినిమాలో హీరోయిన్‌గా కమలాదేవి నటించారు.
ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకున్నారు.
1945 నుంచే ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది బాలాంత్రపు రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావు బాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసే వారు.
కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. అందుకే సినిమాల్లో నటించే రోజులలో కూడా నాటకాలను వదల్లేదు. అన్నిరకాల నాటకాలలో నటించారు. పౌరాణికాలలో నారదుడు(సావిత్రి) , తులభారంలో కృష్ణుడు, రోషనార వంటి చారిత్రక నాటకాలలో రోషనార, సాంఘిక నాటకాలు ’విడాకులు‘లో సోదరి పాత‌్రలో, ‘గాలివాన లో’ ఇందిర అనే హీరోయిన్‌ పాత్రలో ఆమె నటించారు.గాలివాన నాటకంలో ఆమె పాత్రకి మంచి పేరొచ్చింది.  బండారు నాటక కళా పరిషత్ పోటీలలో ఆమె ఉత్తమ నటి అవార్డు వచ్చిందీ నాటకం తోనే.
సతీసావిత్రి, తులాభారం, కీచక వధ వంటి నాటకాలలో నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిగా ప్రేక్షకు మనుసులో చెరగని ముద్రవేశారు. అలెగ్జాండర్ పాత్ర ఆమెకు బాగా  గుర్తింపు తెచ్చిపెట్టింది.
బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్‌,ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకి గానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది.
అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, కబీరు, నూర్జహాన్ తమిళనాడులోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. ఆచార్య ఆత్రేయ ‘పరివర్తన’ నాటకంలో ఆమె  అప్పటి ప్రఖ్యాత హాస్యనటుడు రమణారెడ్డితో  కలసి నటించారు.
సావిత్రి నాటకంలో నారడుడుగా, కీచకవధలో ఉత్తరగా, తులాభారంలో నళినిగా, విడాకులు అనే సాంఘిక నాటకంలో సోదరి పాత‌్రన్రు, గాలివాన సాంఘిక నాటకంలో ఇందిర అనే హీరోయిన్‌ పాత్రను సమర్ధవంతంగా పోషించి ఆమె మంచి పేరుతెచ్చుకుంది.
1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకున్నారు. 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించారు. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్ తో బెంగళూరులో తలపడ్డార. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడ్డారు.
1994, 1995లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచారు.  తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేత అయ్యారు.
జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి భారతీయ మహిళ కమలాదేవియే.
బిలియర్డ్స్ ఆటలో 1991లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలబడ్డారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆవుల చంద్రబాబు నాయుడుతో న 1946లో ఆమెకు వివాహమయింది. ఆయన మద్రాసు నగర నీటి సరఫరా సంస్థలో ఇంజనీరుగా పనిచేసేవారు.వారిద్దరూ అనార్కలి నాటకంలో కలిసి నటించారు.  పెళ్ళయ్యాక ఆమె   సినిమాలకు దూరమయ్యారు.వీరి కుమారుడు జయచంద్ర న్యాయవాది వృత్తిలో వున్నాడు.
1984 లో వచ్చిన  ‘కుటుంబగౌరవం’ ఆమె నటించిన చివరి చిత్రం.
మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ లో 1950లో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవలందించారు.
చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీకి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి.
1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను నాటక కళాపూర్ణ అవార్డుతో సత్కరించింది.
ఈస్ట్‌ బెర్లిన్‌ లో జరిగిన మ్యూజికల్‌ థియట్రికల్‌ వేడుకల్లో భారత దేశానికి  కమలాదేవి ప్రాతినిధ్యం వహించారు.కమలదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గాపనిచేశారు.
ఆగస్టు 16, 2012 చెన్నై లో మరణించారు

 

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)

 

Like this story?  Share it with a friend!