ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ కు కొత్త గండం?

అసెంబ్లీ రద్దు చేసి తెలంగాణ రాజకీయాల్లోనే కాక దేశంలోనే సంచలనం రేపారు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్. అసెంబ్లీ రద్దు చేసిన క్షణాల్లోనే ఆయన 105 మంది అభ్యర్థులతో జాబితాను కూడా ప్రకటించారు. మిగిలిన స్థానాలను మరికొద్దిరోజుల్లోనే ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీ రద్దు కోసం కేబినెట్ ఇచ్చిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేసిన వెంటనే మెరుపు వేగంతో గవర్నర్ ఆ తీర్మానానికి ఆమోద ముద్ర వేశారు. పనిలో పనిగా కేసిఆర్ ను తదుపరి ప్రభుత్వం వచ్చే వరకు ఆపద్ధర్మ సిఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు. దానికి కేసిఆర్ అంగీకరించారు. ప్రస్తుతం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

కేసిఆర్ మాటలు, బూతు పదజాలం వాడుతున్న నేపథ్యంలో ఆయనను ఆపద్ధర్మ సిఎంగా కూడా కొనసాగించడానికి వీలులేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదముందని ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్ష పార్టీల విన్నపం మన్నించిన గవర్నర్ ఈనెల 11వ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు విపక్షాలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్క పార్టీ, రెండు పార్టీలు కాదు విపక్ష పార్టీలన్నీ కేసిఆర్ ను ఆపద్ధర్మ సిఎంగా కూడా తొలగించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం క్లియర్ గా ప్రకటించారు. ఐదేళ్ల పాలన చేయమని ప్రజలు తీర్పిస్తే చేతగాదని దిగిపోయిండంటూ మండిపడ్డారు. అలా చేతగాక దిగిపోయిన వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడని కోదండరాం తేల్చి పారేశారు. కాబట్టి ఈ విషయమై గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్న జన సమితి ఈ అంశాన్ని ప్రధానంగా గవర్నర్ వద్ద ప్రస్తావించాలని నిర్ణయించింది.

జన సమితితోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ ను లేవనెత్తే అవకాశం ఉంది. దురుద్దేశంతో, కుట్రపూరితంగా అసెంబ్లీని రద్దు చేసుకుని పారిపోయిన కేసిఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా పనికాడన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈమేరకు ఈ విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. టిడిపి కూడా కేసిఆర్ ను ఆపద్ధర్మ సిఎం గా తొలగించాలని స్పష్టమైన డిమాండ్ ను లేవనెత్తే చాన్స్ ఉంది. సిపిఐ, బిజెపి కూడా ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, తెలంగాణ జన సమితి నేతలంతా ఇదే ప్రధానమైన డిమాండ్ ను గవర్నర్ వద్ద ఉంచనున్నట్లు తెలుస్తోంది.

అన్ని విపక్షాలు మూకుమ్మడిగా కేసిఆర్ ను ఆపద్ధర్మ సిఎంగా తొలగించాలని ముక్తకంఠంతో కోరనున్న నేపథ్యంలో గవర్నర్ ఏరకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిబంధలు ఏరకంగా ఉంటాయన్నదానిపైనా నిపుణులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఒకవేళ కేసిఆర్ ను ఆపద్ధర్మ సిఎంగా తొలగించే పరిస్థితి ఉత్పన్నమైతే అనివార్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సమయంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. తెలంగాణలో తొలి సర్కారు కూలిపోయిన ఈ తరుణంలో కూడా రాష్ట్రపతి పాలన వస్తుందా అన్న ఉత్కంఠ షురూ అయింది. ఈనెల 11 తర్వాత దీనిపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *