ప్రజల డాక్టర్ ‘రాయలసీమ కృష్ణమూర్తి’ కి మేధావుల నివాళి

డాక్టర్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజానికి పట్టిన రుగ్మతలను కూడా నయం చేయడంలో జీవితాంతం డాక్టర్ కృష్ణమూర్తి నిలబడ్డారని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం మాజీ న్యాయశాస్త్ర అచార్యులు  శేషయ్య పేర్కొన్నారు.
ఇటీవలే తుదిశ్వాస విడిచిన  డాక్టర్ కృష్ణమూర్తి సంస్మరణ సభ ఎన్.జి.ఓ హోమ్ లో ఈ రోజు  ప్రసంగించారు.
రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ సభకు శేషయ్య అధ్యక్షత వహించారు. వేదికకు డా. కృష్ణమూర్తి కన్వీనర్ గా పనిచేశారు.
1980 దశాబ్దంలో విప్లవ విద్యార్థి ఉద్యమం, అనంతర కాలంలో హక్కుల ఉద్యమం, సీమ ప్రాంత పోరాటాలలో కృష్ణ మూర్తి నిర్వహించిన పాత్రను ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషయ్య వివరించారు.
 రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్‌ బొజ్జా ధశరథరామిరెడ్డి మాట్లాడుతూ సీమ ఉద్యమం ఒక విశ్వసనీయమైన నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతమైన వృత్తిని చేపట్టి దానికే పరిమితం కాకుండా తన సమాజం గురించి తపన పడిన మానవీయ వ్యక్తిత్వం డాక్టర్ గారిదని ఆయన పేర్కొన్నారు.
విరసం నాయకుడు  పాణి మాట్లాడుతూ డాక్టర్ గారు స్నేహశీలిగా, ప్రజాస్వామిక వాదిగా, స్పందించే గుణంతో అనేక ప్రజా ఉద్యమాలలో క్షేత్రస్థాయిలో పనిచేసారని, ఈ తరం ఉద్యమకారులకు మార్గదర్శకంగా నిలుస్తారని పేర్కొన్నారు.
రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్ మాట్లాడుతూ రాయలసీమ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక కన్వీనర్‌గా డాక్టర్ గారు
రాయలసీమ అంతటా ఉద్యమ విస్తరణకు కృషిచేసారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
‌ రైతుకూలీ సంఘం నాయకులు ఇండ్ల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ గారు జీవితాన్ని అణగారిణ ప్రజల అభ్యున్నతికి దోహదం చేసేలా నిలిచారని, సీమ ఉద్యమ చరిత్రలో నిలిచి ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమం లో జలసాధన సమితి నాయకులు రామకృష్ణ, విరసం నాయకులు శశికళ, నాగేశ్వరాచారి, హక్కుల సంఘం నాయకులు విజయ్, విద్యావంతుల వేదిక నాయకులు రామాంజనేయులు, రాయలసీమ సాంస్కృతిక సంఘం నాయకులు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ఒ.పి.డి.ఆర్ నాయకులు రాం కుమార్, నీటిపారుదల నిపుణులు సుబ్రహ్మణ్యం, సీమ విద్యార్థి సంఘం నాయకులు సీమ కృష్ణ, రచయిత జెట్టి జయరాం డాక్టర్ గారి బందుమిత్రులు , వివిధ ప్రజాసంఘసల నాయకులు పాల్గొన్నారు.