తెలుగు చిత్రసీమలో ఆస్కార్ టాలెంట్ లేదా?

ఒక సంవత్సరంలో కొన్ని వందల సినిమాలు తీయగల సత్తా ఉన్న పరిశ్రమ, ప్రపంచంలో లో మూడో స్థానంలో   ఉన్న పరిశ్రమ తెలుగు సినిమా రంగం, కాని ఒక్కటంటే ఒకేసారి ఒక సినిమాని ఆస్కార్ కు పంపించగలిగింది.
2019 వరకు ఎన్నో సినిమాలు తీసినప్పటికీ,” స్వాతిముత్యం” (1986) విదేశీ సినిమా కేటగిరిలో భారతదేశం నుంచి ఆస్కార్ కు వెళ్ళింది.

 

ఇప్పటివరకు మనదేశం లోని వివిధ భాషల నుండి 50కి పైగా సినిమాలు ఆస్కార్ నామినేషన్ కి వెళ్ళినా, కేవలం మూడంటే మూడు సినిమాల నామినేట్ చేయబడ్డాయి. 1957 లో మదర్ ఇండియా తర్వాత, మళ్లీ 1988 లో ” సలాం బాంబే”,  2001 లో ” లగాన్” నామినేషన్ పొందినప్పటికీ ఆస్కార్ లో సాధించలేకపోయాయి!
ఇంతవరకూ కొన్ని వేల సినిమాలు నిర్మించబడినప్పటికీ , ఒక్కటంటే ఒక్కటి ఆస్కార్ సాధించలేక పోయింది అంటే, మన సినిమాల క్వాలిటీ గురించి ఆలోచించాల్సి వస్తుంది.
భారతదేశంలో చాలా మంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. చాలా మంచి సినిమాలు కూడా తీశారు. కానీ లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. మన వాళ్ళు ప్రచారంలో, మార్కెటింగ్ లో వెనుకబడి ఉన్నారని ఒక అభిప్రాయం ఉంది. తెలుగులో నర్తనశాల తర్వాత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన సినిమా స్వాతిముత్యం మాత్రమే. నిజానికి అంతకు ముందు, తర్వాత కూడా చాలా గొప్ప సినిమాలు వచ్చాయి.
సత్యజిత్ రే లాంటి దర్శకుడు తన రెండు సినిమాలను (పథేర్ పాంచాలి, అపూర్ సన్సార్,) పంపించ గలిగాడు. ఫథేర్ పాంచాలి అంతర్జాతీయంగా ఎన్ని అవార్డులు గెలుచుకుందో, ఎన్ని ప్రశంసలు పొందిందో లెక్కేలేదు. కాని అస్కార్ ను అందుకోలేకపోయింది, అదే ఆశ్చర్యం

 

 

అలాగే కమలహాసన్ సినిమాలు 9 నామినేషన్ కోసం వెళ్లాయి. అమీర్ ఖాన్ నాలుగు సినిమాలు కూడా నామినేషన్ కి వెళ్లాయి. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఆస్కార్ లో  ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగరి 1957 లో మొదలయింది.  మొదట ఈ అవార్డ్ కు నామినేట్ అయిన భారతీయ చిత్రం మదర్ ఇండియా.  ఈ చిత్రం అవార్డు గెల్చుకుంటుందేమో అనేంత దగ్గరగా వెళ్లింది. చివరకు అవార్డు ఆ యేడాది ఇటాలియన్ చిత్రం నైట్స్ అఫ్ క్యాబిరియా (Nights of Cabiria)కు వెళ్లింది. ఎన్ని చిత్రాలను పంపుతున్నా అవార్డుకు నామినేట్ అయినా చిత్రాలు మూడే. అవి మదర్ ఇండియా(1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001).
అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రచారం, మార్కెటింగ్ సమస్య కూడా ఒక కారణం కావచ్చేమో. కొన్ని వర్గాల కథనం ప్రకారం ఇంకో సమస్య ఏంటంటే, మన నిర్మాతలు మార్కెటింగ్ కి డబ్బులు ఖర్చు పెట్టరు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశానికి ఒక ఆస్కార్ కూడా రాకపోవడం కొంచెం విచారకరమే.
ఇతర భాషల్లో చాలా మంచి చిత్రాలు వచ్చినప్పటికీ, హిందీ సినిమాలు మాత్రమే ఎక్కువగా నామినేషన్ కి పంపించ బడ్డాయి. మనదేశం నుండి ఇంతవరకూ వివిధ భాషలలో ఆస్కార్ కు పంపించిన సినిమాలో ఎక్కువ భాగం హిందీ భాష నుండి ఉన్నాయి. తమిళం(9), మరాఠీ(3), బెంగాలీ (2), మలయాళం(2), తెలుగు, గుజరాతి కొంకణి అస్సామీ నుంచి భాషల నుంచి ఒకటొకటి మాత్రమే ఉన్నాయి. దాని వల్ల న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో హిందీ వైపే మొగ్గు చూపిస్తున్నారని ఇతర భాషల దర్శక నిర్మాతలు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
ఉదాహరణకి 2019 లో ” గల్లీ బాయ్” (హిందీ) సినిమాని పంపించడం చాలా వివాదాస్పదమైంది. గల్లీ బాయ్ సినిమా స్క్రిప్ట్ ఒరిజినల్ కాదని, నాలుగైదు స్క్రిప్టుల కలగూర గంపగా అని  పైగా ఆస్కార్ స్థాయి సినిమా కూడా కాదని విమర్శలు వచ్చాయి. అదే సమయంలో దాని కన్నా బాగా తీసిన హిందీ సినిమా ” ఆర్టికల్ 15″, మరాఠీ సినిమా ” హెల్లారో” ఆస్కార్ అవార్డుకు పంపించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.
Mahanati poster / wikipedia
మన తెలుగు సినిమాల విషయం చూస్తే, 1957 నుంచి ఇంతవరకూ, స్వాతిముత్యం కాకుండా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అయినా న్యాయనిర్ణేతలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు అన్న వాదన ఉంది.
 ఉదాహరణకు1963 లో వచ్చిన నర్తనశాల, జకార్తా ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు పొందింది. జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అయితే బెంగాలీ సినిమా ” మహానగర్” 1963 లో ఆస్కార్ అవార్డు కు పంపారు!
అలాగే 2018 లో విదేశీ కేటగిరి కింద అస్సామీ చిత్రం  విలేజ్ రాక్ స్టార్ ని ఆస్కార్ కు పంపారు. తెలుగులో మహానటి చిత్రం కూడా ఒక మంచి సినిమా, ఆస్కార్ పొందగలిగే అర్హత ఉన్న సినిమా కూడా! మరి దాన్ని పంపలేదు. అయినప్పటికీ  మహానటి కూడా గొప్ప సినిమానే!
ఆస్కార్ నామినేషన్ కు పంపించే సినిమాల్లో తెలుగు సినిమాకే అన్యాయం జరిగింది అని చెప్పను కానీ, ఆస్కార్ కు వెళ్ళిన సినిమాలను, ఇతర భాషా చిత్రాలతో (అదే సంవత్సరం) పోలిస్తే కొన్నిసార్లు న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో  వ్యవహరించారేమో అనిపించడంలో తప్పు లేదేమో అనిపిస్తుంది.
Saleem Basha

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు.పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *