ఎన్ని ‘దేవదాసు’లొచ్చినా అక్కినేని ‘దేవదాసు’ మాత్రమే క్లాసిక్

(ఈ రోజు అక్కినేని నాగేశ్వరావు జయంతి)
(CS Saleem Basha)
చివరి క్షణం దాకా  నటించాలనుకున్నారు, అలాగే జరిగింది అక్కినేని జీవితంలో.  90 ఏళ్ల వరకు నటిస్తూనే జీవించిన ఏఎన్ఆర్ “మనం” సినిమా లో నటించి వెళ్ళిపోయాడు. తెలుగు సినిమా కు చిరునామా మారిపోయిన నటద్వయంలో ఒకడైన (ఇంకొకరు ఎన్టీఆర్) ఏఎన్ఆర్ పుట్టినరోజు ఈరోజు(23.09.1923- 22.01.2014) .
ఏఎన్ఆర్ గురించి రాయాలంటే ఒక నాలుగైదు పుస్తకాలు రాయాల్సి వస్తుంది.
అక్కినేని సినిమాల జాబితా చాలా పెద్దది. ఒక ” దేవదాసు”(1953) గురించి మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అతని సినిమా కెరీర్ లో దీనికి మొదటి స్థానం ఉంటుంది. రెండువ స్థానం ఉండదు. ఆయన తీసిన ఇతర చిత్రాలు, అవెంతగొప్పవయినా ఆతర్వాత లెక్కించదగ్గవే.
తెలుగులో దేవదాసు తర్వాత హిందీ లో దిలీప్ కుమార్, తర్వాత షారుఖ్ ఖాన్ వంటి వాళ్లు దేవదాస్ తీసినా, అక్కినేని దేవదాసు మాత్రమే ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. దిలీప్ కుమార్ ఒకానొక సందర్భంలో ” అక్కినేని దేవదాసు సినిమా ముందు, నా సినిమా తేలిపోతుంది” అని చెప్పడం విశేషం! 1936 లో సైగల్ హీరోగా తీసిన దేవదాసు కూడా, అక్కినేని దేవదాసు ముందు నిలబడలేదు.
అక్కినేని జయంత్రి సందర్బంగా  దేవదాసు ఎందుకు క్లాసిక్ గా మిగిలిపోయిందోచూద్దాం.
బెంగాలీ నవలా రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ నవల అధారంగా వచ్చిన దేవదాసు ను 1929లో మొదట నరేష్ చంద్ర మిత్ర ఈస్టర్స్ ఫిల్మ్  సిండికేట్ బ్యానర్ కింద మూకీ చిత్రంగా తీశారు.
1935లో బెంగాలీ రైటర్ , యాక్టర్, డైరెక్టర్ ప్రమధేష్ చంద్రబారువా బెంగాలీలోనే టాకీ తీశారు. ఇందులో టైటిల్ రోల్ కూడా డైరెక్టరే పోషించారు.
ఆతర్వాత1935-2002 మధ్య  హిందీ, బెెంగాలీ, తమిళం, తెలుగు,అస్సామీ, మలయాళం, ఉర్దూలలో చాలా సినిమాలువచ్చాయి.
ఇటీవల  2010లో పాకిస్తానీ చిత్రం వచ్చింది
2013లో బంగ్లాదేశీ వర్షన్ కూడా విడుదలయింది
ఇలా ఎన్నివచ్చినా  ప్రేక్షకుల ఆరాాధ్య చిత్రం (cult movie) హోదా వచ్చింది  1953 నాటి ఎ ఎన్ ఆర్ నటించిన తెలుగు (తమిళం కూడా)దేవదాసుయే.
సినిమా సంబంధించిన అన్ని ప్రక్రియలలో ఈ చిత్రం ప్రశంసలందుకుంది.
ఆల్ టైమ బెస్ట్ 100 ఇండియన్ మూవీస్ ఒకటిగా సిఎన్ఎన్ -ఐబిఎన్ సర్వేలో ఎంపికయ్యింది.
వేదాంతం రాఘవచార్య డైరెక్షన్, సముద్రాల రాఘవాచార్య సంభాషణలు, పాటలు,  బిఎస్ రంగా సినిమాటోగ్రఫీ, పివి నారాయణ ఎడిటింగ్ కౌశలం ఈ చిత్రం విజయవంతమయ్యేందుకు తోడయ్యాయి.
డైరెక్టర్ రాఘవాచార్య కూచిపూడి డ్యాన్సర్. ప్రతిసీన్ ని ఆయన మొదటి నటించి చూపి ఇలా చేయాలని చెప్పేవాడట.
దీనితో పాటు నవలని తెలుగులోకి అనువాదం చేసిన చక్రపాణితో కూడా ఎఎన్ ఆర్ సంప్రదించేవాడట. ఇలా ఆయన దేవదాసు క్యారెక్టర్ స్వభావాన్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడట.
చిత్రం విజయవంతం కావడంలో మేకప్ ఆర్టిస్టు మంగయ్య పాత్ర కూడా ఉందని ఎఎన్ ఆర్ ప్రశంసించేవాడు.
షూటింగ్ వెళ్లే ముందు నాగేశ్వరరావు సుష్టుగా బోంచేసేవాడు. ఎందుకంటే సినిమా షూటింగ్  50 రోజుల పాటు రాత్రి మాత్రమే చేసేవారు. తాను ఆర్ద నిమీలిత నేత్రాలతో కనిపించేలా మేకప్ చేసి మంగయ్య అద్భుతాలు సృష్టించాడని ఎ ఎన్ ఆర్ ఒప్పుకున్నారు.
దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రకి మొదటి చాయిస్ సావిత్రి కాదు. మొదట ఈ చిత్రాన్నిఎ ఎన్ ఆర్ ,షావుకారు జానకితో  తీయాలని వినోదా పిక్చర్స్ వారు అనుకున్నారు. ఒక వారం షూటింగ్ కూడా చేశారు. అయితే, విషాద చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించరేమోనని షూటింగ్ ని నిలిపివేశారు. దేవదాసు బదులు వినోదా పిక్చర్స్ వారు ‘శాంతి’తీశారు.అది ఫెయిలయింది.
తర్వాత వినోదా భాగస్వామి అయిన డిఎన్ నారాయణ దేవదాసును స్వతంత్రంగా  తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పనిచేసేందుకు సముద్రాల, వేదాంతం, మ్యూజిక్ డైరెక్టర్  సిఆర్ సుబ్బరామన్ అంగీకరించారు.
ఈ దశలో షావుకారు జానికి స్థానంలోకి సావిత్రిని తీసున్నారు. చంద్రముఖి పాత్రకి ట్రావన్కోర్ సిస్టర్స్ లో ఒకరయిన లలితను ఎంపిక చేశారు. ఇద్దరి నటన అద్భుతమని పేరు తెచ్చుకున్నారు.
సినిమా చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది సంగీతం.  దాదాపు ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా  సిఆర్ సుబ్బరామన్  సంగీతం ఇంకా  హృదయాలను ద్రవింపచేస్తూనే ఉంది. పల్లెకు పోదాం, పారు చూద్దాం మొదలుకుని జగమే మాయ దాకా ప్రతిపాట ఆయన మ్యాజిక్ (Magic)తోసూపర్ హిట్టయింది.
ఇక్కడొక విశేషం. ఈ పాటలన్నింటిని ట్యూన్ చేశాక, అకస్మాత్తుగా సుబ్బరామన్ చనిపోయారు. అపుడు ఆయన శిష్యుడు ఎమ్ ఎస్ విశ్వనాథం చిత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండు పాటలు  జగమే మాయ,అందం చూడవయా లకు బాణికట్టారు. కర్నాటక సంగీత విద్వాంసుడు వయెలినిస్టు టిఆర్ రామమూర్తితో కలసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కట్టారు.
తెలుగు వర్షన్  1953 జూన్ 26 విడుదలయింది. ఆతర్వాత మూన్నెళ్ల తమిళ వర్షన్ విడుదలయింది. 1974 లో రెండో సారి రిలీజ్ అయింది. మొదటి సారి, రెండో సారి కూడా వందరోజులాడింది.అపుడు కృష్ణ, విజయనిర్మల తీసిన దేవదాసుకుపోటీగా విడుదలయింది.

ఈ స్టోరీ నచ్చిందా?  మిత్రులకు షేర్ చేయండి

Like this story? Share it with friends

అక్కినెేని గురించిన మర్ని విశేషాలు
అక్కినేని నాగేశ్వరావు గురించి చాలా మందికి తెలియని విషయం, అతని ప్రాపంచిక జ్ఞానం. అక్కినేని స్వయంగా రాసిన పుస్తకాలు ” నేను నా జీవితం”, ” అ ఆ లు- అక్కినేని ఆలోచనలు” అతని విస్తృత ప్రాపంచిక పరిజ్ఞానాన్ని, విస్తార విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి.
ఆకాశం వైపు చెయ్యి ఎత్తి చూపుతూ దేవుడి గురించి అక్కినేని చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. ” పైన ఎవరన్న ఉంటే నేను నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి, ఒక మంచి మనిషిలా ఉండాలని అనుకుంటాను తప్ప, గుడ్డిగా తనను పూజించాలని అనుకోక పోవచ్చు”
” మనకు ఏమీ తెలియదని తెలుసుకోవాలంటే, కొంచెం తెలుసుకుంటే చాలు” అన్న మాటలు ఆయన ఫిలాసఫీని తెలియజేస్తాయి. నాలుగో తరగతి మానేసిన తాను కొంత లోకజ్ఞానం సంపాదించడానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయం. అక్కినేని నాగేశ్వరరావు చాలా ఓపెన్ గా కూడా ఉంటాడని ఆయనకు దగ్గరగా తెలిసిన వాళ్ళు చెబుతారు. తనకు స్టమక్ క్యాన్సర్ ఉందని బహిరంగంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. తాను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కారణం హిందూ పేపర్ చదవడమే నని ఆయన తరచూ చెప్పేవాడు. తిండి విషయంలో కూడా ఆయన ” ఎక్కువ కాలం బ్రతకాలంటే తక్కువ తినాలి” అనేవాడు. వెజిటేరియన్ గా మారిపోయిన తర్వాత, నాలో చాలా మార్పు వచ్చింది అని కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్పేవాడు.
“మనం” సినిమా షూటింగ్ నడుస్తుండగా 22 జనవరి, 2014 న అక్కినేని నాగేశ్వరరావు అనే ” బాటసారి” మరో లోకానికి పయనమై వెళ్లిపోయాడు.
Saleem Basha CS

 

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)