పెళ్లి రోజే రేవంత్ కు కేసిఆర్ షాక్ ఇచ్చిర్రా ?

తెలంగాణ రాజకీయాల్లో మరో కుదుపు. చడీ చప్పుడు కాకుండా ఉన్న కేసును బయటకు తీసింది తెలంగాణ సర్కారు. మూడేళ్లుగా మూత పెట్టి దాచిన కేసును సిఎం కేసిఆర్ కదిలించారు. ఉన్నఫలంగా ఈ కేసుపై విచారణ జరపడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదంతా బాగానే ఉన్నా.. సరిగ్గా రేవంత్ రెడ్డి పెళ్లిరోజే ఓటుకు నోటు కేసుపై ప్రగతి భవన్ లో గంటల తరబడి సమీక్ష జరగడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి అసలు కథ ఏంటో చదవండి.

ప్రగతి భవన్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ ఓటుకు నోటు కేసుపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డితోపాటు ఎసిబి ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. అయితే ఇటీవల తెలంగాణ పోలీసులకు ఓటుకు నోటు కేసు తాలూకు ఫొరెన్సిక్ నివేదిక అందింది. ఫొరెన్సిక్ నివేదిక అందిన సమాచారం సిఎం కు చేరిందని చెబుతున్నారు. దీంతో సిఎం కేసిఆర్ ఓటుకు నోటు కేసులో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై మరోసారి సమీక్ష జరిపారు. న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు వస్తాయన్నదానిపై కూలంకషంగా నిపుణులతో చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ సిఎం కేసిఆర్ గవర్నర్ ను కలిశారు. ఓటుకు నోటు కేసుపై గవర్నర్ తో చర్చించారు. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలి? అన్నదానిపై గవర్నర్ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ కేసులో తెలంగాణ నేత రేవంత్ రెడ్డితోపాటు ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఇరుక్కున్నారు. రేవంత్ వీడియోలు బయటకు వచ్చాయి. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయపడ్డాయి. దీంతో ఈ కేసు జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈనెల 7వ తేదీ.. సోమవారం రేవంత్ రెడ్డి వివాహ దినోత్సవం. సరిగ్గా రేవంత్ రెడ్డి 26వ వివాహ వార్షికోత్సవం రోజే ఓటుకు నోటు కేసును తెలంగాణ సర్కారు కదిలించడం చర్చనీయాంశమైంది. ఇటీవలకాలంలో ఫొరెన్సిక్ రిపోర్ట్ తెలంగాణ పోలీసుల చేతికి అందినట్లు చెబుతున్నారు. కానీ సరిగ్గా రేవంత్ వివాహం రోజే సిఎం కేసిఆర్ ఓటుకు నోటు కేసుపై సుదీర్ఘ సమీక్ష జరపడం పట్ల రేవంత్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పెళ్లిరోజు పేరుతో రేవంత్ అభిమానులు సంబరాల్లో ఉన్నారు. కానీ ఈ కేసు సమీక్ష కారణంగా వారిలో ఆందోళన కలిగించేలా సర్కారు వ్యవహరించిందని రేవంత్ సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం పట్టు సాధిస్తున్న వాతావరణం ఉంది. ములుగు సీతక్కకు జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోస్టు దక్కింది. రేవంత్ కు కూడా రేపో మాపో కీలక పోస్టు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు ఓటుకు నోటు కేసును బయటకు తీయడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? లేక యాదృశ్చికమా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉండగా కేంద్రంపై ఎపి సిఎం చంద్రబాబు కత్తులు నూరుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓటమి కోసం దళాలు, బృందాలను కర్ణాటకకు చంద్రబాబు పంపారు. అందులో ఉద్యోగ సంఘం నేత అశోక్ బాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే ఓటుకు నోటు కేసును రీఓపెన్ చేయాలన్న సూచన ఏమైనా తెలంగాణ సర్కారుకు అందిందా అన్న అనుమానాలను సైతం టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ కేసు రీఓపెన్ చేయడం అంటే ఇటు రేవంత్ కు అటు చంద్రబాబుకు ఇద్దరికీ ఇబ్బందికరమైన వాతావరణం కల్పించే ప్రతయ్నమే అన్న చర్చ సాగుతోంది. మరి ఈ కేసు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *