నికర జలాలే మార్గం, జగన్ కు రాయలసీమ నేత విజ్ఞప్తి

(యనమల నాగిరెడ్డి)

కరువు బరువుతో తాగడానికి నీళ్లు కూడా లేకుండా అత్యంత దయనీయ స్థితిలో గత ఎనిమిది దశాబ్దాలుగా జీవిస్తున్న రాయలసీమ ప్రజల కన్నీళ్లు శాశ్వతంగా తుడవడానికి నికర జాలాలు కేటాయించడమే ఏకైక మార్గమని రాయలసీమ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 30 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న జగన్ మోహన్ రెడ్డి అందుకు ఉన్న మార్గాలను అన్వేషించి వాటిని ఆచరించడానికి కృషి చేయాలని ప్రముఖ కార్మిక నాయకుడు,  రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆయన సోమవారం “ట్రేండింగ్ తెలుగు న్యూస్” కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రెండు తెలుగు రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలలో శాశ్వత కరువు నివారణకు నికర జలాల అవసరం, వాటిని సాధించే విధానాల గురించి, ముఖ్యమంత్రి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.

నీటి పంపిణీ విధానం -కేటాయింపులు

సాధారణంగా నదీ జలాల పంపిణీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ట్రిబ్యునల్స్ చేపడతాయి. ఈ ట్రిబ్యునల్స్ సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసి , ప్రాజెక్టుల వారీగా కేటాయిస్తాయి. అలాగే  ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని ఆ రాష్ట్రాలు తమకు అనుకూలమైన విధంగా కొంత మేరకు సర్దుబాటు చేసుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తాయి. అయితే ఈ ట్రిబ్యునల్స్ ఆ రాష్ట్రాలలోని కరువు ప్రాంతాల నీటి అవసరాల గురించి పట్టించుకునే అధికారం వీటికి లేదు. అందువల్ల కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన బచావత్, బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్స్ రెండు కూడా కృష్ణ నది పరివాహక ప్రాంతంలోని కరువు ప్రాంతాల గురించి అసలు పట్టించుకోలేదు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ పూర్తీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై వాదనలు వింటున్నది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున రాష్ట్ర నీటి  అవసరాల గురించి, కరువు ప్రాంతాల గోడు గురించి ట్రిబ్యునల్ ముందు సరైన వాదన వినిపించలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే ట్రిబ్యునల్ తనకున్న అధికార పరిధిలో మాత్రమే పని చేస్తున్నదనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.

కేంద్రమే జోక్యం చేసుకోవాలి

భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన జీవించే హక్కు కాపాడటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ధితో కృషి చేసినపుడే కరువు ప్రాంతాలలో ప్రజలు జీవించ గలరని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

‘‘కృష్ణా నదీ పరివాహక ప్రాంతం లోని  అన్ని కరువు ప్రాంతాల నీటి అవసరాల గురించి పరిశీలించమని కేంద్రం ట్రిబ్యునల్ కు ఆదేశాలు ఇవ్వాలి.  తద్వారా ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలలోని కరువు ప్రాంతాల అవసరాల గురించి పరిశీలిస్తాయి. దీనికోసం  కాబోయే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి కేంద్రం పై వత్తిడి తెచ్చి ట్రిబ్యునల్ కు రెండు రాష్ట్రాలలోని కరువు ప్రాంతాల ప్రజలకు కనీసం తాగు నీరు, ఒక్క ఆరుతడి పంటకు సాగు నీరు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని ట్రిబ్యునల్ ను ఆదేశించేలా చూడాలి,’’అని ఆయన సూచించారు.

ఇందువల్ల రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు, దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ఒంగోలు, తెలంగాణ లోని  మహబూబ్నగర్,నల్గొండ జిల్లాల నీటి అవసరాలు తీరడంతో పాటు, ఆ ప్రాంత ప్రజల జీవించే హక్కును కాపాడగలరని, ఇందుకోసం కేంద్ర రాష్ట్రాలు కలసి పని చేయాలని ఆయన జగన్ కు విజ్ఞప్తి చేశారు.

గోదావరి నీళ్ల మల్లింపే శరణ్యం

ఈ కరువు ప్రాంతాలలో శాశ్వత కరువు నివారణ కోసం గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించడమే ఏకైక మార్గమని గతంలో బ్రిటీష్ హయాం నుండి ఇటీవల కాలం వరకు నీటి పారుదల రంగ నిపుణులు ఘంటాపథంగా చెప్పారు. అయితే ఈ మార్గంలో నీటి తరలింపు కోసం చిత్తశుద్దితో ఏ నాయకుడు కృషి చేయలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు తోడుగా “పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టైల్ పాండ్” ప్రాజెక్ట్ లను చేపట్టారు. పోలవరం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల తో పాటు కృష్ణ, విశాఖ జిల్లాలకు నీటిని తరలించడానికి సిద్దమై ఆ ప్రాజెక్ట్ కు అవసరమైన అన్ని అనుమతులను సాధించారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ వ్యవహారంలో తర్వాత జరిగిన విషయం ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడటం లేదన్నారు.

 ఇకపోతే దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ కు అవసరమైన సర్వే, డిపిఆర్ తయారు చేయించి రాష్ట్ర విభజన నాటికి 500 కోట్లకు పైగా ఆ ప్రాజెక్ట్ పై ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 160 టిఎంసిల నీటిని గోదావరి నుండి సాగర్ కు తరలించి కృష్ణ బేసిన్ లోని భూములకు నీళ్లు అందించడం, అందువల్ల కృష్ణ లో మిగులుతున్న నీటిని కరువు జిల్లాలకు తరలించాలని వైస్సార్ తలపెట్టారని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న నేతలు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన గురించి ఆలోచన చేయలేదు.  రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్ట్ లు పూర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు రాష్ట్రాలలో ఎవరు ఈ ప్రాజెక్ట్ లకు ఎలాంటి అడ్డంకులు పెట్టరాదని స్పష్టంగా చెప్పింది. అయితే  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ను గురించి కనీసం ఆలోచన చేయక పొగా అసలు పట్టించుకోలేదు. పోలవరం, రాజధాని, రెండు కళ్ళు అని ప్రకటించి ఈ ప్రాజెక్ట్ గురించికానీ, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్ట్ లను గురించి కానీ ఏ మాత్రం పట్టించుకో లేదని ఆయన  ఆరోపించారు.

రెండు రాష్ట్రాలలోని కరువు పీడిత ప్రాంతాలలో శాశ్వత కరువు నివారణ కోసం “కరువు ప్రాంతాల నీటి అవసరాల గురించి పరిశీలించమని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు కేంద్రం నుండి ఆదేశాలు ఇప్పించడం, పోలవరం నుండి కృష్ణ బేసిన్ కు సాధ్యమైనన్ని నీళ్లు తరలించి, ఆ నీటిని కరువు ప్రాంతాలకు కేటాయించడం, దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలించి తెలంగాణా తో సయోధ్య పాటించి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడం”  జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలని చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమ తో పాటు రాష్ట్రంలోని ఇతర కరువు ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడమే జగన్ చేయవలసిన మొట్టమొదటి పని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *