Home English రనౌట్ తో మ్యాచ్ ను స్పిన్ తిప్పిన అశ్విన్

రనౌట్ తో మ్యాచ్ ను స్పిన్ తిప్పిన అశ్విన్

296
0

జైపూర్: జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో సోమవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లెవెన్ 14 పరుగుల తేడాతో గెలిచింది.

పంజాబ్ కెప్టెన్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకదశలో వివాదాస్పద రీతిలో రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ ను రనౌట్ చేసి పోటీని తమ జట్టుకు అనుకూలంగా స్పిన్ తిప్పాడు. అటు తర్వాత కూడా స్టీవ్ స్మిత్, సంజు శాంసన్

ఆడుతున్నప్పుడు 185 పరుగుల ఛేజ్ లో రాజస్థాన్ ది పైచేయిగా సాగింది గానీ శాం కర్రన్, ముజిబూర్ రెహ్మాన్, అంకిత్ రాజ్ పుట్ దీటుగా బౌలింగ్ చేసి పంజాబ్ ను విజయపథంలో నడిపారు.

అంత క్రితం, వెస్టిండీస్ అరంభ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్, యుపి బ్యాట్స్ మన్ సర్ఫ్ రాజ్ ఖాన్ ధాటిగా ఆడటంతో

పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 184 పరుగులు చేసింది. గేల్ 79 పరుగులు చేసి అవుట్ కాగా ఖాన్ 46 పరుగులతో అజేయంగా మిగిలాడు. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ 9 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది.

ఇంగ్లీష్ ఫాస్ట్  బౌలర్ శాం కర్రన్ వేసిన తొలి ఓవర్ లో అజింక్య రహానే అలవోకగా మూడు బౌండరీలు కొట్టడంతో రాజస్థాన్ ఛేజ్ దూకుడుగా ప్రారంభమయింది. రహానేకు తోడు ఇంగ్లీష్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ కూడా ధాటిగా ఆడుతూ రాజస్థాన్ పరుగుల రథాన్ని వడివడిగా పరిగెత్తించాడు. మొదటి ఎనిమిది ఓవర్ల దాకా స్కోరింగ్ రేటు పదికి  తగ్గలేదు.

ఎనిమిదో ఓవర్ చివరి బంతిని బౌండరీ దాటించిన బట్లర్ 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

పంజాబ్ కెప్టెన్ అశ్విన్ తొమ్మిదో ఓవర్ మొదటి బంతిపై రైవల్ కెప్టెన్ రహానేను క్లీన్ బౌల్ చేశాడు. రహానే 20 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. రహానే అవుటయ్యేసరికి రాజస్థాన్ స్కోరు 78. మరోవైపు బట్లర్ తన దూకుడు కొనసాగించడంతో రాజస్థాన్ 12 ఓవర్లలో 106 పరుగులు చేసింది.

13వ ఓవర్ చివరి బంతి పై అశ్విన్ బట్లర్ ను రనౌట్  చేశాడు. నాన్ స్ట్రైకర్ జాస్ బట్లర్ ను ఓ కంట కనిపెడుతూ బౌలింగ్ రన్ ఆరంభించిన అశ్విన్, చివరి క్షణంలో బంతిని డెలివర్ చేయకుండా ఓ అడుగు వెనక్కి వచ్చి బంతితో బెయిల్స్ పడగొట్టాడు. అశ్విన్ అపీలు చేయడం చూసి ఆశ్చర్యపోయిన బట్లర్ ఏదో చెప్పబోయాడు గానీ అశ్విన్ అదేమీ పట్టించుకోలేదు. నిర్ణయాన్ని మూడో అంపైర్ కు రెఫర్ చేయగా, బట్లర్ ను అవుట్ గా ప్రకటించారు.

బంతిని బౌల్ చేసే లోపే నాన్ స్ట్రైకర్ తన కంటే ముందే బౌలింగ్ క్రీజ్ దాటి వెళుతున్నప్పుడు బౌలర్ ఇలా రనౌట్ (మంకేడింగ్) క్రికెట్ లో కొత్తేమీ కాదు గానీ ఇలా చేయడానికి ముందు బౌలర్ ఒకటి రెండు సార్లు వార్నింగ్ ఇవ్వడం పరిపాటి. ఇదివరకు ఇలా అవుట్ చేసిన సందర్భాల్లో సీనియర్ల జోక్యంతో అపీలును లేదా అంపైర్ నిర్ణయాన్ని ఉపసంహరించి క్రీడాస్ఫూర్తిగా విఘాతం లేకుండా చేశారు.

బట్లర్ అవుట్ కావడంతో పోటీ పంజాబ్ కు అనుకూలంగా మలుపు తిరిగింది.

తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, బెన్ స్టోక్స్ లక్ష్య ఛేదనకై విఫల యత్నం చేశారు.  శాం కర్రన్ వేసిన 17వ ఓవర్ లో రెండు వికెట్లు పతనమయ్యాయి. స్టీవ్ స్మిత్ 20 (16 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగులకు, సంజు శాంసన్ 30 (25 బంతులు, 1 సిక్స్) పరుగులకు అవుటయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ వరసగా వికెట్లు కోల్పోయింది.

టాస్ గెల్చిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్  ఎంచుకున్నది. ధవల్ కుల్ కర్ణి వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిపై ఓపెనర్ కెఎల్ రాహుల్ కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అధ్వాన్నంగా ఆరంభమయింది. మాయాంక్ అగర్వాల్ రెండో ఓవర్ లో క్రిష్ణప్ప గౌతమ్ బంతిని లాంగాఫ్ లో సిక్స్ కొట్టాడు. పంజాబ్ 3 ఓవర్లలో 21 పరుగులు చేసింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగో ఓవర్ లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ 32 పరుగులు, ఏడు ఓవర్లకు 37  పరుగులు చేసింది.

తొలి ఓవర్ లోనే రాహుల్ వికెట్ కోల్పోవడం వల్ల మరో ఓపెనర్ క్రిస్ గేల్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ మాయాంక్ అగర్వాల్ సాహసాలకు పోకుండా ఏడు ఓవర్ల దాకా జాగ్రత్తగా ఆడారు. తర్వాత దూకుడు పెంచడంతో ఉనడ్కట్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఓ సిక్సర్, ఓ బౌండరీతో సహా 13 పరుగులు వచ్చాయి. తొమ్మిదో ఓవర్ లో అగర్వాల్ అవుటయినప్పటికీ 11 పరుగులు జతయ్యాయి. అగర్వాల్ 24 బంతుల్లో ఒక బౌండరీ, రెండు సిక్స్ లతో 22 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 68కి చేరింది.

ఉనడ్కట్ బౌల్ చేసిన 12వ ఓవర్ లో వరసగా మూడు బౌండరీలు, ఓ సిక్స్ తో గేల్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 16వ ఓవర్ అయిదో బంతిపై స్టోక్స్ బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠీకి క్యాచ్ ఇచ్చి గేల్ అవుటయ్యాడు. విండీస్ స్టార్ ఓపెనర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ లతో 79 పరుగులు చేశాడు. శ్రేయస్ గోపాల్ చేసిన 17 వ ఓవర్ లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్ మన్ సర్ఫ్ రాజ్ ఖాన్ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్స్ తో 46 పరుగులు చేశాడు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here