విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమా?

(బివి మూర్తి)

ఈ ఐపిఎల్ లో ఇంత దాకా ఆడింది చాలు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి విశ్రాంతి ఇస్తే మేలని కొంతమంది క్రికెట్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

వచ్చే మే నెలాఖరు నుంచి ఐసిసి ప్రపంచ కప్ వన్ డే ఛాంపియన్ షిప్ ఆరంభమవుతున్నది. ఐపిఎల్ పూర్తయ్యాక ప్రపంచ కప్ ఆరంభమయ్యేలోగా అందరితో పాటు కోహ్లీకి కూడా ఓ పదహైదు రోజుల విరామం లభిస్తుంది. కానీ కోహ్లీకి ఆ పాటి విశ్రాంతి చాలదేమో అనిపిస్తున్నది. ఐపిఎల్ లో ప్రస్తుతం బెంగుళూరు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు గమనిస్తుంటే, రాబోయే ప్రపంచ కప్ లో భారత జట్టు మెరుగైన ఆటతీరు కోసం కోహ్లీకి తక్షణ విశ్రాంతి తక్షణ కర్తవ్యమంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్ వంటి వారు ఇస్తున్న సలహా శిరోధార్యమని అనిపించక మానదు.

ఈ దేశంలో పుట్టిన ఓ మహా నాయకుడినీ, అత్యుత్తమ రాజకీయ వేత్తను `రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ పార్టీ’ అని సమకాలికులు అభివర్ణించే వారు. ఆ నాయకుడి రాజకీయ ప్రత్యర్థులు సైతం నిజమే సుమా అని తల పంకించే వారు. ఇప్పుడు బెంగుళూరు జట్టులో కోహ్లీ పరిస్థితి సరిగ్గా అలా ఉంది. ఊహూ అది కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే, ఓ రెండు దశాబ్దాల క్రితం నాటి ఆ మహా నాయకుడికి సరికొత్త ఆలోచనలకు, సమయానుకూలమైన ఎత్తుగడలకు అభావమన్నది ఎన్నడూ లేదు. కానీ ఈ ఐపిఎల్ లో మన కోహ్లీని గమనిస్తుంటే అతనికి మెదడు  మొద్దుబారిపోయిందేమోనని అనుమానం కలుగక మానదు.

ఈ చిన్న ఉదాహరణ గమనించండి. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో పోటీలో 160 పరుగుల స్కోరును చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ తన జట్టును నడిపిన తీరుకు అంతా జోహారు పలికారు. కీలకమైన పందొమ్మిదో ఓవర్ లో దీపక్ చహార్ నడుమెత్తు ఫుల్ టాస్ లతో వరసగా రెండు నో బాల్స్ బౌల్ చేస్తే, ధోనీ అతని దగ్గరకు దూసుకెళ్లి తీవ్రంగా మందలించి, అంతలోనే బుజ్జగించి, ఆ దశలో ఎలా బౌల్ చేయాలో సలహా ఇచ్చాడు. ఆ వెంటనే చహార్ ఫుల్ లెంగ్త్, స్లో బౌన్సర్ లతో బాటు యార్కర్ లు కలగలిపి బ్యాట్స్ మన్ సర్ఫ్ రాజ్ ఖాన్ ను ముప్పుతిప్పలు పెట్టి అవుట్ చేశాడు. దీపక్ చహార్ మన ఐపిఎల్ లో మాత్రమే అంతో ఇంతో రాణిస్తున్న ఓ మామూలు ఫాస్ట్ బౌలరే తప్ప మరే ప్రత్యేకతా లేదు. గత రెండు సీజన్ ల నుంచీ చహార్ చెన్నైకి ప్రధాన స్ట్రైక్ బౌలర్ గా ఎదిగాడంటే అతన్నలా తయారు చేసిన ఘనత ధోనీకి దక్కుతుంది.

మరోవైపు, అంతర్జాతీయంగా సుప్రసిద్ధుడైన న్యూజిలాండ్ కు చెందిన మేటి ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని వినియోగించుకోడంలో విరాట్ కోహ్లీ ఎంత దారుణంగా విఫలమయ్యాడో చూడండి. 2018 ఐపిఎల్ సీజన్ లో డెత్ ఓవర్లలో ప్రత్యర్థులకు కళ్లెం వేసి ధాటిగా బౌల్ చేశాడన్న కారణంతో సౌతీకి రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్ మెంట్ ఈ ఏడు కూడా సౌతీ కాంట్రాక్టు కొనసాగించింది. కానీ ఈ సారి సీన్ రివర్సయింది. గత ఏడాది డెత్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు సింహ స్వప్నంలా తోచిన సౌతీ మొన్నటికి మొన్న ఆండ్రీ రసెల్ చేతికి వీర బాదుడుకు వీలైన గొర్రె పిల్లలా చిక్కిపోయాడు. అంతేకాదు, ఆరంభ ఓవర్లలోనూ సౌతీ బౌలింగ్ లో పసేమీ లేదని ఆదివారం నాటి పోటీలో ఢిల్లీ బ్యాట్స్ మన్ పృథ్వీ షా వరసగా ఐదు ఫోర్లు కొట్టి నిర్ద్వంద్వంగా నిరూపించాడు. సౌతీ బంతుల్ని షా చీల్చి చెండాడి బౌండరీలో ఆరేస్తున్నా, రసెల్ సిక్సర్ల మీద సిక్సర్లు బాది గ్యారంటీగా గెలవాల్సిన పోటీని బెంగుళూరు నుంచి ఎగరేసుకుపోతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు, పోతే పోనీ పోరా అని తాత్వికపాటలు పాడుకుంటున్నట్టు ఉలుకూ పలుకూ లేకుండా కోహ్లీకి ఆ నిరాసక్తయోగమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. ధోనీనే కానక్కర లేదు, మరే కెప్టెన్ అయినా సరే, ఆటలో జోక్యం చేసుకుని ప్రత్యర్థి బ్యాట్స్ మన్ దూకుడుకు కళ్లెం వేసేలా సౌతీ బంతులకు సరికొత్త శక్తి నిచ్చేలా ఏదో ఒకటి చేసేవాడు.

ప్రత్యర్థుల బలం, బలహీనతలను బట్టి, ఆడుతున్న పిచ్, మైదానం స్థితిగతులను బట్టి బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో, అనుసరించాల్సిన వ్యూహంలో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం, బౌలర్లకు సమయానుకూలమైన సూచనలు, సలహాలిస్తూ వారి నుంచి దీటైన పర్ ఫార్మెన్స్ రాబట్టడం నేటి టి-20 యుగంలో కెప్టెన్ అనివార్యమైన కనీస బాధ్యత. ఈ విషయంలో కోహ్లీ బాగా వెనుకబడిన సంగతి ఆడుతున్న ప్రతి మ్యాచ్ తోనూ స్పష్టంగా అవగతమవుతూనే ఉంది. భారత జట్టుకు సారథ్యం వహించేప్పుడు కీలక సమయాల్లో కోహ్లీకి సలహాలిచ్చేందుకు ధోనీ ఉంటాడు గానీ ఐపిఎల్ లో ఎవరుంటారు?

ఈ ఐపిఎల్ లో ఇంతదాకా ఆడిన ఆరు పోటీల్లోనూ దిగ్విజయంగా క్రమం తప్పకుండా పరాజయం పాలైన ఆర్ సి బి 6060 (ఆడినవీ, గెల్చినవీ, ఓడినవీ, పాయింట్లు) రీడింగ్ తో అట్టడుగున పడి ఉంది. ఆడవలసినవి ఇంకో ఎనిమిది పోటీలున్నాయి. ఈ అన్ని పోటీల్లో ఒకవేళ గెలిచినా ఆర్ సి బికి ప్లే ఆఫ్ దశకు చేరగలమన్న గ్యారంటీ లేదు. ఓడిన ప్రతిసారీ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్ లో పాలిపోయిన మొహంతో “మేం ఇవాళ సరిగా ఆడలేదు…., మేం ఆట మెరుగు పర్చుకోవలసి ఉంది….., తదుపరి పోటీలో బాగా ఆడాలని నిర్ణయించా’’ మంటూ అరిగిపోయిన రికార్డులా కోహ్లీ మళ్లీ మళ్లీ అవే మాటలు వల్లె వేస్తుంటే జాలికలుగుతున్నది.

న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ ముగిశాక ఈ సీజన్ ఆరంభానికి ముందు కోహ్లీ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఐపిఎల్ వర్క్ లోడ్ ను సంభాళించుకోవడమనే బాధ్యతను ఆటగాళ్లు ఎవరికి వారే చూసుకోవాలని అన్నాడు. కోహ్లీ స్వయంగా ఇప్పుడు తన బాధ్యతను గుర్తెరిగి ఐపిఎల్ నుంచి వైదొలగితే భారత క్రికెట్ కు చాలా మంచిది. బ్యాట్స్ మన్ గా కోహ్లీ శక్తి సామర్థ్యాల గురించి, అతని ఫిజికల్ ఫిట్ నెస్ గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ కప్ సమరానికి వెళ్లేసరికి అతను మానసికంగా పూర్తి జవసత్త్వాలతో ఉండటం చాలా అవసరం. మరిన్ని పరాజయాలతో మరింతగా కృంగి పోక ముందే కోహ్లీకి ఈ ఐపిఎల్ విముక్తి కల్పించడం అత్యవసరం.

ఇప్పుడెలాగూ మన దేశంలో ఐపిఎల్ తో పాటే లోక్ సభ ఎన్నికల సీజన్ కూడా మొదలైంది కాబట్టి కోహ్లీ అర్జంటుగా ఢిల్లీ వెళ్లిపోయి తన కిష్టమైన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కావలసినంత ఎంటర్ టైన్ మెంటు లభించి మానసికోల్లాసం కలుగుతుంది. పనిలో పనిగా, తన ఐపిఎల్ కెప్టెన్సీపై పదే పదే విమర్శలతో విరుచుకు పడుతున్న నిన్న మొన్నటి క్రికెట్ సహచరుడు గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరీ మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *