Home English కర్నాటకలో మోదీ టార్గెట్ ఎవరనుకుంటున్నారు?

కర్నాటకలో మోదీ టార్గెట్ ఎవరనుకుంటున్నారు?

264
0

(బి వి మూర్తి)

బెంగుళూరు: కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్థానాల్లో కలబుర్గి (ఇది వరకటి గుల్బర్గా) ఒకటి. రద్దయిన లోక్ సభలో కాంగ్రెస్ గొంతుక మల్లికార్జున ఖర్గె ఇక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని మరోసారి పోరాటానికి దిగారు.

కలబుర్గి లోక్ సభ ఎన్నికను ఖర్గె, నరేంద్ర మోదీల మధ్య సమరంగా అభివర్ణిస్తున్నారు.

ఖర్గెకు ఈ సారి లోక్ సభలో చోటు లేకుండా చేయాలని మోదీ, అమిత్ షా లు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ సమరం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సోమవారం పోలింగ్ ముగిసిన కలబుర్గి స్థానంలో మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు.

గతంలో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, గత రెండు సార్లు వరసగా లోక్ సభకు ఎన్నికైన ఖర్గె ఎన్నికల రణరంగంలో అపజయమెరుగని వీరుడు.

అయితే ఈ సారి ఎన్నికల్లో ఆయనకు విజయం అంత సులభ సాధ్యం కాకపోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఖర్గె సన్నిహిత సహచరుడుగా ఉన్న ఉమేష్ జాధవ్ గుల్బర్గాలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చించోళి శాసనసభ్యుడుగా రెండు సార్లు గెలుపొందిన జాధవ్ ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరారు. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో ఖర్గె బిజెపి ప్రత్యర్థి రేవూనాయక్ బల్మగిపై గెలుపొందారు. గత ఎన్నికల్లో ఖర్గెకు 73,000 వోట్ల మెజారిటీ లభించింది.

1972లో తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో కాలు మోపిన ఖర్గె నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి అంటుసోకని అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరు. సుదీర్ఘ రాజకీయ జైత్రయాత్రలో ఆయన దేవరాజ్ అర్స్, వీరప్ప మొయిలీ, ఎస్ బంగారప్ప, ఎస్ ఎం కృష్ణ, గుండూరావు, ధరంసింగ్ వంటి హేమాహేమీలతో కలిసి పని చేశారు.

రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, కెపిసిసి అధ్యక్షుడుగా,  శాసనసభలో, పార్లమెంట్ లో ప్రతిపక్షనాయకుడుగా పని చేసిన ఖర్గె రాజకీయ, పాలనా దక్షుడుగా పేరు తెచ్చుకున్నారు. మొన్నమొన్న సిద్ధరామయ్య నేతృత్వంలో 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటితో సహా దళిత సిఎం అన్న నినాదం పైకి తోసుకొచ్చిన ప్రతి సారీ, కనీసం ఐదారు సందర్భాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఖర్గె పేరు ప్రముఖంగా వినిపించింది కానీ ఆ పదవి మాత్రం ఆయనకు తీరని కలగానే మిగిలిపోయింది.

హైస్కూలు విద్య నుంచి లా డిగ్రీ పొందే దాకా సాంతం గుల్బర్గాలోనే చదువుకున్న ఖర్గె జస్టిస్ శివరాజ్ పాటిల్ ఆఫీసులో జూనియర్ న్యాయవాది వృత్తి ఆరంభించారు.

ఎంఎస్ కె మిల్స్ కార్మిక సంఘానికి న్యాయ సలహాదారుగా పనిచేసిన ఖర్గె అనతికాలంలో కార్మిక హక్కుల కోసం పోరాడే ప్రభావశీలి అయిన కార్మిక నాయకుడిగా ఎదిగారు.

1969లో కాంగ్రెస్ లో చేరి తొలిసారి గుర్మిత్కల్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కలబుర్గి జిల్లాలోని వివిధ స్థానాల నుంచి వరసగా తొమ్మిది సార్లు శాసన సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు.

ఖర్గె పాలనా దక్షత గుర్తించిన అలనాటి ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ స్థానిక సంస్థల ఆర్థిక స్థితి గతులు పరిశీలించేందుకై ఏర్పాటు చేసిన ఆక్ట్రాయ్ పన్ను రద్దు కమిటీకి ఆయనను ఛైర్మన్ గా నియమించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సుతోనే వివిధ స్థాయిల్లో వసూలు చేస్తున్న ఆక్ట్రాయ్ పన్నును ప్రభుత్వం రద్దు చేసింది.

షెడ్యూల్డు కులాల్లో కుడి చేతి తెగకు చెందిన ఖర్గె 1974లో లెదర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. కార్పొరేషన్ ఆర్థిక సాయంతో తోలు పరిశ్రమపై ఆధారపడి, పాదరక్షల తయారీ ద్వారా జీవనోపాధి పొందే వేలాది కార్మికులకు ఆవాసాలు, వర్క్ షెడ్ ల నిర్మాణానికై చేసిన కృషి ఖర్గెను తన వర్గంలో తిరుగు లేని నాయకుడిగా నిలిపింది. ఆయన హిందూమతం వీడి బౌద్ధాన్ని స్వీకరించారు. కలబుర్గిలో బుద్ధ విహార్ నిర్మించిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు.

సామాజికార్థికరంగాల్లో వెనుకబడిన హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించడానికై ఖర్గె అవిశ్రాంత పోరాటం జరిపి విజయం సాధించారు. 2012లో యుపిఎ హయాంలో 371జె (సవరణ) రాజ్యాంగ అధికరణం ద్వారా లభించిన ప్రత్యేక హోదా ద్వారా వెనుకబడిన హెచ్ కె ప్రాంతం జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులకై రాజ్యాంగబద్ధమైన హక్కు, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో ఈ ప్రాంత ప్రజలకు రిజర్వేషన్ కోటా లభిస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఇఎస్ఐసి మెడికల్ కాలేజ్, కర్ణాటకకు, ప్రత్యేకంగా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ మెరుగు పర్చడంలో ఖర్గె జరిపిన కృషి అతన్ని చేతల నాయకుడుగా నిలబెడుతున్నాయి.

కలబుర్గి లోక్ సభ స్థానంలో మొత్తం 17, 21, 990 మంది వోటర్లలో 6 లక్షలకు పైగా లింగాయతులున్నారు. అయితే వీరిలో 25 నుంచి 30 శాతం మంది తమ పార్టీకి వోటు చేయగలరని కాంగ్రెస్ భావిస్తున్నది. ఎస్ సి కుడి వర్గం వోటర్లు 3 లక్షల దాకా ఉన్నారు. ఎస్ సి ఎడమ వర్గం వోట్లపై బిజెపి గుత్తాధిపత్యం ఉన్నప్పటికీ ఆ కులం నాయకుడు కె బి శానప్ప ఇటీవలే బిజెపి వీడి కాంగ్రెస్ చేరడం ఖర్గెకు కలిసి వచ్చింది.

గత రెండు ఎన్నికల్లో ఖర్గెకు ప్రత్యర్థిగా ఉన్న రేవూనాయక్ బల్మగి బిజెపి వదిలి జెడిఎస్ లో చేరడం కూడా ఖర్గెకు అనుకూలాంశమే. బిజెపి టికెట్ ఆశించి భంగపడిన సుభాష్ రాథోడ్, మాజీ మంత్రి బాబూరావ్ చవాన్ కాంగ్రెస్ లో చేరారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో ఖర్గె ఎదుర్కొంటున్న ప్రత్యర్థి ఉమేష్ జాధవ్ ఒక్కడే కాదు. ఇదివరకు తన అనుచరులు, సహచరులుగా ఉండి ఇటీవలే కాంగ్రెస్ వీడి బిజెపి పంచన చేరిన మాజీ మంత్రులు మాలికయ్య గుత్తేదార్, బాబూ చించనసూర్, ఏ బి మలకారెడ్డి లతో కూడా ఆయన పోరాడ వలసి వస్తున్నది.

కొడుకు ప్రియాంక్ ఖర్గె రాజకీయ అభ్యున్నతికై పార్టీలోని మిగత అందరినీ ఖర్గె అణగదొక్కుతున్నారని జాధవ్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి అయిన ప్రియాంక్ దూకుడు, పొగరుమోతు ధోరణి వల్ల సౌమ్యుడు, నిష్కళంకుడైన మల్లికార్జున ఖర్గె రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ లోని ఓ వర్గం భావిస్తున్నది.

అయితే జాధవ్ రెండు సార్లు ప్రాతి నిధ్యం వహించిన చించోళీ శాసన సభ నియోజకవర్గంలో తప్ప జిల్లాలో మరెక్కడా ఆయన్ని గుర్తు పట్టేవారు కూడా లేరు. పైగా చించోళీతో పాటు జిల్లాలో ఒకే  ఒక బిజెపి శాసనసభ్యుడున్న ఆలంద్ నియోజకవర్గం కూడా కలబుర్గి లోక్ సభ స్థానంలో కాకుండా బీదర్ లో చేరాయి. కేవలం అగ్రవర్ణాల వోట్లు, ఉంటే గింటే మోదీ వేవ్ పై ఆశలు పెట్టుకున్న బిజెపి విజయం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here