అరణ్య: వీలుచేసుకుని ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా

(సుబ్బారావు గాలంకి)

అరణ్య – నిన్ననే ఈ సినిమా చూసా …. Eros లాంటి సంస్థ తీసిన సినిమా … అసలు ఏమిటి అని ఆరా తీశా …నిజంగా ఓ భారతీయుని గా గర్వపడ్డా.

జాదవ్ పాయెంగ్ (Jadav Payeng)..  గురించి  విన్నారుగా .జాదవ్‌ ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం 2007 వరకు బయటి ప్రపంచానికి తెలియదు. అందుకే ఆయన్ని వనపున:సృష్టికర్త (Reforestaion Hero) అంటారు.

ఓ రోజున ఫొటో జర్నలిస్ట్‌ జీతూ కలితా అనుకోకుండా ఈ ప్రాంతానికి రావడంతో ఈ విషయం బయటపడింది. వాళ్లు కలవడమే చాలా చిత్రంగా జరిగిందట. ‘‘పక్షుల ఫొటోలు తీయడానికి ఓ బోటు తీసుకుని.. బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్నా. మాజులీ ద్వీపం వద్దకు రాగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.. మొక్క మొలకెత్తడానికే సందేహించే ఈ నేలపై పచ్చని అడవి’అని జీతూ నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఇక జాదవ్‌ అయితే.. ఎవరూ రాని ఆ ప్రదేశానికి జీతూ రావడంతో వన్యప్రాణుల వేటగాడు అని అనుకున్నాడట. ఈ సందర్భంగా జాదవ్‌ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతూకు నోట మాట రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జాదవ్‌ గొప్పతనాన్ని తన కథనం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడన్న దానికి ఉదాహరణ జాదవేనని చెబుతారు.

మొక్కలు నాటుతున్న జాదవ్ పాయెంగ్

1979 వ సంవత్సరములో అస్సాంలో వచ్చిన వరదల వలన ఎన్నో జలచరాలు బ్రహ్మపుత్రా నది ఒడ్డుకి కొట్టుకువచ్చాయి.కొన్ని రోజులకి వరదలు తగ్గి నది మధ్య లోని ఇసుకదీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధి అయిపోయాయి.అక్కడికి దగ్గరలోనే ఉండే జాదవ్ వాటిని చూసి చలించి పోయాడు.వెంటనే అటవీ అధికారుల వద్దకు వెళ్ళి ఆ ఇసుక తెన్నెల వద్ద అడవిని పెంచితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పాడు.వాళ్ళు..’ఈ ఇసుక నేలళ్ళో ఏ విధమైన మొక్కలు పెరగవు.అంతగా చేయాలనుకుంటే నువ్వే అక్కడ వెదురు లాంటి మొక్కలు ఏవైనా నాటి చూడు..’ అని సలహా ఇచ్చారు.తాను పుట్టిన నేలను కాపాడుకోవాలని 16 ఏళ్ల జాదవ్‌ అప్పుడే నిర్ణయించుకున్నాడు. ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించాడు.. పచ్చదనమంటూ లేని ప్రాంతంలో రోజుకొక మొక్క నాటాడు. అలాఅలా.. మొక్కంటూ మొలవని నేలపై ఓ అడవి ఆవిష్కృతమైంది. 1,360 ఎకరాల్లో విస్తరించింది. పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రమైంది.

పద్మశ్రీ పురస్కారం

అప్పటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న జాదవ్ పయోంగ్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ 2012 ఏప్రిల్ 22 న ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమంలో జాదవ్ పయెంగ్‌ను సత్కరించారు. ఇంటరాక్టివ్ సెషన్‌లో అడవిని సృష్టించిన తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు, ఇక్కడ మాగ్సేసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్, జెఎన్‌యు వైస్-ఛాన్సలర్ సుధీర్ కుమార్ సోపోరీ ఉన్నారు. జాదవ్ పాయెంగ్‌ను “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా సోపోరీ పేర్కొన్నారు. అక్టోబర్ 2013 నెలలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో వారి వార్షిక ఈవెంట్ కోలెన్సెన్స్ సందర్భంగా ఆయనను సత్కరించారు. 2015 లో, భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. ఆయన చేసిన కృషికి అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు కజీరంగ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు.

జాదవ్‌కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు.. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్లి.. సేదతీరుతాడు.. నీవు లేనిదే నేను లేను అంటాడు.. ఉదయం 3 గంటలకు నిద్రలేవగానే.. తన వనం వద్దకు వెళ్తాడు. మొక్కలు నాటే పనిలో మునిగిపోతాడు. సమీప గ్రామాల్లో పాలు అమ్మి.. జీవనం కొనసాగించే జాదవ్‌ నిజంగా హరిత సంపన్నుడే.

వీలుంటే ఓ సారి మీ ఫ్యామిలీ తో వెళ్ళండి.ప్రపంచం భవిష్యత్ లో ఎలా ఉండాలో మీ పిల్లలకి చూపిస్తూ చెప్పండి

(సుబ్బారావు గాలంకి,విజ్ఞాన వేదిక .9848829574)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *