విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సుల కోసం ఎమ్మెల్యేల క్యూ…

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి ఆశీస్సులు నిజమయ్యాయి. ఆయన గతంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి పంపారు. అవి ఫలించాయి.పెద్ద ఎత్తున హిందువులంతా ఓటేశారని జగన్ అఖండ విజయం సాధించారని బాగా ప్రచారంలో ఉంది.

జగన్ కు స్వామీజీయే మార్గదర్శకులు. పలుమార్లు ఆయన విశాఖ ఆశ్రమాన్నిసందర్శించి స్వరూపానందేంద్రుల వారి ఆశీస్సులు తీసుకున్నారు.  మొన్న ఎన్నికల ఫలితాల ట్రెండ్ వెల్లడికాగానే, జగన్ స్వామీజీతో ఫోన్ లో మాట్లాడారు. తర్వాత స్వయంగా కలుసుకుని ఆశీస్సులందుకున్నారు.

జగన్ దృష్టి స్వామీజీ వైపు మొదట మళ్లింది 2015 జనవరిలో. విశాఖలో ఆయన పార్టీ కార్యక్రమానికి వచ్చారు.అపుడు ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు. అపుడు స్వామీజీ సలహా మేరకే జగన్ సింహాచల క్షేత్రాన్ని సందర్శించారు. అప్పటి నుంచి స్వామీజీ సంప్రదించకుండా ఆయన ఏ కార్యక్రమం మొదలు పెట్టరని ప్రతీతి. అది ఆయన యాత్ర కావచ్చు, సభ కావచ్చు, అభ్యర్థుల జాబితా విడుదల కావచ్చు పార్టీతో పాటు వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా స్వామీజీయే ముహూర్తం నిర్ణయిస్తారని పార్టీలో చెప్పుకుంటారు. (తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా స్వామీజీ ఆశీస్సులున్నాయి.)

2016 లో కూడా ఆయన ఆశ్రమాన్నిసందర్శించి రెండుమూడు గంటలు గడిపారు. అపుడు స్వామీజీ అందించిన పట్టు వస్త్రాలు ధరించారు. అక్కడ జరుగుతున్న యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రిషీకేష్ లో గంగా తీరంలో ఉన్న శారదాపీఠంలో నిర్వహించిన ప్రత్యేక హోమం లో కూడా జగన్ పాల్గొన్నారు. అపుడు గంగాస్నానమాచరించారు.జగన్ కు దేవుడి మీద విశ్వాసం ఉంది. ఆయన మంచిపరిపాలన అందిస్తారు. ఆయన నాఆశీస్సులెపుడు ఉంటాయని స్వామీ చెప్పారు.2014 కంటే 2019 లో జగన్ కు విపరీతంగా ఓట్లు పడటం వెనక స్వామీ ఆశీస్సులున్నాయని, హిందువులంతా జగన్ ను సమర్థించారని, దీనికి కారణం ఆయన స్వామీజీకి, ఆశ్రమానికి సన్నిహితులుకావడమేననిజగన్ సన్నిహితులు,అభిమానులుగొప్పగా చెప్పుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్ణయించింది కూడా విశాఖ పీఠాధిపతియేనని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు పార్టీ శాసన సభ్యులు కూడా స్వామీజీ ఆశీస్సులందుకుంటున్నారు.ఇలా స్వామీజీ ఆశీస్సులందుకున్నవారిలో వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు,వై.సీ.పీ ఎచ్చెర్ల  ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *