రేవంత్ రెడ్డి ఇట్ల చేసిండెందుకో ? (2 సంఘటనలు)

తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన రేవంత్ రెడ్డి కి సంబంధించి ఇటీవల కాలంలో రెండు చర్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీలోనే కాక రాజకీయ వర్గాల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకూ రేవంత్ తాలూకు చర్చనీయాంశమైన రెండు సంఘటనలు ఏంటో వివరాలు కింద చదవండి.

1 రంజాన్ ఉత్సవాలను పురస్కరించుకుని రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ లో సుమారు 80 మసీదులకు వెళ్లి పేద ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేపడతారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయడం బాగానే ఉన్నా.. చాలా మసీదుల్లో రేవంత్ రెడ్డి నుదుట బొట్టు పెట్టుకుని వెళ్లి దుస్తుల పంపిణీ చేపట్టారు. సాధారణంగా ముస్లిం మతస్తులు బొట్టు పెట్టుకోరు. ఈ పరిస్థితుల్లో వారికి వస్త్రాలు పంపిణీ చేసే సమయంలో రేవంత్ రెడ్డి బొట్టు పెట్టుకుని పంపిణీ చేపట్టారు. మసీదుల్లో ముస్లిం మతానికి చెందిన వారు కాకపోతే వారంతా తెల్లని టోపీలు ధరిస్తారు. కానీ ఎక్కడా రేవంత్ టోపీ కూడా ధరించలేదు. పైగా బొట్టు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతన్నది. రేవంత్ యాదృచ్చికంగానే ఇలా చేశారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. కింద ఫొటోలు ఉన్నాయి చూడండి. రేవంత్ దుస్తుల పంపిణీ ఎలా సాగిందో తెలుస్తుంది.

2 ఇక రెండో విషయానికి వస్తే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లుగా ఉన్న కొందరి ఇండ్ల వద్దకు వెళ్లి వారితో కర్టసీగా సమావేశమయ్యారు. వారిలో సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. వారి ఇండ్ల వద్దకు వెళ్లి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి ఆశిస్సులు కావాలని కూడా అభ్యర్థించారు. రేవంత్ తన ఇంటికి రావడంతో అంజన్ కుమార్ యాదవ్ అయితే కొండంత పండగ చేశారు.

రేవంత్ కు ఘనంగా స్వాగతం పలకడంతోపాటు మంచి భోజనం కూడా పెట్టారు. అంతేకాదు ఘనంగా రేవంత్ కు సన్మానం చేశారు. ఇంతవరకు బాగనే ఉంది కానీ.. మొన్న ఆదివారం నాడు అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ప్రసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ర్యాలీ జరిపారు. అట్టహాసంగా ఆయన గాంధీభవన్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అయితే రేవంత్ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రేవంత్ ఎందుకు రాలేదబ్బా అని పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

అంజన్ కుమార్ యాదవ్ పిలవలేదా? ఒకవేళ ఆయన ఆహ్వానించినా రేవంత్ రాలేదా అన్న చర్చ సాగుతోంది. అంజన్ ఇంటికొచ్చి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్ ను అంజన్ పిలవకుండా ఉండే చాన్సే లేదంటున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు ఉన్నారు. కానీ రేవంత్ మాత్రం ఎందుకో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ప్రస్తుతం రేవంత్ విషయంలో ఈ రెండు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *