కంటోన్మెంట్ సాయన్నకు దక్కుతుందా..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు జి.సాయన్నకు 2019 ఎన్నికల ఫీవర్ అప్పుడే తాకిందా? ఈ సారీ ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆయనలో మొదలైందా? ఐదు సార్లు టీడీపీలో అలవోకగా టిక్కెట్ సాధించుకున్న సాయన్నకు ఈ సారి టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ దక్కడం కష్టంగానే మారిందా? సిట్టింగ్ సీటు దక్కించుకోవడానికి సాయన్న ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కంటోన్మెంట్ టీఆర్‌ఎస్‌లో సాయన్న పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

జి.సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  1986లో మొదటిసారిగా బల్దియా ఎన్నికల్లో దోమలగూడ కార్పొరేటర్‌గా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1994లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. సాయన్నకు కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అలా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 1994,99,2004 ఎన్నికల్లో వరుస విజయాలతో విజయ దుందుంభి మోగించారు సాయన్న. అయితే సాయన్నకు ప్రతిసారీ ఎమ్మెల్యే టిక్కెట్ అంత సులువుగా దక్కలేదు. నామినేషన్ వేసే వరకు కూడా ఆయన పేరు ప్రకటించకుండా టీడీపీ తాత్సార్యం చేసి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపు ఆలస్యం చేసేది. కానీ మొత్తానికి సాయన్నకే ఫైనల్‌గా టిక్కెట్ దక్కేది. 2009 ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి మల్కాజ్ గిరి విడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్ది పి,శంకర్ రావు చేతిలో సాయన్న ఓటమి పాలయ్యారు. 2014లో తెలంగాణ వచ్చిందన్న సంబరంలో టీఆర్ఎస్ కు సెంటిమెంట్ ఉన్న క్లిష్ట సమయంలో సాయన్న టీడీపీ నుంచే పోటీ చేసి నాలుగో సారి గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్యర్తి గజ్జెల నగేష్ పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొంత కాలానికి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ ఎస్ లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఆయనకు అసలు కథ ఇప్పుడే మొదలైంది.

 

అది ఏంటంటే.. టీడీపీలో ఉన్నప్పుడు ప్రతీసారీ టిక్కెట్ కోసం సాయన్నకు ఆద్యంతం ఉత్కంఠ ఉండేది. టీఆర్ ఎస్ లో చేరిన తర్వాతనైనా ఆ బాధ తప్పుతుందనుకుంటే టీడీపీలో కూడా ఎదుర్కోని క్లిష్ట పరిస్థితి సాయన్న టీఆర్ఎస్ లో ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో సాయన్న చేతిలో టీఆర్ ఎస్ నుంచి ఓడిపోయిన గజ్జెల నగేష్ సాయన్నకు ప్రధాన పోటీదారుడుగా ఉన్నారు. నగేష్ ఇప్పటికే ప్రజల మధ్య తిరుగుతూ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ సారీ ఎమ్మెల్యే టిక్కెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్క బోయిన్ పల్లి 8వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకనాథం కూడా ఈ స్థానం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటీవల దానం నాగేందర్ నేతృత్వాన టీఆర్ ఎస్ లో చేరిన బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఖదీరవన్ రాజగోపాల్, మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్‌లు కూడా ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ టికెట్టుపై కన్నెశారు. దీంతో సాయన్నకు టిడీపీలోనే టిక్కెట్ కష్టాలనుకుంటే టీఆర్ ఎస్ లోను టిక్కెట్టు కష్టాలు తప్పెట్టు లేదు. సాయన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మరో వైపు పార్టీని వీడి వచ్చాడు కాబట్టి గులాబీ బాస్ తప్పకుండా సాయన్నకే టిక్కెట్ కేటాయిస్తారన్న భావన ఉంది. అధికార పార్టీలోకి చేరిన వారంతా నిన్న, మొన్న చేరిన వారే కావడంతో మిగిలిన వారికి అంత త్వరగా సీటు కేటాయించలేరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయన్న తెలంగాణ ఉద్యమ ఊపులోనే టీడీపీ నుంచి గెలిచారంటే ఆయనకు ప్రజలలో ఉన్న ఇమేజ్ అర్థమవుతుంది. సాయన్నకు టిక్కెట్ కేటాయించకపోతే ఆయన ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నకు ప్రజల్లో మంచి పేరే ఉందని చెప్పవచ్చు. తెరాస  నుంచి టిక్కెట్ రాని పక్షంలో ఆయన ఒంటరిగా పోటీ చేయడమా లేకా మరో పార్టీని చూసుకోవడమా అనే చర్చల్లో ప్రస్తుతం ఆయన ఉన్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. గులాబీ బాస్ దీవెనలు మాత్రం సాయన్నకే ఉన్నాయని టిక్కెట్ విషయంలో సాయన్నకు ఆందోళన అవసరం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సాయన్న ఎమ్మెల్యే గా గెలిచేందుకు ఎంత కష్టపడ్డారో కానీ టిక్కెట్ సాధించుకోవాడానికి మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చూసిన టిక్కెట్ల పంచాయతీ కంటోన్మెంట్ నియోజకవర్గం టిక్కెట్ తో టీఆర్ ఎస్ లో కూడా ప్రారంభం కానుందేమో మరీ.. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కంటోన్మెంట్ టిక్కెట్ ఎవ్వరిని వరించనుందో… సాయన్న భవితవ్యం ఏంటో అనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *