నలభై యేళ్ల కిందటి మాట… మాస్కూల్లో లాస్ట్ పీరియడ్

(సిఎస్ సలీమ్  బాష*)

అప్పట్లో  పీరియడ్ అంటే స్కూల్లో పిల్లలందరికీ ఎంతో ఆనందం ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఆటలు తప్ప పాఠాలు ఉండేవి కాదు. అంటే ప్రతిరోజూ లాస్ట్ పీరియడ్ లో గేమ్స్ లేదా ఎన్ ఎస్ ఎస్ ఉండేవి.

ఇప్పుడు స్కూళ్లలో ఫస్ట్ పీరియడ్ నుండి లాస్ట్ పీరియడ్  దాకా చదువు తప్ప ఇంకే వ్యాపకము లేదు. పైగా మళ్లీ స్కూలు తర్వాత అదనంగా స్టడీ అవర్ లు. పోనీ ఆదివారం అయినా ఆటవిడుపు ఉంటుందనుకుంటే పొరపాటే! ఆ సెలవు దినం లో ప్రైవేట్ క్లాసెస్, డౌట్ క్లారిఫికేషన్ క్లాసులు సిలబస్ పూర్తి చేసే క్లాసులు ఉంటాయి!

పిల్లలకి లాస్ట్ పీరియడ్ లో ఉన్న ఆ లాభాలన్నీ అప్పట్లో చదువుకున్నవాళ్లు చెప్తే తప్ప తెలియవు. అప్పుడు లాస్ట్ పీరియడ్ లో ఏదో ఒక ఆట ఆడడం లేదా డ్రిల్లు చేయడం లేదా సోషల్లీ యూస్ ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ (SUPW) లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండేది. ఈ తరం పిల్లలకి ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో సాఫ్ట్ స్కిల్స్ పేరుతో టీం వర్క్,  సేవా దృక్పథం , కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రత్యేకంగా నేర్పించే వలసిన అవసరం ఏర్పడ్డానికి కారణం లాస్ట్ పీరియడ్  లేకపోవడమే!

అంటే ఇప్పటి లాస్ట్ పీరియడ్ గతంలో ని లాస్ట్ పీరియడ్ లా లేకపోవడమే!

నలభై యాభై ఏళ్ల క్రితం ఏ స్కూల్ లో అయినా సరే లాస్ట్ పీరియడ్ లో వల్ల కావచ్చు ఎన్ఎస్ఎస్ వల్ల కావచ్చు సోషల్లీ యూస్ ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ వల్ల కావచ్చు ఎన్నో నైపుణ్యాలు సులభంగా వచ్చేవి పిల్లలకి.ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ పేరిట ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. క్రియేటివ్ థింకింగ్,  క్రిటికల్ థింకింగ్,  ప్రాబ్లం సాల్వింగ్ డెసిషన్ మేకింగ్,  నాయకత్వ లక్షణాలు,(లీడర్షిప్ స్కిల్స్) వంటివి చదువు లో భాగంగా ఉండేవి, ముఖ్యంగా లాస్ట్ పీరియడ్ లో పైన చెప్పిన వాటిని సహజంగానే నేర్చుకునే అవకాశం ఉండేది. అది లాస్ట్ పీరియడ్ ఇంపార్టెన్స్!  మన విద్యా వ్యవస్థ ముందుకు వెళ్ళింది కానీ గుణాత్మకంగా కాదు, పరిమాణాత్మకంగా!! అంటే విద్యా ప్రమాణాలు బాగా పడిపోయాయి..విద్యా సంస్థలు మాత్రం పెరిగిపోతున్నాయి.

ఈ మధ్య జరిగిన సర్వేలో చిన్న వయసులోనే స్థూలకాయం పిల్లల్లో ఎక్కువైందని తేలింది. దానికి కారణం కూడా లాస్ట్ పీరియడ్ . పిల్లలు శారీరక శ్రమ కింద ఆటలు లేవు గానీ పుస్తకాలు మోస్తున్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థలో పుస్తకాల సంఖ్య ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందంటే అది మోస్తున్న పిల్లల వెన్నెముక కాలక్రమేణా దెబ్బ తినేంత. ఇప్పుడు పిల్లలకి అదొక్కటే శారీరక శ్రమ. దాంట్లో ఆనందం లేదు,  నేర్చుకునే విషయాలు లేవు.

పిల్లలు ఆడుకునే అవకాశం లేకపోవటానికి ప్రధాన కారణం స్కూళ్లకు అట మైదానం లేకపోవటం. కొన్ని స్కూళ్లకు మైదానం ఉన్నా ఆటలు సిలబస్ లో భాగంగా లేకపోవటం వల్ల పిల్లలు వినోదం తో పాటు అనేక అంశాలు నేర్చుకోలేక పోతున్నారు. ఇంతకు ముందు చెప్పిన నైపుణ్యాలు కళాశాల స్థాయిలో మళ్ళీ నేర్పించాల్సి వస్తోంది.

 

అప్పట్లో లాస్ట్ పీరియడ్ కోసం కొట్టే స్కూలు బిల్లు లో ఎంత థ్రిల్లు!!  పొలోమని  గ్రౌండ్ కు పరిగెత్తటం.. ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేకుండా అలసి పోయెంతదాకా ఎదో ఒకటి ఆడటం. తర్వాత కబుర్లు ( కమ్మ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యేవి). చీకటి పడ్డాక ఇంటికెళ్ళడం భలే ఉండేది. మళ్ళీ ఉత్సాహంగా పొద్దున్నే స్కూలు కు పరిగెత్తడం. లాస్ట్ పీరియడ్ కోసం ఎదురుచూడడం. తల్చుకుంటే ఇప్పుడు కూడా ఉత్సాహాం తన్నుకొస్తుంది. అదీ లాస్ట్ పీరియడ్ ఎఫెక్ట్!

ఇప్పుడు పిల్లలు లాస్ట్ పీరియడ్ కోసం ఎదురుచూడడం లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని ఎదురు చూడ్డం తప్ప. ఇప్పుడు పిల్లల జీవితంలో  లాస్ట్ (last) పీరియడ్ లేదు. అది పోయింది. అందుకే అది లాస్ట్ పీరియడ్ కాదు. Lost పీరియడ్ !!

 

(*సిఎస్ సలీమ్ బాష, పర్సనాలిటి డెవెలప్ మెంట్ నిపుణుడు, కర్నూలు(

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *