Home English కొత్త ఇరకాటంలో తెలంగాణ మంత్రి హరీష్

కొత్త ఇరకాటంలో తెలంగాణ మంత్రి హరీష్

392
0

అవును. పైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే. మంత్రి హరీష్ రావు మాత్రం అధికార శిబిరంలో ఇరకాటంలో పడ్డ పరిస్థితి ఉంది. తెలంగాణ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలే హరీష్ రావును ఇరకాటంలోకి నెట్టేశాయి. మరి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఈ ఇరకాటం నుంచి ఎలా బయటపడతారు? అసలు హరీష్ కు వచ్చిన ఇరకాటం ఏంది? చదవండి ట్రెండింగ్ స్టోరీ.

తెలంగాణలో ఆర్టీసి సమ్మె సన్నాహాల్లో నిమగ్నమయ్యారు కార్మికులు. మరో 48 గంటల్లోనే ఆర్టీసి కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఇప్పటికే ఆర్టీసి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి మొక్కుబడిగా చర్చలు జరిగాయి. కార్మికులు వినే ప్రసక్తే లేదన్నారు. ఇంకోవైపు తెలంగాణ సిఎం ఏకంగా రంగంలోకి దిగి సమ్మె చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని, చెప్పితే వినకపోతే ఇంటికిపోవుడు ఖాయమని భయపెట్టే ధోరణిలో మాట్లాడారు. ఇక మొక్కుబడిగానే ప్రభుత్వం వైపు నుంచి చర్చలు జరిపారు. ఇక చర్చలు లేవని సర్కారు ప్రకటించింది. అయితే సమ్మె దిశగానే ఆర్టీసి కార్మికులు కదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు సర్కారు అటు కార్మికులు మధ్యలో హరీష్ రావు నలిగిపోయే పరిస్థితి కనబడుతున్నది.

మంత్రి హరీష్ రావు తెలంగాణ ఉద్యమ కాలంలో తన చతురతను ప్రదర్శించి అప్పట్లో ఆర్టీసిలో బలమైన సంఘంగా పేరుండి, గుర్తింపు సంఘంగా ఉన్న మజ్దూర్ యూనియన్ ను చీల్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ను ఏర్పాటు చేయించారు. ఈ సంఘం పుట్టుకకు హరీష్ రావే కర్త, కర్మ, క్రియ కాబట్టి కార్మిక సంఘం నేతలు కూడా హరీష్ రావును భుజానికెత్తుకున్నారు. హరీష్ రావును తమ సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సరే కాలం మారింది తెలంగాణ వచ్చింది. ఇక తెలంగాణ సర్కారులో హరీష్ రావు మంత్రిగా నియమితులయ్యారు. ఈ పరిస్థితుల్లో గత నాలుగేళ్లుగా హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పటికీ టిఎంయు సంఘానికి గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగారు. అయితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వానికి, ఆర్టీసి టిఎంయు సంఘానికి మధ్య స్నేహపూరిత వాతావరణమే ఉండడంతో హరీష్ రావుకు పెద్దగా ఇబ్బంది రాలేదు. గత రెండేళ్ల కిందట ఆర్టీసిలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఆర్టిసి కార్మికులకు 33 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం, ఆర్టీసి యూనియన్లు కోరాయి. కానీ సిఎం కేసిఆర్ ఔదార్యం చూపి 34 శాతం ఫిట్ మెంట్ ఇస్తూ సంచనల నిర్ణయం తీసుకున్నారు. దీంతో కార్మికులు కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఇక తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆర్టీసి కార్మికులు రోడ్డెక్కారు. సుమారు 50వేల మంది కార్మికులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. వారంతా సమ్మె బాట పట్టాలని సంకల్పించడంతో సర్కారు సీరియస్ గా రియాక్ట్ అయింది. అవసరమైతే ఆర్టీసిని మూసేస్తామనే స్థాయికి పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలకులు చేయని సాహసానికి కేసిఆర్ సర్కారు ఒడిగట్టింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రి హరీష్ రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంఘమే ప్రభుత్వంతో తలపడుతుండడంతో ఆయన ఇరకాటంలో పడిపోయారు. ఇప్పుడు ఆయన ఆర్టీసి టిఎంయు సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉంటారా? లేదంటే  ఆ పదవికి రాజీనామా చేస్తారా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయన గౌరవాధ్యక్ష పదవిని వదులుకుంటారు అన్న చర్చ జరుగుతోంది. ఇక తమ సంఘం గౌరవాధ్యక్షుడికి తెలిసే తాము సమ్మె చేస్తున్నామని, చర్చలకు వచ్చే ముందు కూడా ఆయనకు మెసేజ్ పెట్టే వచ్చామని టిఎంయు నేత అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. దీన్నిబట్టి ఇప్పుడు ఈ సమ్మెను హరీష్ రావే చేయిస్తున్నాడా అన్న ప్రచారాం కూడా సాగుతోంది. ఒక మంత్రి నాయకత్వంలో ఉన్న సంఘమే ఆ మంత్రి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వంపై పోరుబాట పట్టడంతో రసవత్తరంగా మారింది. మరి ఈ గడ్డు పరిస్థితి నుంచి హరీష్ రావు ఎలా బయటపడతారు అన్నది తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here