వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై తెలంగాణ సర్కారు సీరియస్

కోవిడ్ -19 తీవ్రత, కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలు కొనసాగుతున్నా, తెలంగాణ అటవీ శాఖ పూర్తిస్థాయిలో పని చేస్తోంది. అరణ్య భవన్ లో ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది తమ విధులకు హాజరు అవుతున్నారు.

వేసవి తీవ్రమైన నేపథ్యంలో అడవుల్లో పరిస్థితిని ఎప్పటి కప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో అరణ్య భవన్ నుంచి ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆర్.శోభ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వేసవి నేపథ్యంలో పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు, అన్ని అటవీ ప్రాంతాలతో జంతువుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నీటి వసతి ఏర్పాటుపై సమీక్షించారు. అలాగే అడవుల్లో జంతువుల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్లు, సాసర్ పిట్స్ దగ్గర నిత్యం నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని PCCF ని ఆదేశించారు.

ఆయా జిల్లాల్లో అటవీ ప్రాంతాలను గ్రిడ్ లుగా విభజించి, సహజ నీటి వనరులు లేని చోట ఖచ్చితంగా కృత్రిమంగా నీటి వసతి ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని, అవి కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న చోట స్వేచ్ఛగా వన్యప్రాణుల సంచరిస్తున్న దృశ్యాలు అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలకు చిక్కాయి.

వేసవిలో వన్యప్రాణుల వేటకోసం వేటగాళ్ళు ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున అన్ని సంబంధిత ప్రాంతాల్లో ఫూట్ పెట్రోలింగ్ (కాలినడకన పర్యవేక్షణ) చేయాలని, తప్పనిసరిగా నీటి వసతుల వద్ద రోజూ ఈ తరహా చెకింగ్ ఉండాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది, బీట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన అటవీ బీట్ లకు రెగ్యులర్ గా వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని నోట్ కామ్ (Note Cam) యాప్ ఫోటోల ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కంపా (CAFMAPA-కంపెన్సేటరి ఎఫెరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతో చేపట్టిన పనులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల పురోగతిపై జిల్లాల వారీగా సమాచారం అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో వెనుకబడిన అర్బన్ పార్కుల సివిల్ పనులు, అడవుల చుట్టూ కంచెల (Protection walls) నిర్మాణం, అవి సాధ్యంకాని చోట అటవీ భూముల చుట్టూ కందకాల తవ్వకాన్ని వెంటనే చేపట్టాలని సూచించారు.

క్షీణించిన అటవీ ప్రాంతాలు, బోడి గుట్టలపై ఉపాధి హామీ పనుల అనుసంధానంతో వేసవిలో కందకాల (ట్రెంచ్) తవ్వకం చేపట్టాలని, వర్షాకాలంలో అడవుల్లో నీటి నిల్వలకు అవి తోడ్పడతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుందని విధి నిర్వహణ, అభివృద్ది పనుల్లో అలసత్వాన్ని సహించమని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ హెచ్చరించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ తో పాటు అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ.పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, ప్రత్యేక అధికారి శంకరన్, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర్ రెడ్డి, సునీతా భగవత్, అన్ని జిల్లాలకు చెందిన అటవీ అధికారులు పాల్గొన్నారు.