Home English క్రికెట్ కిక్కు తలకెక్కించిన కపిల్, ఆ రోజు లండన్ లో మనమే లార్డ్స్!

క్రికెట్ కిక్కు తలకెక్కించిన కపిల్, ఆ రోజు లండన్ లో మనమే లార్డ్స్!

346
0

(బి వి మూర్తి)

స్లో మోషన్ లో సైకిల్ తొక్కుకుంటూ మా ఊరు సేవామందిరం నుంచి హిందూపురం టౌన్ కు వెళుతున్నా. ఇంటి దగ్గర బయల్దేరేటప్పటికే ఇండియా స్కోరు 5 వికెట్లకు 17. జింబాబ్వేతో ఆడుతున్న ఈ పోటీలో గెల్చినా మనం వరల్డ్ కప్ లో మిగులుతామన్న గ్యారంటీ లేదు. ఇది కూడా ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఇక నిశ్చింత. మన జట్టు నిర్వాకం ఇట్లా ఉన్నప్పుడు ఇంటి దగ్గరే కూర్చుని రేడియోకి చెవులప్పగించి టైమ్ వేస్టు ఎందుకని టౌన్ వేపు బయల్దేరాను ఏ సినిమాకో షికారుకో వెళ్లొద్దామని.

మనోళ్లు యాభైకో అరవైకో ఆలౌటైపోవడం ఖాయమని అనిపిస్తున్నా, లోపల్లోపల ఏదో దింపుడు కళ్లం ఆశ. ఆ ఆశ లాగే నా సైకిలు హ్యాండిలుకు బుష్ ట్రాన్సిస్టర్ వేలాడుతున్నది. దాని లోపలి నుంచి వచ్చే సురేష్ సరయ్య కామెంటరీ వినేందుకే సైకిలు మీద ఆనాటి స్లో మోషను.

`ది మ్యాన్ కమింగ్ ఇన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సందీప్ పాటిల్ ఈజ్ నన్ అదర్ ద్యాన్ స్కిప్పర్ కపిల్ దేవ్!’ అని సురేష్ సరయ్య ఖంగుమనే సరికి భారత్ స్కోరు 4 వికెట్లకు 9. ఈ విఘాతం నుంచి తేరుకునే లోగానే యశ్ పాల్ కూడా అవుట్. అటు తర్వాత నుంచి మొదలైంది ఓ చరిత్రాత్మక విధ్వంసక బ్యాటింగ్ విన్యాసం.

అంతటి అపురూపమైన ఇన్నింగ్స్ తాలూకు బాల్ టు బాల్ కామెంటరీ వింటున్నానని ఆ క్షణంలో తెలీదు గానీ మా ఇంటి నుంచి ఓ అరకిలోమీటరు దూరం వచ్చేసరికి ఉత్సుకత తట్టుకోలేక సైకిల్ నిలిపి స్టాండు వేసేసి పెన్నా బ్రిడ్జి అరుగు మీద కూర్చుండి పోయాను. నిదానంగా క్రికెట్ మజా తలకెక్కసాగింది. టౌనుకు వెళ్లేవాళ్లు, అటు నుంచి తిరిగి వస్తున్న వాళ్లు నలుగురైదుగురు తోడయ్యేసరికి ఆ జూన్ 18 సాయంత్రం (1983) ఆ అరుగు మీద అప్పటికప్పుడు క్రికెట్ కామెంటరీ శ్రవణ సమావేశం మాంచి ఊపు మీద జరిగింది.

రోజర్ బిన్నీతో కలిసి కపిల్ ఆరో వికెట్ కు 60 పరుగులు జత చేశాక 77 స్కోరు వద్ద ఇండియా ఇంకో వికెట్ కోల్పోయింది. అయ్యయ్యో అనుకుంటున్నంతలోనే 78 వద్ద రవిశాస్త్రి కూడా వచ్చీరావడంతోనే పెవిలియన్ దారి పట్టాడు. మళ్లీ ఇంకో 60 పరుగుల భాగస్వామ్యం. స్కోరు 100 దాటడం కూడా గగనమే అనుకుంటున్న దశలో కపిల్- మదన్ లాల్ జంట 140 దాకా పరుగుల రథాన్ని నడిపించింది. పోటీ మునుముందుకు సాగే కొద్దీ ఉత్కంఠ ఇంకా ఇంకా అధికం కాసాగింది.

చండప్రచండ ప్రహారాలతో 138 బంతుల్లో 175 పరుగులు చేసి వన్ డే క్రికెట్ బ్యాటింగ్ ను అనూహ్యమైన మరో మహోన్నత స్థాయికి తీసుకెళ్లిన ఆ ఇన్నింగ్స్ తర్వాతనే కపిల్ దేవ్ అనే ఓ క్రికెట్ లెజెండ్ ను ప్రప్రథమంగా ప్రపంచం గుర్తించింది. అందులో 16 బౌండరీలు, 6 సిక్సర్లు ఉన్నాయని చెప్పడం కేవలం గణకులకు తృప్తినిచ్చే దాఖలా విశేషాలు మాత్రమే. ఆ ఇన్నింగ్స్ లో కపిల్ ఆడిన ప్రతి షాటూ ఒక్కో దృశ్యకావ్యమే. అతని బ్యాటింగ్ లో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఏవీ ఉండవు. ఫీల్డింగ్ లో గ్యాప్ లు ఎక్కడెక్కడున్నాయో అతని కళ్లకు కాదు, బ్యాట్ కే తెలుసునన్నంత సహజంగా ఉంటుందా ఆట. మరెవరైనా అయితే అంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో వికెట్ రక్షించుకుంటే చాలురా భగవంతుడా అన్నట్టు నత్తగుల్లలా లోలోపలికి కుంచించుకు పోయేవారే. కానీ కపిల్ దేవ్ బ్యాటు ప్రత్యర్థి బౌలర్ల రక్తం రుచి మరిగిన ఖడ్గమై విజృంభించింది.

సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, మొహిందర్ అమర్ నాథ్, సందీప్ పాటిల్, యశ్ పాల్ శర్మ వంటి హేమాహేమీలంతా అవుటై పోయినా, అయితే మాత్రమేం, నేనున్నానుగా, ఎందుకు ఓడిపోవాలి? అని బండగా ప్రశ్నించే మొండితనం మూర్తీభవిస్తే ఆ రూపమే కపిల్ దేవ్. కీపర్ బ్యాట్స్ మన్ సయ్యద్ కిర్మానీ (24)- కపిల్ దేవ్ తొమ్మిదో వికెట్ కు జత చేసిన 126 పరుగుల అజేయ భాగస్వామ్యం కేవలం ఆ ఒక్క పోటీనే కాదు, మొత్తం ప్రపంచ కప్ టోర్నీనే కొత్త మలుపు తిప్పింది. అప్పటి దాకా అనామక, అర్భక, దుర్బల జట్టుగా మాత్రమే పేరున్న భారత క్రికెటర్లు ఉన్నట్టుండి తమలోని పోరాట పటిమను తట్టి లేపి ఎంతటి ప్రత్యర్థులనైనా మట్టి కరిపించ గల సత్తా తమలోనూ ఉందని గుర్తించసాగారు. అదిగో ఉన్నట్టుండి ఇనుమడించిన ఆ ఆత్మ విశ్వాసమే, రాజీ పడని ఆ పోరాట వైఖరే, అన్నింటినీ మించి ఆ ముదురు మొహం, కరకు మీసాల 24 ఏళ్ల కుర్రాడు జట్టులో ప్రాదుర్భవింపజేసిన టీమ్ స్పిరిట్టే అండర్ డాగ్ భారత్ ను మూడో ప్రపంచ కప్ లో విజయ శిఖరాగ్రాన నిలిపింది. జింబాబ్వేపై హీరోచిత ఇన్నింగ్స్ తర్వాత పెవిలియన్ కు వస్తున్న కపిల్ కు ఎదురేగి మంచినీళ్లందించిన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భుజం తట్టి మెచ్చుకున్నాడు.

గొప్ప దురదృష్టమేమంటే 1983 వరల్డ్ కప్ ను కవర్ చేసిన బిబిసి, సిబ్బంది సమ్మె వల్ల టర్న్ బ్రిడ్జ్ వెల్స్ లో జరిగిన ఆ అద్భుతమైన పోటీని ప్రత్యక్ష ప్రసారం చేయలేక పోయింది. అయితే కేవలం ఈ కారణం వల్లనే, ఆ పోటీకి వచ్చిన భారత అభిమాని ఒకడు గొప్ప అదృష్టవంతుడై పోయాడు. తన వీడియోకెమెరాలో కపిల్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ను బంధించడం అతనికి కనకవర్షం కురిపించింది. కొన్నేళ్ల తర్వాత విషయం తెలుసుకున్న కపిల్ దేవ్ స్వయంగా భారీ మూల్యం చెల్లించి ఆ వీడియో ఫుటేజీని తనే కొనుగోలు చేశాడు.

జింబాబ్వే పై గెల్చిన ఊపులో తర్వాతి గ్రూప్ పోటీలో ఆస్ట్రేలియాను, సెమీఫైనల్లో ఇంగ్లండ్ ను మన జట్టు మట్టి కరిపించింది. అప్పుడిక వెస్టిండీస్ తో తుది సమరం. వాళ్లేమో రెండు ప్రపంచ కప్పుల మొనగాళ్లు. మాల్కం మార్షల్, ఆండీ రాబర్ట్స్, మైకేల్ హోల్డింగ్, జోయల్ గార్నర్ ల భయంకర పేస్ బౌలింగ్ బృందం. గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ ల అద్వితీయమైన బ్యాటింగ్ లైనప్. గ్రూప్ పోటీల్లో మొదట్లో ఓ సారి వాళ్లని గెల్చామన్న తృప్తే తప్ప ఫైనల్లో మన తరఫున పందెం కాసే వాళ్లెవరూ లేకపోయారు.

కేవలం 184 పరుగుల వేటలో విండీస్ జగజ్జెట్టీలు చేతగాక 140 పరుగులకే చతికిల బడిన ఆ తుదిసమరంలో పోటీని మన వైపు తిప్పిన కీలక మలుపు కపిల్ దేవ్ పట్టిన క్యాచే. తన సహజ ధోరణిలో యమదూకుడుగా ఆడుతూ బౌలింగ్ ను చీల్చి చెండాడుతున్న కింగ్ రిచర్డ్స్ మదన్ లాల్ బంతిన హుక్ చేయబోయి ఆకాశంలోకి కొడితే ఎక్కడో దూరంగా ఉన్న కపిల్ స్ప్రింటర్ లా దూసుకొచ్చి తన భద్రమైన చేతులతో అపురూపమైన క్యాచ్ పట్టాడు.

 

1983 జూన్ 25 సాయంత్రపు వేళ లండన్ లార్డ్స్ మైదానం బాల్కనీలో ప్రుడెన్షియల్ కప్ ను గర్వంగా పైకెత్తి పట్టుకున్న ఆ అద్భుత సన్నివేశంతో క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో బహుశ కపిల్ కు కూడా ఆనాడు తెలిసి ఉండదు. మన భారతదేశంలో క్రికెట్ నేడు లక్షల కోట్ల రూపాయల కనక వర్షం కురిపించే అతి ఖరీదైన ఆటగా ఎదిగిందంటే ఆ చారిత్రక బృహత్పరిణామానికి మూల పురుషుడు హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్. ఒక్క ఇండియాలోనే కాదు, భారత ఉపఖండంలో, యావత్ప్రపంచంలో క్రికెట్ కిక్కు ను తలకెక్కేలా చేసి, స్టేడియంలు ప్రేక్షకులతో నిండి క్రిక్కిరిసేలా, ఉత్సాహ మహోత్తుంగ తరంగాలై విరుచుకుపడేలా చేసింది కూడా ఆ కపిల్ దేవే.

1983 తర్వాతే క్రికెట్ ప్రపంచకప్ ఇంగ్లండ్ రాణీవాసం వదిలేసి దేశదేశాలూ తిరగడం ఆరంభించింది. వన్ డే టోర్నీలన్నీ క్రమంగా రంగుల హంగులద్దుకున్నాయి. ఇక స్టేడియం కలెక్షన్లకు, వాణిజ్య ప్రకటనల భారీ ధనరాశులకు, టెలివిజన్ ప్రసారహక్కులకై బహుళజాతి కంపెనీల పోటాపోటీలకు ఆకాశమే హద్దయింది. క్రికెట్ పై తెల్లదొరల పెత్తనం క్రమంగా కనుమరుగై ఉపఖండపు మార్కెటింగ్ శక్తుల ప్రాభవం మొదలయింది.

ఇరవయ్యెనిమిదేళ్ల తర్వాత 2011లో మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచకప్ టోర్నీలో భారతజట్టును మరోసారి విజయ శిఖరాగ్రంపై నిలిపాడు. ఈ రెండు చరిత్రాత్మక ఘన విజయాలూ దేనికదే సాటి కానీ భారత జట్టు మొట్టమొదటి కప్ విజయం ఆనాటి దేశకాల పరిస్థితుల దృష్ట్యా, అది సృష్టించిన ప్రభావం రీత్యా ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనది. ఈ రచయిత లాంటి పాత తరం క్రికెట్ అభిమానులకు 1983 ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ జీవితాంతం మర్చిపోడానికి వీల్లేని గాఢమైన జ్ఞాపకాల పుస్తకం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here