టిడిపిలోకి దూకుతున్న కాంగ్రెస్ నేతలు, ఏమిటి రహస్యం?

(వి. శంకరయ్య )
ఎపిలో వరస బెట్టి కాంగ్రెస్ నేతలు టిడిపిలో చేర బోతున్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి కాయ కల్ప చికిత్స చేసి బలీయమైన పార్టీగా తీర్చి దిద్దాలను కొనే రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ నేతలకు అశని పాతమే.
జాతీయ స్థాయిలో టిడిపి కాంగ్రెస్ మిత్ర పక్షాలు. కాంగ్రెస్ నేతలు టిడిపిలోనికి గోడ దూకడం కొన సాగితే రాష్ట్రంలో రెండు పార్టీలు ఉప్పు నిప్పుగా తయారయ్యే పరిస్థితులు నెలకొన వచ్చు. మున్ముందు పరిస్థితి ఏకడకు దారి తీస్తుందో వేచి చూడ వలసి వుంది.
రాష్ట్ర స్థాయిలో టిడిపి కాంగ్రెస్ మధ్య పొత్తు లేదని స్పష్టమైన తర్వాత స్థానికంగా వ్యక్తగత పలుకు బడి కలిగిన పలువురు కాంగ్రెస్ నేతలు వరస గట్టి టిడిపిలో చేరేందుకు క్యూ కడు తున్నారు. కర్నూలు జిల్లా నుండి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఉదంతం తరువాత ప్రస్తుతం ప్రముఖ కాంగ్రెస్ నేత కేంద్రంలో మంత్రి పదవి వెలగ బెట్టిన కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలో చేర బోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు నేతలు గోడ దూకడాలు సహజమే అయినా ప్రభుత్వ ప్రతి పక్షాల మధ్య పార్టీ ఫిరాయింపులు సంభవించడాన్నిఅర్థం చేసుకోవచ్చు. కాని కేంద్రలో బిజెపికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మిత్ర పక్షాలుగా వున్న టిడిపి లోనికి కాంగ్రెస్ నేతలు గోడ దూకడమంటే సామాన్యమైన అంశంగా కొట్టి పార వేయలేము. ఎందుకంటే ఢిల్లీలో టిడిపి భారీ ఎత్తున ధర్నా నిర్వహించితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య మంత్రులు హాజరై సంఘీభావం ప్రకటించారు. తీరా ఈ సందర్భంగానే ఎపి రాష్ట్ర కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలో చేరికను ఖరారు చేసుకున్నారు.
ఈ పరిణామాలు పరిశీలించితే టిడిపి కాంగ్రెస్ మిత్ర పక్షాలని భావించ గలమా?మిత్ర పక్షంనుండి ఎవరైనా ఫిరాయింపులను ప్రోత్సాహిస్తారా? టిడిపి లోనికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతుంటే టిడిపి నేతలు వైసిపి బాట పడుతున్నారు. చీరాల ఎమ్మెల్యే వైసిపిలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ జిల్లాల్లో అభ్యర్థులును ప్రకటించగానే పాతిక మందికి తక్కువ లేకుండా వలస బాట పట్టే టిడిపి నేతలు రెడిగా వున్నారు. టిడిపి పుష్పక విమానం లాగా వుంది. అందరికీ టికెట్లు ఇవ్వడం గోడ దూక కుండా నిలుపుదల చేయడం ముఖ్యమంత్రికి తలకు మించిన పని. ప్రధాని మోదీ రాష్ట్రానికి నిధులు ఇవ్వ కున్నా శాసన సభ స్థానాలు పెంచి వుంటే బిజెపితో తెగ తెంపులు చేసుకునే వారు కారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకున్నారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ ఫోన్ చేసి పార్టీ మార వద్దని చెబుతున్నా వీరు వినడం లేదని వార్తలు వస్తున్నాయి.ఇది ఎంతవరకు నిజమో తెలియదు. సభావేదికలపైన ఒకరి చెవిలో మరొకరు చెవి పెట్టి మాట్లాడుకొనే చంద్రబాబు రాహుల్ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడు కోలేదంటే ఏలా నమ్మగలం?
ఈ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా మిత్ర పక్షమైన కాంగ్రెస్ నుండి మిగిలిన బలమైన నేతలను చేర్చుకుంటున్నారంటే ఈ పరిణామాలకు ఏమని భాష్యం చెప్పాలి? ఢిల్లీ స్థాయిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ చేరికలు జరుగుతున్నాయా? లేకుంటే రాహుల్ గాంధీకి తిరునామం పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ద మైనారా?
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ముఖ్యమంత్రికి అనుకూలంగా లేవు. ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా ఇటీవల జరిగిన సర్వేలు టిడిపి వ్యతిరేకంగా వున్నాయి. రాష్ట్రంలో ఓడినా గెలుపొందినా కేంద్రంలో తిరిగి ఎన్డిఎ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకుఅన్నీ కష్టాలే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిత్ర పక్షంగా వుండే కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ కి కోపం వచ్చే పని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని ఏలా ఊహించగలం?అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా వున్నాయి. టిడిపి కాంగ్రెస్ పార్టీల మధ్య త్వరలోనే చిచ్చు రగిలే విధంగా వుంటున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతల చేరికలు ముమ్మరం అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఖరి తదుపరి రాహుల్ గాంధీ స్పందన ఏలా వుంటుందో వేచి చూడాలి. పైగా ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ దీక్షకు వెళ్ల లేదు. అయినా జాతీయ కాంగ్రెస్ నేతలు టిడిపి కి మద్దతు పలికారు. ఈ రాజ కీయ పరిణామాలు బహు చిత్రంగా వున్నాయి. ఈ పరిణామాలు పరిశీలించితే జాతీయ స్థాయిలో ఏదో రహస్య ఒప్పందం వుండి తీరాలి. లేదా టిడిపి బిజెపి పొత్తు చెడినట్లు మున్ముందు టిడిపి కాంగ్రెస్ జట్టు తెగిపోవాలి.
గతంలో టీడీపీ – బిజెపి మధ్య పొత్తుకు చీడ పీడలు పడటానికి వుండిన అనువైన వాతావరణమే నేడు టిడిపి కాంగ్రెస్ మధ్య వ్యక్తమౌతోంది. తెలుగు దేశం పార్టీ అధికారంలో వుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుంటే రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల సాధ్యం కాదని రాష్ట్ర బిజెపి నేతలు జాతీయ నేతల వద్ద చెవిలో ఇల్లు కట్టుకుని పోరు బెట్టారు. టిడిపి బిజెపి మధ్య పొత్తు చెడటానికి ఇదొక కారణం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి నేతలను తన పార్టీలో చేర్చు కున్న సందర్భం లేదు. అయనా రెండు పార్టీల మధ్య చెడింది.
ప్రస్తుతం ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి కింద స్థాయి నుండి కాంగ్రెసు పార్టీకి జవం జీవం కల్పించాలని పార్టీని పూర్వ స్థితికి తీసుకు వెళ్లాలని ఆలోచించుతున్న పూర్వ రంగంలో పురిటిలోనే సంధి కొట్టి నట్లు బలమైన కాంగ్రెస్ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాజేసితే కాంగ్రెస్ రాష్ట్ర నేతలే కాకుండా రాహుల్ గాంధీ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెలిమి ఎంత వరకు సాగిస్తారు.? అది ఇది కాకుంటే చంద్రబాబు రాహుల్ గాంధీ మధ్య రహస్య ఒప్పందం వుండి తీరాలి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైన సాధ్యమే. కడుపులో కత్తులు పెట్టుకొంటారు. ఆ క్షణం వరకు ఎంతో అప్యాయంగా మాట్లాడుకొంటారు. మరు క్షణం లో మాటలు మార్చుతారు. విశ్వసనీయత రాజకీయాల్లో ఒక ఆట వస్తువు మాత్రమే. అయనా ఈ పరిణామాలు టిడిపి కాంగ్రెస్ ను ఏదరికి చేర్చుతాయో కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *