గ్రామాల్లో రెచ్చిపోతున్న వైసిపి నేతలు.. చూస్తున్నావా జగన్మోహనా?

(యనమల నాగిరెడ్డి)
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  నూతన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేరు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఆయన రాజకీయంగా ఎదుర్కొన్న కేసులు, చేసిన సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికలలో సాధించిన ఘన విజయం, ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఒకటేమిటి అనేక విధాలుగా ఆయన పేరు ప్రజా బాహుళ్యంలో ప్రతినిత్యం మోగుతూనే ఉంది.
ఇక ప్రస్తుతానికి వస్తే ఆయన పార్టీకి చెందిన నాయకులు “పార్టీల పేరుతొ” గ్రామాలలో గుట్టుగా జీవనం సాగిస్తున్న చిరుద్యోగులపై చేస్తున్న”దాష్టీకంతో మరో రకంగా” ఆయన పేరు వినిపిస్తున్నది.
“నేను చూశాను… నేను విన్నాను… నేను ఉన్నాను” అంటూ పాదయాత్ర సమయంలో ఆయన ప్రజలకు నమ్మకం కలిగించారు. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో ఇవే వాగ్దానాలను మరో సారి ప్రకటించి వారికి భరోసా  కల్పించారు. మరో అడుగు ముందుకు వేసి తన ప్రభుత్వం “పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తుందని, పార్టీలకు, పాలనకు సంబంధం ఉండదని” కూడా ఆయన ప్రకటించారు. ఇదే ప్రకటన అసెంబ్లీలో కూడా చేశారు.
అయితే ప్రస్తుతం క్రింది స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, “తెలుగుదేశం మద్దతుదారులనే పేరుతొ తమ నోటి కాడ కూటిని లాగేస్తున్నారని” కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ధర్నా చేసి ఎమ్మార్ ఓ కు వినతి పత్రం అందచేసిన విఓఎ  (గ్రామ సంఘ సహాయకులు) అంటే యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగానే “గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు” అంతా  తమదే రాజ్యమని, తాము చెప్పినట్లే జరగాలని, చిరుద్యోగాలలో కూడా తమ వాళ్ళే ఉండాలని” ఈ ఉద్యోగాలపై ఆధారపడి గత అనేక సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని వారు ఎమ్మార్  ఓ కు అండ చేసిన వినతి పత్రంలో ఆరోపించారు. వైసీపీ నాయకులు “తమను టీడీపీ నియమించిందని, అందువల్ల తామంతా తెలుగుదేశం వాళ్లమని ముద్ర వేస్తూ, ఉద్యోగాలు వదలివేయాలని తమను వేధిస్తున్నారని” వారు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమ గోడు విని  ముఖ్యమంత్రి కాగానే వెలుగు యానిమేటర్లు, ఆశా వర్కర్లకు మూడువేల జీతాన్ని, పదివేలు చేస్తానని హామీ ఇచ్చారని, దానిని అమలు చేస్తున్నారని అందుకు తామంతా ఆయనకు కృతజ్ఞులమని వారు పేర్కొన్నారు.
తమకు జీతాలు పెరగడంతో జీవితం ప్రశాంతంగా సాగుతుందని ఆశిస్తున్న సమయంలో  వైసీపీ నాయకుల రూపంలో తమపై పిడుగులు పడుతున్నాయని వారు ఆ పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లంచం ఇస్తేనే ఉద్యోగం ఉంటుందని కూడా వత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ ఉద్యోగాలను ఉంచడం తొలగించడం గ్రామ సంఘ సభ్యులు  చేయాలని, అందుకోసం ఈ నాయకులు వారి చేత బలవంతంగా ఫిర్యాదులు చేయిస్తున్నారని వారు పేర్కొన్నారు. సంక్షేమ పధకాలు రావాలంటే తాము చెప్పినట్లు వినాలని, ఇంట్లో మరో ఉద్యోగం ఉన్నందు వల్ల ఈ ఉద్యోగాన్ని వదులు కోవాలని వత్తిడి చేస్తూ తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
రాజకీయాలలో ఉన్నవారి కుటుంబాలు అనేక పదవులు చేపట్టడానికి అవకాశం ఉందని, అలాగే ఒకే కుటుంబంలో రెండు ఉద్యోగాలు ఉండరాదనే చట్టం ఎక్కడా లేదని వారు గుర్తు చేశారు. ఒక పార్టీ నుండి మరో  పార్టీకి మారిన వెంటనే ఆ పార్టీ నాయకులుగా వీరంతా చెలామణి ఆవుతున్నారని, మరి తమను మాత్రం పార్టీల పేరుతొ వేదిస్తారని, తమకు అప్పగించిన నెరవేరుస్తున్నామా? లేదా? అన్నది మాత్రమే చూడాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. “మేమంతా టీడీపీకే పని చేసి ఉంటె మీకు ఇంట మెజారిటీ ఎలా వస్తుందో కూడా ఆలోచించాలని”  వారు కోరారు.
మీరు ఇచ్చిన మాట మేరకు “పార్టీలకు అతీతంగా” ఈ బడుగు జీవులను చూడాలని, మీరు మా బాధలు చూశారని, మాకు అండగా మీరు  ఉన్నారనే ఆశతో, ఉంటారనే నమ్మకంతో మా గోడు అధికారుల ద్వారా మీకు వినిపిస్తున్నామని, తమను ఈ వేధింపుల నుండి కాపాడాలని  వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.