వరంగల్ కు ఏమవుతున్నది ….?

వరంగల్ . అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ వరకు రెండో పెద్దనగరం. అప్పట్లో హైదరాబాద్ కాకుండా మునిసిపల్ కార్పోరేషన్ స్థాయికి ఎదిగిన రెండో నగరం. రాష్ట్రం ఏర్పడింది. జిల్లాలు విభజించారు. వరంగల్ పై ప్రేమో పగో తెలియదు గానీ ఈ జిల్లా అయిదు ముక్కలయింది. జిల్లా యే కాదు వరంగల్ పట్టణ భవిత కూడా నిరుడు కురిసిన హిమ సమూహం అయింది. మంత్రులొస్తున్నారు. పోతున్నారు.నాయకులొస్తున్నారు. పోతున్నారు. ఎప్పుడో పీ వీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు, హనుమకొండ శాసన సభ్యుడిగా ఉన్న అప్పటి మంత్రి పీ వీ రంగా రావు హయాం లోని జాతీయ రహదారులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. అది అప్పటి ప్రయత్నం అనాలని చరిత్ర చెబుతున్నది. ఇప్పటి ప్రయత్నాలు స్థూలం గా ఏమీ కనిపించడం లేదు. టెక్స్టైల్ అప్పారెల్ పార్క్ కార్యరూపం దాల్చడం ఎప్పటి ప్రయత్నమో ఇక్కడి ప్రజలకు తెలుసు. సాఫ్ట్ వేర్ రంగం విస్తరణ ఎప్పటి ప్రయత్నమో అందరికీ తెలుసు. అలాగే ఇక్కడి సాగునీటి రంగ విస్తరణ ఎప్పటి ప్రయత్నమో కూడా వరంగల్ వాస్తవ్యులకు తెలియంది కాదు.
నగరం కాకతీయుల నాటి నుంచి ఉన్న ప్రాశస్త్యాన్ని కలిగి ఉండేందుకు ఆరంభం లో కొన్ని ప్రయత్నాలు జరిగాయనిపించింది. అయితే ఇప్పుడు వరంగల్ తెలంగాణ ప్రధాన నాయకుల శీత కన్ను వైఖరి వలన తన ప్రాశస్త్యాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తున్నది. వేరే జిల్లాలు, పట్టణాలు, ప్రాంతాలను గురించి ఇక్కడ ఉదహరించడం వల్ల ఆ ప్రాంతాలు ప్రచారం లోకి వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఇక్కడి నాయకులు దృష్టి సారించాల్సిన రెండు చిన్న ప్రాజెక్టులను గురించి మాట్లాడుకోవడం సబబనిపిస్తున్నది. ఎమ్మెల్యేల ఇళ్ళు శ్రీఘ్రగతిన పూర్తవుతాయి. కానీ కాళోజీ కళాక్షేత్రం ఇంకా తెమలదు. కాజీపేట రైల్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనల్లోనే ఉంటాది. వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వద్ద ఐ లవ్ వరంగల్ సైన్ రాదు. వరంగల్ ప్రాశస్త్యాన్ని నిలిపే రంగాలకు ప్రభావవంతమైన రీతిలో ప్రోత్సాహం ఉండదు. ఇలాంటి వరంగల్ కు ఏం కావాలి ? వరంగల్ ప్రేమికులూ స్పందించండి.

(ప్రజా స్పందన వేదిక నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *