వెనిజుల మీద ట్రంప్ సాఫ్ట్ వేర్ దాడి… అందరి పీక అమెరికా చేతుల్లోనే…

హేయ్,
కంప్యూటర్ వర్ల్ డ్ (Computer World) అనే పాట ఎపుడైనా విన్నారా? అంతో ఇంతో పాశ్చాత్య సంగీతంతో పరిచయం ఉండి ఉంటే ఈ పాటని తప్పకుండా విని ఉంటారు. వినని వాళ్ల కోసం రెండు ముక్కలు: క్రాఫ్ట్ వెర్క్ అనే పాప్ మ్యూజిక్ బ్యాండ్ ఈ పాట కట్టింది. 1981లో ఈ పాట యుకెలో మొదట రిలీజయింది. సూపర్ హిట్టయింది.
భవిష్యత్తులో మనుషులంతా జీవించే ప్రపంచం ‘కంప్యూటర్ వరల్డ్’ అనేది ఈ పాట అపుడే చెప్పింది. మన జీవితమంతా ఈ ప్రపంచం నుంచి కంప్యూటర్ ప్రపంచంలోకి బదిలీ అవుతుందని ఆ రోజుల్లోనే ఈ పాట కట్టిన వాళ్లు పసిగట్టారు. ఈ పాట చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే, ఇది చెప్పిన కాలజ్ఞానం అక్షరాల రుజువయింది. ఈ పాట లిరిక్స్

Interpol and Deutsche Bank, FBI and Scotland Yard
Interpol and Deutsche Bank, FBI and Scotland Yard
Business, Numbers, Money, People
Business, Numbers, Money, People
Computer World
Computer World

స్మార్ట్ ఫోన్ మూసేసి ఎన్ని నిమిషాలు ఉండగలరో ఒక్కసారి పరీక్షించుకోండి… మన కంప్యూటర్ వర్ ల్డ్ లో నివసిస్తున్నామో లేదో మీకు అర్థమవుతుంది.
ఈ కంప్యూటర్ ప్రపంచాధినేత అమెరికా… ఈ ఒక్క విషయం పాటలో ప్రత్యక్షంగా లేదు.
చాప్టర్ 1
దేశాల మీదకు సైన్యాలను పంపించో, యుద్ద విమానాలను పంపించో బాంబులు వేసి శత్రుదేశాన్ని దారికి తెచ్చుకోవడం ఇంతవరకు వస్తూన్న సాంప్రదాయిక యుద్ధతంత్రం.
దీనికోసం సైన్యాలను,బాంబులను, ఆటంబాంబులను తయారుచేసుకునేవారు. అమెరికా లాంటిదేశాల్లో ప్రయివేటు సైన్యాలు కూడా ఉన్నాయి. ఈ యుద్ధ తంత్రం పాతబడి పోయింది. చివరకు అణ్వాయుధాలు కూడా చేయలేని పని చేసే కొత్త యుద్ధ సాధనాలు వచ్చాయి. అమెరికా తన మాట విననిదేశాలమీదకు, తన దారికి రాని దేశాల మీదకు, తనకు అడ్డొస్తున్న దేశాల మీదకు ఈ కొద్ద యుద్ధతంత్రాన్ని ప్రయోగిస్తున్నది. ఒక్క బాంబు విసరకుండా, రక్తపాతం లేకుండా భౌతిక హింస లేకుండా శతృదేశాన్ని ఈ మార్గంలో అతలాకుతలం చేయవచ్చు.కాళ్ల బేరానికి రప్పించవచ్చు. ఈ కొత్త యుద్ధం సాధనాలే సాఫ్ట్ వేర్ కంపెనీలు.
మీకు తెలుసుగా మనమంతా వాలంటరీగా మన పీకలను అమెరికా చేతిలో పెట్టేశాం. ఇది చాలా కాలం కిందటే జరిగినా, ఇపుడు మన పీకల్ని అలా బొటనవేలుతో గిల్లే స్థాయికి తీసుకువచ్చాం.
పూర్వం ప్రపంచంలోని యువకులను తన వైపు తిప్పుకునేందకు అమెరికా హాలివుడ్ సినిమాలను ప్రయోగించింది. ఇపుడు సాఫ్ట్ వేర్ ద్వారా అమెరికా ప్రపంచంలోని  ప్రతిమనిషిని తన కంట్రోలోకి తీసుకుంది, ముఖ్యంగా ప్రపంచంలోని యువకులంతా…
ఇదే కొత్త పరిణామం . ఎలాగో చూడండి.
చాప్టర్ 2
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా? అయితే, మీ పీక అమెరికా చేతుల్లో ఉన్నట్లే. అమెరికా తలుచుకుంటే రెప్పపాటు కాలంలో మీ ప్రపంచం తలుపులన్నీ మూసుకుపోయి మీరు గాడాంధకారంలో పడిపోతారు. మీ మొబైల్, కంప్యూటర్ ల ఆపరేటింగ్ సిస్టమ్స్ అమెరికా కంపెనీవేనా?  ఇంటర్నెట్ లో మీరేదైనా వెదకాలంటే వాడే సెర్చ్ ఇంజిన్ అమెరికా కంపెనీదేనా?  ఊపిరి పీల్చుకోవడంకంటే ఎక్కువ వేగంగా మీరు ఓపెన్ చేసే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ అమెరికావేనా?  అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా ఎన్నో.. మీకు నిత్యం ఉపయోగం పడే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అమెరికావేనా? అంటే మీరు భారతదేశంలో ఉండినా, అక్కడే పుట్టి పెరిగినా,అక్కడి అధార్ కార్డ్, ప్యాన్ కార్డు ఉంచుకునా, మీరు జీవిస్తున్న ప్రపంచం అమెరికా నడిపించే కంప్యూటర్ ప్రపంచం. భూమ్మీదే మీ కాలూనినా, మీరు సంచరించే కంప్యూటర్ ప్రపంచం అమెరికాది. మనమంతా భారతయులమనో, భారత రాజ్యాంగం ప్రకారం నడుకుంటున్నామో అని అనుకుంటే అది భ్రమ మాత్రమే. కంప్యూటర్ ప్రపంచాధినేత మన మీద పగ బట్టనంతవరకే ఇదంతా. అమెరికా కనుసైగతో సిలికాన్ వ్యాలీ కంపెనీలన్నీ ఒక్క సారి ఈ కంప్యూటర్ వర్ ల్డ్ ను మూసేస్తే… మీ సైన్యాలు, ఆటంబాంబులు ఏవీ కాపాడలేవు.
చాప్టర్ 3
ప్రపంచంలో మొట్టమొదటి సారి కంప్యూటర్ వర్ ల్డ్ అధినేత అయిన అమెరికా తన సాఫ్ట్ వేర్ పవర్ ను లాటిన్ అమెరికాలోని చిన్నదేశం వెనెజుల మీద ప్రయోగించింది. ఇంతవరకు తన మాట వినని వెనెజులను అమెరికా అన్ని విధాల హింసిస్తూవచ్చింది. అక్కడ అధ్యక్షుడు ఎవరుండాలో తానే  చెబుతానంటుంది. అక్కడ ఎన్నికలు ఎలా జరగాలో తానే నిర్ణయిస్తానంటుంది.  వెనెజుల పెట్రోలియాన్ని కొనాల వద్దా తానే ప్రకటిస్తానంటుంది. వెనిజులతో వ్యాపారం చేయాలా వద్ద అనేది కూడా తానే ఖరారు చేస్తానంటుంది.  వీటికి ఒప్పుకొనకపోతే ఆంక్షలు విధిస్తుంది. ఈ మధ్య కాలంలో అమెరికా అంక్షలకు బలయిపోతున్న దేశాలలో వెనిజుల ఒకటి. మిగతావి రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాలు. ఎన్ని అంక్షలు విధించినా వెనెజుల దిగిరాలేదు.చివరకు తిండి దొరక్కపోయినా ప్రజలు తిరగబడి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడం లేదు.
చివరకు అక్కడ ఎన్నికలు జరిగితే గెల్చినవాడిని ఆదేశాధ్యక్షుడిగా గుర్తించేందుకు కూడా అమెరికా నిరాకరించింది. ఇక లాభం లేదనుకుని అమెరికా చివరిగా సిలికాన్ వ్యాలీని ప్రయోగించింది.
చాప్టర్ 4
అమెరికాలో ఉండే సాఫ్ట్ వేర్ కంపెనీలేవీ వెనిజులతో బిజినెస్ చేయడానికి వీల్లేదని అమెరికా హుకుం జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13884 ను విడుదల చేసి వెనిజులాతో ఏవిధమయిన పాఫ్ట్ వేర్ వ్యాపారం చేయరాదని, వెనిజులాకు సాప్ట్ వేర్ సేవలేవీ అందించవద్దని అమెరికా నిషేధం విధించింది. అంతేకాదు, అర్ధాంతరంగాకంపెనీలు తమ సేవలను తామే నిలిపివేస్తున్నా, దీనికి వెనిజులా ప్రజలు, కంపెనీలు చెల్లించిన సబ్ స్క్రిప్షన్ ఫీజును కూడా రిఫండ్ చేయనవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.
సిలికాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఫ్రీ సర్వీస్ లను కూడా వెనిజులా కు నిలిపివేయాలని అమెరికా శాసించింది.
ఈ ఉత్తర్వులను మొట్టమొదట అమలు చేసిన సంస్థ అడోబ్ (Adobe ). అడోబ్ ఫోటో షాప్ తో పాటు  తన ఫ్రీసర్వీస్ అడోబ్ రీడర్ ను కూడా వెనిజులా ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నది.

ఒక సంవత్సరమా, ఆరునెలలో లేక రెండేళ్లా మూడేళ్లా అనే కాలపరిమితి లేకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 28 నుంచి ఈ సేవలు బంద్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ , గూగుల్, వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్…వంటి ఇతర కంపెనీలు కూడా అక్టోబర్ 28 లోపు వెనిజులా నుంచి వెదొలగాల్సి వస్తుంది.
అపుడు వెనిజులా పరిస్థితి ఎలా ఉంటుందో వూహించండి. ట్రంప్ లాంటి వాడు పవర్ లో ఉంటే ఈ పరిస్థితి రేపు ఏదేశానికైనా రావచ్చు. అమెరికా నుంచి దూరంగా జరగాలనుకున్నా, అమెరికా కంటే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నా సిలికాన్ వ్యాలీ సాప్ట్ పవర్ ను అమెరికా ప్రయోగించవచ్చు.