నేడు పి శివశంకర్ మొదటి వర్ధంతి

“నేడు, పి శివ శంకర్ ప్రధానమంత్రి తర్వాత దేశములో అత్యంత శక్తివంతమైన వ్యక్తి’’
1986 నాటికి ఇండియా టుడె పత్రిక రాసిన కథనం ఇది.
‘ కొందరు ఏమి ఆశించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. మరి కొందరు ఇతరుల చేసిన పనిని తమ ఖాతాలో వేసుకుంటారు . ఆ కృషి ఫలితాన్ని అనుభవిస్తారు. ‘ – మాజీ ప్రధాని ఇందిరాగాంధి. పై వాఖ్యలో మొదటి తరగతికి చెందుతారు మాజీ కేంద్ర మంత్రి ,మాజీ గవర్నర్ శ్రీ పుంజాల శివశంకర్ గారు. ఆగస్ట్ 10,1929 న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లి లో ఒక పేద మున్నూరుకాపు కుటుంబములో 11 మందిసంతానములో రెండోవాడిగా పుట్టిన శివశంకర్ మెట్రిక్యులేషన్ వరకు హైదరాబాద్ లో చదివి ఆ తర్వాత చదువుకు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడడముతో తన అన్నతో కలిసి ఇంట్లో నుండి పంజాబ్ కి పారిపోయి చెప్పులు కుడుతూ , బూట్లు పాలిష్ చేస్తూ , కూలి పనులు చేస్తూ తిండి కరువైనపుడు మజ్జిగ తాగుతూ పల్లీలు తింటూ చదువుకుంటూ అమృత్ సర్ హిందూ కాలేజీ నుండి బీ.ఏ.పూర్తి చేశాడు.అన్నదమ్ములిద్దరు రైల్వే స్టేషన్ లో ఆశ్రయం తీసుకునేవారు. తిండి లేక ఆకలి బాధలకి గురై శివశంకర్‌ అన్న అమృత్ సర్ లోనే చనిపోతే సోదరుని శవాన్ని ఇంటికి తీసుకవచ్చే కనీసం దహనం చేసే స్థోమత లేకపోవడముతో మున్సిపాలిటీ వాళ్లకే శవాన్ని విడిచిపెట్టాల్సిన విషాధ పరిస్థితుల మద్య శివశంకర్ చదువు కొనసాగింది. అటువంటి కఠోరమైన పరిస్థితుల్ని పేదరికాన్ని ఎదుర్కొన్నారు శివశంకర్. తన జీవితాంతం ఇంట్లోని దేవుని పూజ గదిలో తన అన్న ఫోటో ని పెట్టి ఉంచేవాడు. ఆ తర్వాత హైదరాబాద్ చేరి చిన్న చిన్న పనులు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బీ.ని 1952 లో పూర్తి చేసిండు.అప్పటి హైదరాబాద్ మేయర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేసిండు.

న్యాయకోవిదుడుగా , రాజ్యాంగ నిపుణిడిగా , న్యాయశాఖ మంత్రిగా :

న్యాయ శాస్త్రాల్లో ,ఇంగ్లీష్ భాషలో మంచి పట్టుగల శివశంకర్ హైదరాబాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీసుని ప్రారంభించి పేదల బడుగు బలహీన వర్గాల కేసులని ఉచితంగా మీదేసుకుని కోర్టులల్లో వాదించేవాడు. మంచి సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకొని సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిండు . 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా పని చేసిండు. . 1974 నాటికి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జిస్థాయికి ఎదిగిoడు. ఆంధ్రప్రదేశ్ లోని న్యాయ వ్యవస్థలో ఒకే కులానికి చెందినవారు ఆధిపత్యం వహిస్తూ సీనియారిటి ప్యానల్ లో మిగతావారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనించి తను ప్రభుత్వ న్యాయమూర్తి పరిధిలో పేదల బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేయలేకపోతున్నానని ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిండు. చదువుకోవడమంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడము సమాజాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత ఎదుగుదలే ముఖ్యంగా భావించే నేటి తరానికి సమాజం కోసం హై కోర్ట్ జడ్జి స్థాయి ఉద్యోగాన్ని వదులుకోవడము లో ఆయనలోని సామాజిక స్పృహ , ఆకాశమంతటి ఆత్మవిశ్వాసం , ధృడమైన పట్టుదలని తెలియజేస్తుంది . దేశంలోనే మొదటి సంఘటన ఇది. హై కోర్ట్ జడ్జి గా రాజీనామా చేసి హై కోర్ట్ సుప్రీం కోర్టులల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ అన్ని వర్గాలకి సామాజిక న్యాయం విషయములో అధ్యయనం చేస్తుండేవాడు.దేశములోనే ప్రతిభావంతుడైన న్యాయవాదిగా ఎదిగిన శివశంకర్ ని మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమర్జెన్సీ సమయములో తన ప్రత్యేకన్యాయవాదిగా పెట్టుకుంది.

ఎమెర్జెన్సీ సమయములో అనేక కేసులని , కమీషనులని సమర్థవంతంగా డీల్ చేసిండు. 1979 లో మొరార్జీ దేశాయి ఇందిరాగాంధీల మద్య యుద్ధముల ప్రతిష్టాత్మకంగా భావించబడిన సికింద్రాబాద్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో శివశంకర్ కాంగ్రేస్ తరపున పోటీ చేసి గెలవడము అప్పట్లో రాజకీయ సంచలనం. తిరిగి 1980 లో అదే స్థానం నుండి గెలిచిన శివశంకర్ ఇందిరాగాంధీ ప్రభుత్వములో కోరుకొని న్యాయశాఖ మంత్రిగా పనిచేసి భారత న్యాయవ్యవస్థలో విప్లవకరమైన మార్పులు తీసుకొచ్చిండు. రిజర్వేషన్స్ లేని భారత న్యాయ వ్యవస్థలో ఒక్కో రాష్ట్రం లో ఒక్కో కులం ,ఆధిపత్యం చెలాయిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కీ కనీస ప్రవేశం లేకుండా చేస్తున్నారని భావించి ఒక రాష్ట్రంలోని 30% హైకోర్ట్ సీనియర్ న్యాయమూర్తులు వేరే రాష్ట్రాలకి వెల్లిపోవాలని అందుకు మూడు ఆప్షన్స్ ఇవ్వాలని మార్చ్ 18, 1981 న న్యాయశాఖ మంత్రిగా భారత ప్రధాన న్యాయమూర్తి వై.వీ.చంద్రచూడ్ ని సంప్రధించకుండానే అన్ని రాష్ట్రాల గవర్నర్ లకి ముఖ్యమంత్రులకి న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకి బదిలీ పై పోయే విషయములో ఒక సర్క్యులర్ జారీ చేసిండు .

భారతదేశ చరిత్రలో బ్రాహ్మణ అగ్రవర్ణ కబంధ హస్తాలలో చిక్కిపోయిన దేశ న్యాయ వ్యవస్థను కూకటివేళ్ళతో పట్టి కుదిపివేసిన సంఘటన ఇది. న్యాయ వ్యవస్థ లో బ్రాహ్మణ మరియు కొన్ని అగ్రవర్ణాల కుల , మత , ప్రాoత గుత్తాధిపత్యాన్ని తొలగించడమే ఈ చర్య ఉద్ధేశ్యం. న్యాయమూర్తులని అలా బదిలీ చేయడము వల్ల ఈ దేశ సమగ్రతకి తోడ్పడుతదని బంధువులు కుల మత ప్రాంత సంకుచిత దోరణులకి అతీతంగా న్యాయవ్యవస్థ పనిచేస్తుందని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. కొత్తగా బదిలి అయిపోయిన రాష్ట్రంలో న్యాయమూర్తులకి వారు పుట్టిన రాష్ట్రంలోని వారి ఆధిపత్య కుల మూలాలు వేరొక రాష్ట్రంలోని మూలాలకి తేడా ఉంటుందనీ కులం భాష ప్రాంత తేడాలుండడం వల్ల ఆయా రాష్ట్రాలలో ఒకే కుల గుత్తాధిపత్యంని నిలిపివేసి అందరికి సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని భావించిండు. మరియు ఆ సర్కులర్ లో ఎస్సీ ఎస్టీలతో సహ ఇతర వెనుకబడిన బలహీన వర్గాలను అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి పదవులలో నియమించడానికి ప్రత్యేక కృషి జరగాలని ఉత్తర్వులు జారి చేసిండు. ఆ సర్క్యులర్ న్యాయవ్యవస్థలో దుమారం లేపింది. న్యాయశాస్త్రం లో ఉన్న అపార ప్రజ్ఞ , సామాజిక న్యాయం అమలు పట్ల ఆయనకుండే ధృడ సంకల్పమే న్యాయవ్యవస్థతో పెట్టుకోవాలంటే భయపడే మహామహుల కంటే అతనిని ముందడుగు వేయించింది. మధ్య డిసెంబర్ 30,1981 న సుప్రీం కోర్ట్ ఎస్.పి.గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ ఈ సర్క్యులర్ కి న్యాయపరమైన బలం లేనందున రాజ్యాంగబద్ధం కాదు అని కూడా అనలేమని ‘ వాఖ్యానించింది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు , న్యాయ కోవిధుడు గ్రాన్వీల్ ఆస్టిన్ తన ‘ A Democratic Constitution : The Indian Experience (1999) ‘ గ్రంధములో ఈ సర్క్యులర్ విషయములో ఇలా అంటాడు “ శివశంకర్ గారి ధృష్టిలో జడ్జీలు మేధావులు అందరూ బ్రాహ్మణ లేదా అగ్రవర్ణాల నుండి వస్తున్నవారే.న్యాయవ్యవస్థలో వారి ఏకస్వామ్యాన్ని బద్దలుకొట్టి వెనుకబడిన తరగతులైన ఓబీసీ లు ,ఎస్సీ ఎస్టీ లు అడ్వకేటుల నుండి బెంచ్ స్థాయికి చేరాలే. హై కోర్ట్ ల చీఫ్ జస్టీసులు న్యాయవ్యవస్థలో సహోధ్యోగులని నింపడములో , కేసులు నిర్ణయించడములో కులానికి ప్రాధాన్యమిస్తున్నారు.బయటి నుండి జడ్జీలు రావడము వల్ల వాళ్ళకి కులపరమైన స్థానిక వేర్లు అందుబాటులోకి వచ్చే అవకాశముండదు.” ఇంకా ఆస్టిన్ అంటాడు” ఆంధ్రప్రదేశ్ కి చెందిన అతి పెద్ద ఓబీసీ వ్యవసాయ కమ్యూనిటీ మున్నూరు కాపు కులానికి చెందిన శివశంకర్ హైకోర్ట్ లో రెడ్డి కమ్యూనిటి వాళ్ళఆధిపత్యం మరియు ఇతనిని చీఫ్ జస్టీస్ గా అంగీకరించే పరిస్థితి లేనందు వల్లే తన జడ్జీ పదవికి రాజీనామా చేసి ఉంటాడు.” ఈ చర్య వల్ల తెలుగు వాడైన జస్టీస్ రామస్వామి దేశంలోనే తొలి దళిత సుప్రీంకోర్ట్ జస్టీస్ కాగలిగిండు . జస్టీస్ రామస్వామి విషయాన్ని శివశంకర్ వ్యక్తిగతంగా తీసుకొని విజయం సాధించిండు. ఆ తర్వాత కాలంలో న్యాయవ్యవస్థలో అంత బలమైన మద్దతుదారు ప్రభుత్వం తరపున లేనప్పటికి శివశంకర్‌ నైతిక మద్దతుతో 2007 నాటికి ఎస్సీ వర్గం నుండి నలుగురు , బీసీ వర్గం నుండి ఒకరు సుప్రీం కోర్ట్ జస్టీస్ గా చేసి 2007 లో జస్టీస్ కే.జీ. బాలకృష్ణన్ సుప్రీం కోర్ట్ తొలి చీఫ్ జస్టిస్ ( ప్రధాన న్యాయమూర్తి ) పదవిని చేపట్టిండు.
1987 లో శివశంకర్ చేసిన సుప్రీంకోర్ట్ పై చేసిన వాఖ్యలు ‘’ సుప్రీం కోర్ట్ సంఘ వ్యతిరేఖ శక్తులకి , ఫెరా ( Foreign Exchange and Regulatary Act ) ఉల్లంఘనకారులకి , పెండ్లికూతురులని కాల్చి చంపేవారికి మొత్తంగా తప్పుడు చర్యలకి ఆశ్రయంగా మారిపోయిందని ‘’‘ అని అనడం దేశములో గగ్గోలు పుట్టించాయి. సీనియర్ న్యాయవాది పి.ఎన్.దుదా ఈ వాఖ్యలని కోర్ట్ దిక్ఖారంగా కేసు ఫైల్ చేసిండు. తర్వాత సుప్రీం కోర్ట్ ఈ కేసు నుండి శివశంకర్ ని విముక్తుడిని చేసింది. ఎస్పీ గుప్తా కేసు తరువాత న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియ పద్దతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ప్రతి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే 1/3 మంది న్యాయమూర్తులు వేరే రాష్ట్రాల హైకోర్ట్ లకు చెందిన వారై ఉండాలి. కొంత కాలం ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగింది. కానీ ఆ తర్వాత ప్రస్తుతం పూర్తిగా అమలు కావడం లేదు.

ఇంధన , వాణిజ్య ,విదేశి వ్యవహారాల ,మానవ వనరుల శాఖల మంత్రిగా , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా :1982 లో ఇంధన శాఖనీ కూడా సమర్థవంతంగా నిర్వహించిండు . ఇంధన శాఖను నిర్వహించిన సమయంలో, రాజకీయ జోక్యం లేకుండా, పెట్రోలు బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల కేటాయింపులను క్రమబద్ధీకరించారు. మానవ వనరుల శాఖ మంత్రిగా కేంద్రీయ విద్యాలయాల విస్తరణకు కృషి చేశారు. ఇందిరాగాంధి మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన శివశంకర్ మెదక్ ( గతములో ఇందిరాగాంధి గెలిచిన స్థానం ) నుండి లోక్ సభ కి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడముతో 1985 నుండి 1993 వరకు గుజరాత్ నుండి రాజ్యసభకి ఎన్నికై కేంద్ర వాణిజ్య శాఖామంత్రిగా 1985 లో ,1986 లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వహించిండు. పార్టీలో సీనియర్లు , ప్రధానికి దగ్గరి వాళ్ళు మాత్రమే చేపట్టే ఈ మంత్రిత్వ శాఖని కొద్ది కాలము చేసిన విదేశాంగ విధానములో కీలకమైన మార్పులు తీసుకవచ్చిండు. సైద్ధాంతిక విలువల ప్రాతిపదికన ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో దేశ ఆర్థికాభివృద్ధి కోణాన్ని చేర్చిన ఘనత శివశంకర్ కే దక్కుతుంది. గల్ఫ్ దేశాలతో పెట్రోలీయం దిగుమతి మినహా ఇతర ఆర్థికాంశాల గురించి భారతదేశం దృష్టి సారించలేకపోవడాన్ని గమనించిన శివశంకర్ లక్షలాది మంది భారతీయులు ఉన్న గల్ఫ్ ఎడారులలో మన వాళ్ళకు మన బీడీలు అమ్మరాదా అంటూ దౌత్యవేత్తలను ప్రశ్నించారు. 1986 లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగా అదనంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్ద ఉండడముతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది.గల్ఫ్ దేశాలాలోని భారతీయుల సంక్షేమానికి కూడా ఆయన కృషి చేశారు.గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవము , సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం , స్వయం ఉపాధి కల్పనా దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అప్పట్లో రాష్ట్ర పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో ఒక సలహా కేంధ్రాన్ని ఏకంగా గల్ఫ్ లో నెలకొల్పారు. ఉపాధి మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రములో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇమ్మిగ్రేషన్ చట్టములో అనేక సవరణాలను ఆయన చేయించడము జరిగింది.సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాలు కాశ్మీర్ విషయములో పాకిస్తాన్ పట్ల సానుభూతిగా ఉండడాన్ని గమనించిన శివశంకర్ కాశ్మీరీ నేత ఫరూఖ్ అబ్దుల్లాని భారతీయ అధికారిక హజ్ బృంద నాయకుడిగా సౌదీ అరేబియాకి పంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.దూరదృష్టి కలిగిన శివశంకర్ ప్రధాని దూతగా పాకిస్తాన్ పర్యటనకి వెళ్ళి అక్కడ ఒక సమావేశములో ఉర్ధూలో మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని విన్న పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ తాను శివశంకర్ తరహా అనర్ఘళమైన ఉర్ధూలో మాట్లాడలేనంటూ చెప్పారు. భారత దేశానికి చెందిన ఒక అతి పెద్ద వ్యాపార సంస్థకు గల్ఫ్ లో ఒక ప్రత్యేక గెస్ట్ హౌస్ ఉంది. అందులో ముఖ్యమంత్రులు , కేంద్రమంత్రులకు కూడా ఆతిథ్యమివ్వరు. అయితే ఒకప్పుడు రైల్వే ప్లాటుఫారంపై పడుకున్న శివశంకర్ ని ఆ సంస్థ వారు ప్రత్యేక అతిథిగా ఆదరిస్తారంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనమే కారణం.
1987-88 లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేసిండు.1989 లో రాజ్యసభ నాయకుడిగా ( Leader of the House ) , 19991 లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిండు.

దళితుల అభ్యున్నతి కోసం :

మనం శక్తివంతులమైతే , మనం సమర్థులమే ఐతే , మన అవసరమే ఉంటే మన యజమాని ఐనా , శత్రువైన సరే మన న్యాయమైన , విలువైన అభిప్రాయాలకి అనివార్యంగా విలువిస్తాడనేది , తలొగ్గుతాడనేది శివశంకర్ జీవితాన్ని చూస్తే అర్థమవుతది.శివశంకర్ జీవితాంతం అంబేడ్కర్ , ఫూలే కాన్సెప్ట్ మీద పని చేసిండు. జ్యుడీషియల్ తో సహ అన్నీ రంగాల్లో దళితులకి ప్రాతినిధ్యం ఉండాలని శివశంకర్ కోరుకునేవాడు. దళితుడైన జస్టిస్ రామస్వామిని సుప్రీం కోర్ట్ జడ్జ్ గా చేయాలనే విషయాన్ని శివశంకర్ అధికారికంగా టేకప్ చేసిండు. ఎస్సీ ఎస్టీ లకి ఉద్యోగాలల్లో ప్రమోషన్స్ ఉండాలనే ప్రతిపాదనకి బలమైన మద్దతుదారునిగా నిలిచిండు. ఎక్కడనైనా అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడాన్ని ప్రోత్సాహించేవాడు. సంగారెడ్డి, కరీంనగర్ లాంటి పట్టణాలలో అంబేడ్కర్ విగ్రహాలని ఆవిష్కరించిండు. జలాల్ పూర్ లాంటి నిజామాబాద్ జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ లకి వెళ్ళి మాట్లాడేవాడు. తన కుమారుడు సుధీర్ రెడ్డి మలక్ పేట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నపుడు ప్రస్తుత ఎల్.బీ. నగర్ సెంటర్ లో కాంగ్రేస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నపుడు దళిత ఉద్యమ నేత జే.బీ. రాజు గారి సూచన మేరకు శివశంకర్ తన కొడుకుని సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహం , కొంచెం దూరంగా రాజీవ్ విగ్రహం పెట్టించేలా ఒప్పించిండు. ఆ చర్య ఆ ప్రాంతంలో అనేక సామాజిక మార్పులకు, నిర్మాణాలకు దోహదం చేసింది.జే.బీ.రాజు గారి మాటల్లో ” శివశంకర్‌ గారు ఎపుడు అంబేడ్కర్‌ , దళిత సంఘాలలో అసోసియేట్ మెంబర్ గానే మెదలేవాడు .”

మహిళా అభ్యున్నతవాది :

పుంజాల శివశంకర్ గారు తన బార్యని ఎల్.ఎల్.బీ., ఎంబీయే. , పీహెచ్డీ ., డబుల్ డీ లిట్ చదివేళా ప్రోత్సాహమించడమే కాదు. తను బయటకొచ్చి ఉద్యోగం చేయలేకపోయిందని ఎప్పటికీ బాధపడేవాడు. జూన్ 27 ,2015 హెచ్.ఏం. టీవి అవని కార్యక్రమములో ఆమె మాట్లాడుతూ “ నువ్వు చదువుకుని నాతోపాటు కోర్ట్ కి వస్తావనుకున్నాను. ఇలా వంటింటిలో ఉంటావనుకోలేదు” అనే మాటలు మాత్రమే వాళ్ళ వైవాహిక జీవితములో ఘర్షణ పడిన సంధార్భాలు అని చెప్పింది. మహిళా బిల్లు లో ఎస్‌సి,ఎస్టీ ,బీసీ మహిళలకు కోట ఇచ్చేంత వరకు ప్రతిపాదించిన స్థితిలో అంగీకరించేది లేదని కాంగ్రెస్ పార్టీలో వాదించి వెనుకడుగు వేసేలా ఒప్పించిండు.

బీసీ రిజర్వేషనుల సాధకుడు – బీసీల వర్గీకరణకూ మూలపురుషుడు :

మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటూ బ్యానర్లలో , టీవీ ప్రకటనల్లో , ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ప్రచారం చేసుకుంటారు. ఎన్నికల్లో గెలిచి అధికార ఫలాలను అనుభవిస్తారు కాని బిసిలకు మాత్రం మొండిచేయి చూపుతారు. కాని బీసీల మద్దతుతో గెలిచి తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన నాయకులు చాల తక్కువ మంది కనిపిస్తారు. ఆలా బీసీల అభివృద్ధికి తోడ్పడిన వాళ్లలో పుంజాల శివ శంకర్ గారు మొదటి వరుసలో ఉంటారు.
1972లో ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత అనంతరామన్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ బీసీ కులాలకు 30% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. దీనిపై ఏపీ హైకోర్టులో 110 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యా యి, అప్పుడు బీసీలకు 30% రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వగా… అప్పటి JAC తరపున శివశంకర్‌ సొంత ఖర్చుతో 18 నెలలు ఢిల్లీలో ఉండి సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్లను గెలిపించుకొని వచ్చారు. భావి తరాలకు చెదరని బహుమతి నిచ్చారు. ఆ తర్వాత కొందరి కుట్రతో ప్రస్తుత బీసీ –బీ మరియు బీసీ –డీ ల లోని కొన్ని కులాలను బిసి ల జాబితా నుంచి తీసివేసి మళ్ళి ఓసీల్ల్లో చేర్చారు. దీనితో మళ్ళి ఆ కులాలను బీసీల్లో చేర్చటం పై న్యాయస్థానంలో ఎనలేని పోరాటం చేసి విజయం సాధించాడు. సుప్రీంకోర్టులో శివశంకర్‌ పోరాటం తో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విధానం ఏర్పడింది. ఆ విధానమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణ ఏర్పాటు సమయములో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విధంగానైతే ఆంధ్రావాళ్ళ రిపోర్ట్ ల తయారీలో సహాయం చేసిండో , అదే విధంగా జనతా ప్రభుత్వ పాలనలో వీ.పీ. సింగ్ కి మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేయడానికి తీసుకునే నిర్ణయాలలో , డ్రాఫ్టింగ్ లో శివశంకర్ పాల్గొన్నాడు.
కింది స్థాయి నుంచి ఎదిగి నాయకులూ అయ్యే వారు చాల మంది ఉంటారు ,కాని ఒక బలహీన వర్గాల కుటుంబంలో అది కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి దేశ రాజకీయలను ఒక దశాబ్దం పాటు శాసించే స్థాయికి ఎదగటం అంటే మాములు విషయం కాదు . అది కూడా ఇందిరా గాంధీ లాంటి శక్తిశాలికిి కుడి భుజంలాగా ఉండటం అంటే అంత సులువు కాదు.ఇందిరా , రాజీవుల ఇండ్లకి పక్కనే ఎప్పటికీ శివశంకర్ ఇల్లు ఉండేది. అతనెప్పుడు మీడియాలో కనిపించేవాడు కాదు ఎక్కువ. ఎక్కువగా వేదికలపై మాట్లాడేవాడు కాదు.కానీ తన పని విధానమే తన బలమెంతో, స్థాయి ఏంటో తెలియజేసేది. దానితో పాటు తాను బలహీన వర్గాల మనిషినని మర్చిపోకుండా బలహీనవర్గాల కోసం తీవ్రంగా పోరాడి, ఎంతో మంది అగ్రకుల ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నిలిచి బీసీలకు రిజర్వేషన్లు సాధించిన ఘనుడు పుంజాల శివ శంకర్ గారు. 1998 సాధారణ ఎన్నికలలో, పి. శివ్ శంకర్ ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేశాడు. అతను తెలుగుదేశం పార్టీకి చెందిన సినీ నటి శారదాపై గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారు. శివశంకర్ కుటుంబం కూడా అతని వలె వారి వారి రంగాల్లో నిష్ణాతులై ఉండి కూడా చాలా తక్కువ ప్రొఫైల్ మైంటన్ చేస్తూ మరియు నిగర్వంగా ఉంటారు. శివశంకర్ రాజకీయాల్లో ఉంటూ తన కుటుంబానికి విలువలే తప్ప ఆస్తిని ఇవ్వలేకపోయిండు. శివశంకర్ భార్య లక్ష్మీ బాయి 85 సంవత్సరాల వయస్సులో ఆమె డబుల్ D.lit చేసింది. శివ్ శంకర్ చిన్న కుమారుడు పి.సుధీర్ కుమార్ మలక్ పేట్ నుండి 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్ అతను దురదృష్టవశాత్తూ అకాల మరణం చెందిండు. ఆయన పెద్దకొడుకు డాక్టర్ పీ. వినయ్ కుమార్ ఒక ప్రముఖ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జికల్ మరియు సామాజిక ఉద్యమ నాయకుడు. వినయ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికారికమైన రిజెర్వేషన్లు కల్పించాలని సుప్రీమ్ కోర్ట్ లో రిట్ వేసి గెలిచి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. స్థానిక సంస్థలల్లో బీసీ లకు రిజర్వేషన్స్ కల్పిస్తూ వేసిన రిట్ వినయ్ గారి పేరిటే ఉంది. ఈ కేసు గెలవటం వలన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహ భాగం నాయకులు బీసీలే ఉన్నారు. పుంజాల వినయ్ ప్రజారాజ్యం పార్టీలో చాల చురుకు గా ఉండి పార్టీ పేరు ,ఎన్నికల గుర్తు రావటంలో కీలక పాత్ర వహించాడు.శివ శంకర్ గారి పెద్ద కోడలు అలేఖ్య పుంజాల దేశంలోని ప్రసిద్ధి గాంచిన కూచిపూడి నృత్యకారిణి. ప్రస్తుతం ఆమె తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ గా కొనసాగుతుంది. ఈమెకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. శివశంకర్ గారు సంగీత వెంకట రెడ్డి, వంగవీటి మోహన రంగా, కన్నా లక్ష్మి నారాయణ, షబ్బీర్ అలీ, ముఖేష్ గౌడ్, సి.రామచంద్రయ్య , ధర్మాన ప్రసాద రావు మరియు అనేక మందికి రాజకీయ జీవితం ఇచ్చిండు. ఆంధ్ర కాపు మహానీయుడు వంగవీటి మోహన రంగాకి అన్ని రకాల అండదండగా నిలిచిండు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మరియు యాబై ఏండ్ల అగ్రవర్ణ పాలనపై ప్రజలు విసిగిపోయారని , ఇకనైనా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనీ 2002 చివరలో వరంగల్ లో శ్రీమతి సోనీయాగాంధీ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కాంగ్రేస్ – బీసీల మహాసభని నిర్వహించిండు. ఇది కనివిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. అదే వేదికపై కూర్చున్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి బీసీల సభ కాబట్టి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వబడలేదు. ఆ చైతన్యాన్ని చూసి శివశంకర్‌ గారు వచ్చే ఎన్నికలలో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడే అవకాశం ఉందనీ గ్రహించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పార్టీలో పట్టు కోసం 2003 లో పాదయాత్ర మొదలు పెట్టిండు. అగ్రవర్ణ రెడ్డీ లాబీయింగ్ తో అధిష్టానం వద్ద పట్టు సంపాదించి రాష్ట్రంలో తనకు పోటీ ఉండకూడదని శివశంకర్ వయసులో పెద్ద వాడని చివరకు 2004 లో పుంజాల శివశంకర్ కు టిక్కెట్ కూడా రాకుండా అడ్డుకున్నడు . ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుందని విమర్శిస్తూ తాను 30 ఏoడ్లు కాపాడిన కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగాడు శివశంకర్ . అతని రాజీనామా లేదా అతని చేసిన ఆరోపణలకు పార్టీ నుండి ఎటువంటి స్పందన రాలేదు.
1991 లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల పట్ల అపార అనుభవం , దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కల్గిన,ఇందిరాగాంధి మరియు రాజీవు గాంధీలకు అత్యంత పాలన విషయములో అత్యంత సన్నిహితుడైన పుంజాల శివశంకర్ దేశ ప్రధాని కావల్సి ఉండే కానీ ఒక బీసీ వ్యక్తి కావడమే పుంజాల శివశంకర్ కి అనర్హత అయ్యింది. బ్రాహ్మనుడైన పీ.వీ. నర్సింహ్మారావు ఆ స్థానములో కూర్చున్నాడు. పుంజాల శివశంకర్ దేశ ప్రధాని అయితే 1991 ఆర్థిక సరళీకరణల బదులు దేశ ముఖ చిత్రం మరోలా ఉండేదేమో ! ఉన్నతమైన నిండైన శిఖరం లాంటి వ్యక్తిత్వం,నిస్వార్థ నిరాడంబర జీవితం, అపార ప్రజ్ఞ , విభిన్న నాయకత్వ లక్షణాలు కల్గిన శివశంకర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండడము తమకి శ్రేయష్కరం కాదని భావించిన అగ్రవర్గాలు భౌగోళికంగా జిల్లా స్థాయిలో లో ఉండే సిక్కిం , కేరళ లాంటి చిన్న రాష్ట్రాలకి 1994 నుండి 1995 వరకు సిక్కిం గవర్నర్ గా మరియు 1995 నుంచి 1996 వరకు కేరళ గవర్నర్ గా పంపించాయి . 2008 లో, అతను తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి కి వెన్నుదన్నుగా ఉండి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. చిరంజీవికి నైతికంగా వెనక ఉండి తెలుగు సమాజములో సామాజిక న్యాయము , మహాత్మా జ్యోతి బా ఫూలే ని పరిచయము చేసేలా చేసింది పుంజాల శివశంకర్ గారే . ప్రజారాజ్యం సామాజిక న్యాయం ఐడియాలజీ శివశంకర్‌ ఇంట్లో పుట్టిందే. కమ్మ , రెడ్డి మీడియా కుయుక్తులు , పార్టీ టికెట్స్ అమ్ముకున్నారనే దుష్ప్రచారం చేసి పార్టీని అబాసుపాలు చేసిండ్రు. సున్నిత మనస్కుడైన చిరంజీవిని నెైతికంగా మానసికంగా దెబ్బతీసిండ్రు. మిత్రుడిగా , ఆప్తుడిగా మెదలిన బ్రాహ్మణుడు పరకాల ప్రభాకర్ కోవర్ట్ గా పనిచేసి ప్రజారాజ్యం ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల ముందు ” పార్టీ విష వృక్షంగా తయారైందనీ , టికెట్స్ అమ్ముకున్నారు ” అని తీవ్ర ఆరోపణలతో దెబ్బతీసిండు. ( ప్రస్తుతం జనసేన పార్టీ సలహాదారుడు , పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా బ్రాహ్మణుడే అనే విషయాన్ని గ్రహించాలి మనం ) బీసీలకు 100 సీట్లు ఇచ్చి అప్పటి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం గురించి జనంలో చర్చ తేగలిన ప్రజారాజ్యం పార్టీ ఆగష్ట్ 2011లో కాంగ్రెస్ లో విలీనమయింది. తన కల సిద్ధించని శివశంకర్ గారు 87 సంవత్సరాల వయస్సులో 27 ఫిబ్రవరి 2017 న మరణించాడు. గొప్ప విజన్ కలిగి ఉండి అపారమైన ప్రజ్ఞ గల , మార్గం తెలిసి పని విధానం తెలిసిన పుంజాల శివశంకర్ గారు జీవితాంతం అత్యున్నత విలువలు పాటించిన మహానీయుడు. అతని స్వప్నమింకా మన ముందు మిగిలే ఉంది. ( ఫిబ్రవరి 27, 2018 పుంజాల శివశంకర్ మొదటి వర్ధంతి.)
– ఇట్యాల వెంకటకిషన్
వ్యవస్థాపక అధ్యక్షుడు
ఛత్రపతి సాహుమహారాజ్ సంఘర్షణ సమితి
9908198484

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *