కేసిఆర్ ఆలోచనలకు ఈసి బ్రేక్ ?

తెలంగాణ సిఎం కేసిఆర్ ఏ స్టెప్ వేసినా ప్రతిపక్షాలకు అర్థం కావడానికి పుష్కర కాలం పడుతుందని ఒక మాట ప్రచారంలో ఉంది. ఆయన రానున్న 2019 ఎన్నికల్లో వేయాలనుకున్న స్టెప్ కు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. కేసిఆరే కాదు.. ఆయనలాంటి యాక్షన్ ప్లాన్ తో వెళ్లాలనుకున్న వారందరికీ ఇదొక షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఇంతకూ ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించేందుకు తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నాలు షురూ చేశారు. అందుకోసం ఆయన రానున్న 2019 ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానానికి, అలాగే ఒక పార్లమెంటు సీటుకు పోటీ చేస్తారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న గజ్వెల్ సీటులో పోటీ చేస్తూనే నల్లగొండ పార్లమెంటు సీటుకు కేసిఆర్ పోటీ చేయవచ్చన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నది.

కానీ కేసిఆర్ ఆ రకమైన పోటీకి దిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయనుందన్నవార్త ఒకటి వెలువడింది. ఒకేసారి లోక్ సభ సీటుకు, అసెంబ్లీ సీటుకు పోటీ చేయడాన్ని ఇకపై నిషేధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒకేసారి రెండు లోక్ సభ సీట్లకు కానీ, రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోటీని నివారించేందుకు ఈసి చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఈ విషయమై ఒక అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ చేయాలన్న నిబంధన తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒక్కో అభ్యర్థి ఒక్క స్థానం కోసం మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు భారత ఎన్నికల సంఘం నివేదించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి అటు ఎంపీ స్థానంతో పాటు ఇటు ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ దాఖలైన పిల్ కు సమాధానంగా ఈసీ ఈ మేరకు వెల్లడించింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఓ నియోజక వర్గాన్ని వదిలి మరో స్థానానికి వెళ్లడం ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఈసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

సో మొత్తానికి సుప్రీంకోర్టు ఏరకమైన తీర్పు చెబుతుందా అన్నది ఇప్పుడు రెండుచోట్ల పోటీ చేయాలనుకున్న లీడర్లకు కొద్దిగా టెన్షన్ గానే ఉందని చెప్పక తప్పదు. కేసిఆర్ తో పాటు మిగతా లీడర్ల ఆలోచనలపై ఈ నిర్ణయం ప్రభావం చూపడం ఖాయం అని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *