సావిత్రి అన్నగా నటించేందుకు అక్కినేని ఒప్పుకోలేదు, ఆచిత్రమేది?

(అహ్మద్ షరీఫ్)

జీవితాంతం  విడదీయలేని బంధమై కలిసి వుంటామనుకున్న అన్నా చెల్లెళ్లు, పరిస్థితుల ప్రభావం వల్ల దూరమై, చివర్లో  రెండు శరీరాలు ఒకే ఆత్మ గా అంతమై పోయిన  ఒక అపురూప అనుబంధపు కథను మలయాళ కథా రచయిత  కె. పి. కొట్టార్కర్  రాశాడు.

ఈ కథను 1961 లో దర్శక నిర్మాత ఏ. భీం సింగ్ తమిళం లో పాశమలార్ చిత్రంగా నిర్మించాడు. అది సూపర్ హిట్ అయింది.

ఈ చిత్రాన్ని  చూసిన డూండీ దీన్ని తెలుగులో నిర్మించాలనుకున్నాడు. రక్త సంబంధం సినిమా తయారయింది. తెలుగు సినీ చరిత్రలో అన్నా చెల్లెళ్ల అనుబంధం అనగానే ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే చిత్రంగా తయారయింది రక్త సంబంధం. ఈచిత్రానికి దర్శకత్వం  వి. మధుసూధన రావు

ఈ చిత్రం 1962 వ సంవత్సరం నవంబరు 1 న విడుదలయింది.  ఈ తారీఖుతో పాటు మరో రెండు తారీఖులు కూడా గుర్తు పెట్టుకోవాలి.  ఒకటి జూన్ 7, 1962. ఆ  రోజు గుండమ్మ కథ సినిమా విడుదలయింది. దీని తరువాత దాదాపు నాలుగున్నర నెలలకు రక్త సంబంధం విడుదలయింది. రక్త సంబంధం విడుదలయిన ఆరు వారాలకు డిసెంబరు 14, 1962 ఆత్మ బంధువు సినిమా విడుదలయింది. ఈ మూడు చిత్రాలూ ఘన విజయాన్ని సాధించాయి. రక్త సంబంధం ముందు విడుదలయిన గుండమ్మ కథలో, రక్త సంబంధం విడుదలయిన తరువాత విడుదలయిన ఆత్మ బంధువులో (ఎక్కువ సమయమేమీ కాదు) ఎన్. టీ. ఆర్, సావిత్రి ప్రేమికుల జంట గా నటించారు. మధ్యలో వచ్చిన రక్త సంబంధం లో  మాత్రం అన్నా చెల్లెళ్లుగ నటించారు. ఈ రెండు రకాల బంధాలనీ ప్రేక్షకులు అంతే అభిమానం తో ఆదరించారు.  

 కథా కమామిషూ:

రాజు, రాధ చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అన్నా చెల్లెళ్లు. ఒకరంటే మరొకరికి అమితమైన అభిమానం, శ్రధ్ధ, ఆరాదనా. రాజు తన చెల్లెల్ని అమితమైన గారాబంతో పెంచుతాడు. మొదట్లో ఆర్థికంగా కష్టపడిన రాజు, తరువాత తన చెల్లెలి సలహా మేర వ్యాపారం ప్రారంభించి డబ్బు  సంపాదిస్తాడు. వీరిద్దరి జీవితాల్లోకి రాధ ప్రేమించిన యువకుడు ఆనంద్ ప్రవేశిస్తాడు. చెల్లెలి సంతోషమే ముఖ్యమనుకునే రాజు, వాళ్లిద్దరి  పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి తరువాత ఆనంద్, అతడి మేనత్తా, కజిను అప్పారావు అందరూ కలిసి ఒకే ఇంట్లొ వుంటారు. చెల్లెలి కోరిక మేర రాజు, మాలతి అనే డాక్టర్ని పెళ్లాడుతాడు.  

 

కాంతమ్మ అనుమానాల్నీ, అభిప్రాయ బేధాల్ని తద్వారా కుటుంబ కలహాలనీ సృష్టిస్తుంది. చెల్లెలి ని తన వల్ల  వస్తున్న  ఈ సమస్యల నుండి కాపాడ దలిచిన రాజు ఇల్లు వదిలి వేరే ఇంట్లో కి మారతాడు. రాధ ఒక మగ పిల్లవాణ్ణీ కంటుంది. రాజుకు అమ్మాయి పుడుతుంది. ప్రసవం లో రాజు భార్య మాలతి మరణిస్తుంది.  రాజు తన యావదాస్తినీ తన చెల్లెలు  రాధ పేరిట రాసి, మనశ్శాంతి కోసం తీర్థ యాత్రలు చేస్తాడు. తిరిగొచ్చిన తరువాత చెల్లెల్ని చూడటానికి ఇంటికి వెళ్లిన రాజును , కాంతమ్మ రానివ్వదు. రాజు దీపావళి రోజు బాణసంచా కాల్చడం లో సంభవించిన ఒక ప్రమాదం లో ఒక పిల్లవాణ్ని రక్షించ బోయి తన కళ్లు పోగొట్టుకుంటాడు. ఆ తరువాత తాను కాపాడింది రాధ కొడుకైన తన మేనళ్లుడినేనని రాజు తెలుసుకుంటాడు. రాజు ను చూడటానికి రాధ అతడి ఇంటికి వెళుతుంది. ఈ లోపు కాంతమ్మ దుర్మార్గాల్ని తెలుసుకున్న ఆనంద్ ఆమెను ఇంట్లోనించి వెళ్లగొట్టి రాజును కలవడానికి వేళతాడు. అక్కడ ఒకరి చేతిలో మరొకరి చేయి పెట్టుకుని ప్రాణాలు వదిలిన  అన్నా చెల్లెళ్లని చూస్తాడు.

తమిళ చిత్రం లో  అన్నగా శివాజీ గణెశన్, చెల్లెలిగా సావిత్రీ నటించగా, సావిత్రి భర్తగా జెమిని గణెశన్ నటించారు.

చెల్లె లి పాత్రలో మహా నటి సావిత్రి తన నటనతో కొన్ని సన్నివేశాల్లో నడిగర్ తిలగం శివాజీ గణెశన్ నే  డామినేట్ చేసిందని చెబుతారు. 

తెలుగు చిత్రం వచ్చేటప్పటికి, చెల్లెలుగా సావిత్రిని మార్చే ప్రసక్తి లేదు కాబట్టి, అన్న పాత్ర కోసం డూండీ, మొదట   అక్కినెని నాగేశ్వర రావును సంప్రదించాడట. దానికి ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటికే సావిత్రి, అక్కినేనీ ల జంట కు ఒక ప్రేమికుల జంటగా ముద్ర పడిపోయింది. చిదురు ముదురుగా కొన్ని వదంతులు కూడా వున్నాయిట. దరిమిలా మా యిద్దరినీ ప్రేక్షకులు అన్నా చెల్లేళ్లు గా స్వీకరించలేరు కాబట్టి మీరు అన్న పాత్రకోసం వేరే ఎవరినయినా చూడండి అని సలహా ఇచ్చాట్ట. అంతే కాదు తానే ఎన్. టీ .ఆర్  పేరును కూడా సూచించాడట

 

ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. గమనించ వలసిన విషయం ఏమిటంటే , 1954 లో వచ్చిన పరివర్తన చిత్రం లో ఏయన్నార్ సావిత్రి కి అన్నగా నటించగా, ఎన్ టీ ఆర్ ఆమెను పెళ్ళాడే యువకుడిగా నటించారు. అయితే ఈ చిత్రం చాలా కాలం క్రింద వచ్చింది. ఆ తరువాత ప్రేక్షకుల హృదయాల్లో ఏయన్నార్ సావిత్రీ ల జంట  ఒక ప్రేమికుల జంటగా ముద్ర వేసుకుంది. 

 

ఆ తరువాత, డూండీ  ఎన్ టీ ఆర్ ను సంప్రదించడం, దానికి ఆయన ఒప్పుకోవడం జరిగి పోయాయి. నటుడు ఒక వస్తువయితే, ఆ వస్తువు ప్రతిబింబాలే పాత్రలు. వస్తువు ఒకటే అయినాఒక దినపు వేరు వేరు సమయాల్లో నీడలు వేరు వేరు గా వున్నట్లు, ఎన్ టీ ఆర్ తననూ , తన పాత్రల్ని వేరు చేసి అన్నయ్య పాత్రలో నటించినా సమస్య రాదనుకున్నాడో ఏమో. సినిమా తయారయింది. కథ చాలా బరువు గా వుండి సన్నివేశాలు అడుగడుగునా కన్నీళ్లు పెట్టించేవే. అయితే ఈ దుఖం ప్రేక్షకులు, ఇష్టపడి కొనుక్కున్నదే. దీనికి స్క్రిప్టు రాసింది ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకట రమణ. స్క్రీన్ ప్లే రచయితగా అరంగేట్రం. మూళ్లపూడి వెంకట రమణను బాగా ఎరిగి వున్నవారు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్య పోవచ్చు. ఎందుకంటే ముళ్లపూడి వెంకట రమణ అంటే హస్య రచనలకూ, హాస్య స్ఫూర్తి కీ చిరునామా. ఆయన లైట్ వెయిన్ రచనా రాగం, బరువైన ఈ చిత్ర బాణీలో చక్కగా ఇమిడి పోయింది. నిన్ను వదిలి వెళ్లడం లేదమ్మా, ఇల్లు వదిలి వెళుతున్నానంతేలాంటి డైలాగులు ఛెళ్లు మనిపించాయి  

 

ఈ సినిమాకి సంగీతం ఘంటసాల.  బంగారు బొమ్మ రావేమే..పందిట్లొ పెళ్లి జరిగేనే”, “చందురిని మించు అందమొలికించు” రెండు పాటల బాణీలను మాత్రం తమిళ సినిమాలో వే వుంచేసి. మిగిలిన పాటలకు కొత్త బాణీలు తయారు చేసాడు  ఘంటసాల.  

(అహ్మద్ షరీఫ్ , మూవీ క్రిటిక్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *