Home Breaking రాజకీయాలను పేదల వైపు మళ్లించిన పాదయాత్ర

రాజకీయాలను పేదల వైపు మళ్లించిన పాదయాత్ర

వైఎస్సార్ ప్రజాప్రస్థాన పాదయాత్రకు 15 సంవత్సరాలు

839
0

ప్రజల్ని తన కుటుంబసభ్యులుగా భావించిన విభిన్న వ్యక్తిత్వం గల నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదున్నరేళ్ల పదవీకాలంలో అన్ని వర్గాల సమున్నతికి పాటుపడినందునే ఆయన అందరివాడుగా నిలిచారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఆనాటి రాష్ట్రంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. అభివ ద్ధి కుంటుపడింది.. కరువు తాండవిస్తోంది.. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన చేలు బీళ్లుగా మారాయి.. తాగడానికి కూడా నీళ్లు లేక పల్లెలు కళ తప్పాయి.. కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతులను, ఆసరా ఇచ్చేవారు లేక కన్నీరు పెడుతున్న పల్లెలను పరామర్శించాలని, వారి కష్టాలను కష్టంతోనే తెలుసుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా వై.ఎస్‌. భావించారు.

ప్రజా ప్రస్థానం పేరుతో 2003 ఏప్రిల్‌ 9న ఎర్రని ఎండలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి .. జూన్‌ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించే వరకు అప్రతిహతంగా కొనసాగించారు.

11 జిల్లాలు, 68 రోజులు, 640 గ్రామాలు , 1475 కిలోమీటర్లు నడక సాగించారు.. కన్నీరు సైతం ఆవిరైపోయి, ఎండిన డొక్కలతో బిక్కుబిక్కుమంటున్న ప్రతి గుండెనూ తడిమారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. కాళ్లకు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా కులం, మతం, పేద, ధనిక తారతమ్యం లేకుండా ఆప్యాయంగా ప్రజలందించిన ఆహారాన్నే తీసుకున్నారు. ఆనాడు ఆయన వెంట సకల సౌకర్యాలున్న ఏసీ బస్సులు లేవు. పెద్ద పెద్ద కాన్వాయ్‌లు లేవు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను అవపోసన పట్టడానికి, వారి కడగండ్లను తీర్చడానికి తానేం చేయాలో నిర్ణయించుకోవడానికే సాదా సీదాగా మనుషుల్లో మనిషిగానే నిరాడంబరంగా ప్రాణాలను పణంగా పెట్టి లక్షల గొంతుకలు, కోట్ల గుండె చప్పుళ్లను ఆలకిస్తూ ప్రయాణం సాగించారు. అందుకే ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఆత్మబంధువుగా ఆదరించిన చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆనాటి వై.ఎస్‌.ఆర్‌ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పట్టారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజాప్రస్థానం చిరస్మరణీయమే. ప్రజా ప్రస్థానం కు 15 ఏళ్ళు పూర్తి అయినా ఇంకా తెలుగు ప్రజల కళ్ల ముందు పంచెకట్టుతో నడుస్తున్న మహోన్నత నేత వైఎస్‌ రూపం ఇంకా కదలాడుతూనే ఉంది.. అన్నపూర్ణగా పేరుగాంచిన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో అన్నార్తుల ఆకలి పోరును ప్రపంచానికి వైఎస్‌ పాదయాత్ర కళ్లకు కట్టింది.

అనంతరం 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన నిలిచారు. ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలలో ఆ పార్టీని ముందుకు నడిపించిన రథసారథి వై.ఎస్‌.ఆర్‌.ను నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్యమంత్రిగా చేశారు. కేంద్రంలో మన్మోహసింగ్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ అండతో ఆడిన మాట తప్పకుండా జనం కష్టాలెరిగిన నాయకుడిగా జనరంజకమైన పరిపాలనకు వై.ఎస్‌.శ్రీకారం చుట్టారు. తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తూనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకం ఫైలుపై తొలి సంతకం చేసి చరిత్ర స ష్టించారు. తొలుత ‘అన్నదాతకు ఉచిత విద్యుత్తు’ అంటూ వైఎస్‌ ప్రకటించగానే.. ఇలాగైతే ఖజానా ఖాళీ.. ఉచిత విద్యుత్‌ అంటే ఖాళీ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చని ఎద్దేవా చేసిన వారున్నారు.. ఎవరేమన్నా వై.ఎస్‌. పట్టించుకోలేదు. తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించి కాదన్నవారే నోళ్లు వెళ్లబెట్టేలా చేశారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతులకు ఉపశమనం కలిగించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేశారు. మరింత భూమిని సాగులోకి తేవడం ద్వారా మెట్ట రైతుల వెతలు తీర్చేందుకు ‘జలయజ్ఞం’ చేపట్టారు. పోలవరం, చేవెళ్ల – ప్రాణహిత వంటి భారీ సాగునీటి పథకాలు దీని ద్వారా వచ్చినవే. పెద్ద జబ్బులొచ్చినా సామాన్యులకు కూడా భయంలేదంటూ ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా అభయమిచ్చారు. 108, 104 వంటి పథకాల ద్వారా సామాన్యుల చెంతకు వైద్యాన్ని తీసుకెళ్లారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్‌దే. జిల్లాకో విశ్వవిద్యాలయం, గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలన్న సదుద్దేశంతో పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అభయ హస్తం పథకంతో వ ద్ధ మహిళలకు ఆసరా అందించారు. పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడమే కాక, ప్రత్యేకించి గిరిజనులకు పది లక్షల ఎకరాలను పంపిణీ చేసిన మహానుభావుడాయన. డాక్టర్‌ గారు ప్రజల అవసరాలను కచ్చితంగా అంచనా వేయగలిగారు కాబట్టే సాఫ్ట్‌వేర్‌ రంగానికి, పరిశ్రమలకు.. ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇస్తూనే అధికశాతం జనాభా ఆధారపడిన వ్యవసాయరంగాన్ని ఉద్ధరించేందుకు అహరహరం కృషి చేశారు. ఆయన హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ హరితాంధ్రగా అవతరించేందుకు ఉరకలు వేసింది. ప్రతి ఇంటా సంక్షేమం పండించిన రైతుగా, ప్రతి కుటుంబానికీ ఆరోగ్యసిరిని అందించిన వైద్యుడిగా వై.ఎస్‌.ఆర్‌ నిలిచారు. నిరంతరంగా తెలుగు నేల పచ్చగా ఉండాలని జలయజ్ఞం సాగించిన అపర భగీరథుడు ఆయన. రాజకీయాల్లోకి రాకముందే నిరుపేదల కోసం రూపాయికే వైద్యం అందించిన వై.ఎస్‌.ఆర్‌ ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరాగే చివరి క్షణం దాకా ప్రజల మేలు కోసమే తపించారనడంలో సందేహమే లేదు. సమకాలీన రాజకీయనేతల్లో సాటిలేని మేటిగా ఎదిగారు. సామాన్యుల సంక్షేమ స్వప్నాల్ని సాకారం చేసిన ఘనుడు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపడం ద్వారా ఐదేళ్ల పదవీకాలం తర్వాత రెండోసారి కూడా ప్రజామోదాన్ని పొందిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి.

ప్రజలతో మమేకం కావడం, కష్ట సుఖాలను పంచుకోవడం, రాజకీయాలు, గెలుపోటములకు అతీతంగా సాయం కావాలని వచ్చిన ప్రతి వారికి న్యాయం చేయడం డాక్టర్‌ గారి మంచితనానికి ప్రతీక. అదే ఎల్లలెరుగని ప్రజాభిమానాన్ని ఆయన సొంతం చేసింది. ప్రజాభిమానం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోనే మరెవరికీ సాధ్యం కానంత ఎత్తులో నిలిపింది. 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికలలో మహామహులంతా ఒక్కటైనా వైఎస్‌ ముందు నిలవలేకపోయారు. ‘గెలుపైనా, ఓటమైనా నాదే బాధ్యత’ అంటూ ముందడుగేసి ఒంటి చేత్తో కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని అందించారు. ఆ ఎన్నికలలో ఆయన హామీలే ఇవ్వలేదు. మాపై విశ్వాసం ఉంటే ఓటేయమని అగడం ద్వారా ఓటర్లలో తనపై, కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని నిరూపించారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన పథకాలను మెచ్చుకోక తప్ప లేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్‌. పథకాలను ఆదర్శంగా తీసుకున్నారు.
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్‌ మూడు నెలలు తిరగకముందే.. జనం కోసం రచ్చబండలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన చిత్తూరు జిల్లాకు పయనమైన వై.ఎస్‌.ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం కోట్లాదిమందిని విషాదంలో ముంచింది. అమ్మా, అక్కా, చెల్లెమ్మా, అన్నా, తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించే రాజన్న ఇకలేరన్న బాధను దిగమింగలేని వందలాది మంది ప్రజలు గుండెలు ఆగిపోయాయి.

వై.ఎస్‌. మరణం రాష్ట్రానికే కాక, కాంగ్రెస్‌ పార్టీకి సైతం తీరని లోటుగా మిగిలిపోయింది. వై.ఎస్‌.ఆర్‌ మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన.. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం.. 13 జిల్లాలతో మిగిలిన నవ్యాంధ్ర ప్రదేశ్‌.. ఇవన్నీ విదితమే.

డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అంటే తెలుగు రాజకీయాల్లో సరి కొత్త చరిత్ర స ష్టించిన మహోన్నత నేత..1983లో ఎన్టీ రామారావును ప్రజలు ఎలా ఆదరించారో అంతకుమించి వైఎస్‌ఆర్‌ను ఆదరించారు. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాలలో ఏర్పాటయిన ప్రభుత్వాలు సైతం కొన్నింటి పేర్లు మార్చుకున్నా వై.ఎస్‌. పథకాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయంటే ఆ మహానుభావుని ప్రభావం ఏమిటో తెలియజెపుతుంది. ప్రజలను కన్న బిడ్డల్లా ఎలా చూసుకోవాలో తర్వాతి తరానికి మార్గదర్శకం చేసిన ఆ జనశేఖరుడికి మరోసారి జేజేలు పలుకుతూ నివాళులు అర్పించుదాం.

కొలనుకొండ శివాజీ,
ఏఐసిసి సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి
ఫోన్‌ : 9866200463

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here