వైసీపీ పై పంచమర్తి అనురాధ ఫైర్

అమ‌రావ‌తి: వైసీపీ అరాచక పార్టీ అని నిరూపించటానికి చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రవర్తిస్తున్న విధానమే అందుకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆమె ఉండవల్లిలోని ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాటాడుతూ… దళితుల ముసుగులో వైసీపీ అరాచకం సృష్టించాలని ప్రయత్నించి సఫలీకృతులయ్యారన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రీపోలింగ్‌ జరగాలని కలెక్టర్‌కు గానీ, లేదా ఎమ్మార్వోలకుగాని ఫిర్యాదు చేయకుండా నేరుగా సీఎస్‌కు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును సీఎస్‌ ఈసీకి ఫిర్యాదు చేయడమంటన్నారు. ఏప్రిల్‌ 11వ తేదిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని 25 పోలింగ్‌ బూత్‌లలో రీ పోలింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. నాని ఫిర్యాదుపై స్పందించని ఈసీ… చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్‌లకు ఈసీ తొత్తుగా మారి వైసీపీకి ఉపయోగపడుతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.
రాజశేఖర్‌రెడ్డి హయాంలో దళిత మహిళలపై దాడులు జరిగితే ఎంతవరకు న్యాయం చేశారో చెప్పాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి నిధులను దారి మళ్లించి రాజ భోగాలు అనుభవించిన మీరు దళితుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్లేట్‌ ఫిరాయించిన కేసీఆర్‌ పంచన చేరి జగన్‌ కూడా దళితులకు అన్యాయం చేశారన్నారు. ఒక బీజేపీ నాయకుడు దళత మహిళపై అత్యాచారానికి పాల్పడితే కనీసం స్పందించని వ్యక్తి జగన్‌ అని విమర్శించారు.
ఓటమి భయంతో దళితుల ముసుగులో మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పసుపు-కుంకుమ దళితులకు అందకుండా చేయాలని అడ్డుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ విధంగా దళితుల గురించి పోరాడుతారో చెప్పాలన్నారు. ఛీఫ్‌ సెక్రటరి చెవిరెడ్డికి సెక్రటరిగా మారారని ఎద్దేవ చేశారు. గాంధీని చంపిన గాడ్సేని దేశభక్తుడిగా చెప్పిన బీజేపీ నాయకురాలిపై నరేంద్రమోడీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేసి గాడ్సే బొమ్మను వేసినా ఆశ్చర్యం లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *