అయిదేండ్లలోపు పిల్లలుంటే తిరుమలలో ప్రత్యేక దర్శనం

తిరుమలలో ఇకనుంచి 5 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకూ ప్రత్యేక దర్శనం ఉంటుంది.

తిరుమలలో వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రతినెలా సాధారణ దినాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది.

5 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులకు జులై 24న అంటే బుధవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 23న(మంగళవారం) వృద్ధులకు(65సంవత్సరాలపైబడిన వారు) దివ్యాంగులకు ప్రత్యేక దర్శనార్థం 4వేల దర్శన టికెట్లు జారీ చేయనుంది.

ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటల స్లాట్‌కు 2వేల టోకెన్లు, మధ్యాహ్నం 3గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

రద్దీ రోజుల్లో వీరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ సౌలభ్యాన్ని తీసుకువచ్చినట్లు దేవస్థానం తెలిపింది.

ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఈ టికెట్లు లభిస్తాయి.

ఉదయం 7గంటలకు రెండు స్లాట్‌లకు సంబంధించిన టోకెన్లిస్తారు.

సాధారణ రోజుల్లో అయితే సంవత్సరంలోపు చిన్నారులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది.

అయితే భక్తుల కోరిక మేరకు చిన్నారుల వయస్సు పరిమితిని 5 ఏళ్లకు పెంచారు.