మోత్కుపల్లికి సొంతూరిలో టిడిపి షాక్ (వీడియో)

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇంకా మిగిలిన అతికొద్ది మంది నాయకుల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. పార్టీ పునాది నుంచి మోత్కుపల్లి టిడిపిలో పనిచేశారు. విద్యార్థిగా ఉన్న కాలంలోనే యూనివర్శిటీ నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. దళిత సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీకి పిల్లర్ మాదిరిగా పనిచేశారు. అదంతా గతం.

మరి ఇప్పుడేమవుతుందంటే? మోత్కుపల్లి టిఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఆయన టిడిపి అధినాయకత్వంతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ సంచలన కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టిడిపి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటించారు. అయితే గియితే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టకోవాలని, కేసిఆర్ కూడా టిడిపి వాడే కదా అని ప్రకటనలు గుప్పించి టిడిపి అధినేతను, పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేశారు. ఇదంతా వర్తమానం.

మరి అసలు విషయం ఇప్పుడు చదవండి. తెలంగాణలో లీడర్లంతా తమ దారి తాము చూసుకున్న తరుణంలో టిడిపి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో టిడిపిని రక్షించేందుకు జిల్లాల వారీగా మినీ మహానాడు కార్యక్రమాలు చేపడుతున్నది తెలుగుదేశం పార్టీ. అయితే రెండు రోజుల కిందట యాదాద్రి భువనగిరి జిల్లా మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లికి ఆహ్వానం పంపలేదు. సుదీర్ఘకాలం ఆలేరు శాసనసభ్యుడిగా పనిచేసిన మోత్కుపల్లికి సొంత జిల్లా అయిన యాదాద్రి భువనగిరి మినీ మహానాడు కు ఆహ్వానం అందకపోవడం ఆయనను తీవ్రంగా బాధించిందని చెబుతున్నారు. సొంత ఊరిలోనే మోత్కుపల్లికి సొంత పార్టీ నేతలు అవానాలకు గురిచేశారని ఆయన సన్నిహితులు, అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో మినీ మహానాడులో పెద్ద ఎత్తున మోత్కుపల్లి మనుషులు ఆందోళన చేసి రసాబాస చేశారు. దీంతో సభలో గందగోళం నెలకొంది. పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ, జిల్లా పార్టీ అధ్యక్షులు శోభారాణి, పార్టీ సీనియర్ నేత పెద్ది రెడ్డి లాంటి వాళ్లు ఊకుంచినా కార్యకర్తలు ఊకోకుండా రభస చేశారు. మోత్కుపల్లిని పిలవకుండా మినీ మహానాడు జరపడమేందని ప్రశ్నించారు.

అయితే పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే మోత్కుపల్లిని పిలవలేదని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన టిఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే ఆయనను పక్కనపెట్టారని అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును, పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా మోత్కుపల్లి బహిరంగ వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే టిఆర్ఎస్ నుంచి ఇంకా లైన్ క్లియర్ కాలేదని అందుకే ఆయన ఇంకా టిడిపిలోనే ఉంటున్నారని పార్టీ నేతలు అంచనాల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా టిడిపి కార్యకలాపాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరిన నాటినుంచి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను మోత్కుపల్లి తెరపైకి తెచ్చారు. అయితే అధిష్టానం పొత్తుల విషయాన్ని ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లి టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఎంత దూరంగా ఉన్నా, ఆయన వచ్చినా, రాకపోయినా కనీసం ఆహ్వానం పంపితే బాగుండేది కదా అని యాదాద్రి జిల్లా నేతలు సైతం అంటున్నారు. ఈ నేపథ్యంలో మినీ మహానాడులో మోత్కుపల్లి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి ఆందోళన వీడియో కింద ఉంది చూడండి.

మొత్తానికి మోత్కుపల్లి మరి రానున్న రోజుల్లో తెలంగాణ మహానాడుకు హాజరువుతారా? అలాగే పార్టీ జాతీయ మహానాడుకు హాజరవుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు అసలు ఆయనకు ఆహ్వానం పంపుతారా లేక ఆహ్వానించకుండానే కానిచ్చేస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *