అతని పేరు ఫణీంద్ర, రాజమండ్రి వెటర్నరీ డాక్టర్, అక్షరాల ఇలా పాముల మిత్రుడాయన

ఒక రోజేం జరిగిందంటే…

ఫణీంద్ర రాజమండ్రిలోని ఒక జిమ్ లో ఉన్నాడు. ఉన్నట్లుండి బయటేదో గొడవ జరుగుతూ ఉంది. ఎమిటో కనుక్కోవాలన్న ఉత్సుకత కలిగింది. తీరా చూస్తే అక్కడొక ఘోరం జరుగుతూ ఉంది. ఒక కోతి పిల్ల గుంపు నుంచి విడిపోయింది. దారి తప్పింది. కొంత మంది పిల్లలు దాన్ని ఇంకా బెదర గొడుతున్నారు. అది భయంతో వణికి పోతుంది. దాని కళ్లలో దీనావస్థ కనబడుతూ ఉంది. కొంతమంది దాని మీదకు రాళ్లేస్తున్నారు. ఈ దృశ్యం ఫణీంద్రని కలచి వేసింది. పిల్లలను అదిలించి తరిమేశాడు.  ఆ కోతి పిల్లను వారి బారినుంచి కాపాడాడు. అప్పటికే అది బాగా ఆయాస పడుతూంది. ఆకలవుతూన్నట్లుంది, అటూ ఇటూ గాబరా గా చూస్తూ ఉంది. షాపుల మీదకు దూకుతూ ఉంది. దాని కళ్లలో ఆకలిని గమనించాడు ఫణీంధ్ర.  తర్వాత ఒక అరటి పండుతీసుకువచ్చి దానికి చూపించాడు.  రాళ్లేసిన జనసమూహం నుంచి ఒక స్నేహ హస్తం తన వైపు సాగి రాగానే కోతిపిల్లలో ధైర్యం వచ్చింది. అది ఫణీంద్ర స్నేహ హస్తాన్ని అందుకుంది. తర్వాత అది ఫణీంద్ర ఒళ్లో సెటిల్ అయిపోయింది. నిద్ర పోయింది.

ఈ సంఘటన వెటర్నీరీ డాక్టరయిన ఫణీంద్ర  జీవితాన్ని మార్చేసింది.ఆయన్ని ఎనిమల్ రెస్య్యూయర్ తయారు చేసింది. తర్వాత ఈ కోతి పిల్లను తన క్లినిక్ కు తీసుకువెళ్లాడు.ఒక వారం రోజులు దాని సంరక్షకుడిగా ఉండిపోయాడు. ఫణీంద్ర చూపిస్తున్న ఆదరాభిమానాలతో అదికూడా తన వాళ్లను కోల్పోయానన్న బెంగను మర్చిపోయింది.

ఫణీంద్రకు స్నేహితడయిపోయింది. కోతిపిల్ల చేష్టలతో ముచ్చట  కురిపిస్తూ   ఆయనకు ఇంకా దగ్గిరయింది. ఫణి కూడా దానికి పాండు అని పేరు పెట్టి గారాబు చేశాడు. ఫణి ఎక్కడికి వెళ్లినా అది తోడుండేది. వెటర్నరీ డాక్టరయిన ఫణిని ఒక వాస్తవం పీడిస్తూ ఉంది. అది ఎల్లకాలం తనతో ఉండటానికి వీళ్లేదు. దాని ప్రపంచ స్వేచ్ఛా ప్రపంచం. అది వనం. అందుకని అదెక్కడ దొరికిందో అక్కడ వదిలేసే ప్రయత్నం చేశాడు. ఊహూ.. వీలు కాలే.  దొరికిన స్పాట్ లో వదిలేస్తే  అది ఎక్కడికి పోకుండా అక్కడే కూర్చుని ఫణీంద్ర తప్పక తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉండేది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/watch-mars-in-the-sky-on-october-26-2019/

ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆయన దానికి రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చాడు. ఇక దానిని  వానర సమాజంలోకి వదిలేయాల్సిన సమయం వచ్చిందనుకున్నాడు. ఒక రోజు  కోతులు ఎక్కువగా ఉండే ఒక వనంలోకి  పాండును తీసుకు వెళ్లాడు. అక్కడ చెట్లమీద చాలా కోతులున్నాయి.దండిగా  అరటిపళ్లు తీసుకు వచ్చి వాటికి చూపించాడు. అవన్నీ చెట్ల మీది నుంచి కిందికి దిగి వచ్చాయి. వాటితో కలసిపోతుందని భావించి పాండును అక్కడ వదలిపెట్టి వెనక్కు వచ్చాడు. కాని పాండు తన జాతివాళ్లతో కలిసేందుకంటే ఫణితో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడింది. అది కూడా మెల్లిగా చడీ చపప్పుడు చేయకుండా ఫణి వెనకే వచ్చింది.

ఈ సంఘటన వన్యప్రాణుల పట్ట ఫణి దృక్పథాన్నే మార్చేసింది. ఆయన సకల ప్రాణులకు మిత్రడయ్యాడు. కష్టాల్లో ఉంటే వాటిని కాపాడటం, తన Paws N Claws క్లినిక్ లో చికిత్స చేసి వాటిని అడవిలో వదలిపెట్టడం మొదలుపెట్టాడు.

ఫణీంద్ర సొంతవూరు ఎక్కడో విశాఖ ఏజన్సీలో ఉంటుంది. గన్నవరంలో ని ఎన్టీ ఆర్ వెటర్నరీ కాలేజీలో బివిఎస్ సి చేశాడు. రాజమండ్రిలో సెటిల్ అయ్యాడు. అక్కడ జంతువైద్యశాల నడిపిస్తున్నాడు. జనావాసాల్లోకి దారి తప్పివచ్చే పాములు, చిరుతపులుల వంటి వన్యప్రాణులను ఆదుకోవడం, వాటిని సురక్షితంగా అడవుల్లో వదలిపెట్టడం ఆయన ప్రధాన వ్యాపకమయింది.

గత పదేళ్లలో ఆయన దాదాపు 300 వ్యన్యప్రాణులను కాపాడాడు. ప్రజలనుంచి వచ్చే అభ్యర్థనలకు స్పందించడమేకాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ వెటర్నరీ కన్సల్టెంటుగా కూడా ఉంటున్నారు.

ఇపుడు రాష్ట్రంలో పేరుమోసిన ఎనిమల్ రెస్క్యూయర్ గా పేరొచ్చినా,  ఈ స్థితికి రావడానికి ఆయనలో దాక్కుని ఉన్న స్వాభావిక భూతదయయే కారణం. అది చిన్నపుడే వెలుగులోకి వచ్చింది. అదే ఆయనను జంతు ప్రేమికుడిగా, సంరక్షకుడిగా మార్చేసింది.

ఎందుకంటే ప్రతియేటా చాలా మంది వెటర్నరీ కోర్సులు చదువుతుంటారు. వీళ్లలో చాలా  మంది వెటర్నరీనిపుణులుగా మారిపోతుంటారు. ఇలా   జంతు సంరక్షణ లో స్థిరపడే వాళ్లు చాలా తక్కువ.

ఊర్లో ఫణీంద్ర కుటుంబానికి  వాళ్లకొక చిన్న కోళ్ల పారం ఉండేది. పల్లేటూర్లలో ఏంజరుగుతుంది? చికెన్ అవసరమయినపుడల్లా ఈ కోళ్లనుకోసేయడం చాలా సాధారణం. ఇది చిన్ననాటి ఫణీంద్రకు నచ్చలేదు. తన కళ్లెదుటే  ఎంతో శ్రద్ద సాకే కోళ్లిలా హింసకు బలికావడం ఆయన నచ్చలేదు. ఇలా తన కళ్ల ముందు  ఈ కోళ్లను చంపకండి, మీకు మాంసం కావలసి వస్తే మార్కెట్ కెళ్లి కొనండని ఆయన తల్లి దండ్రులతో వాదించేవాడు.  ఈ జంతుప్రేమనే ఆయన ఇంజనీరింగ్ వంటికోర్సుల వైపు కాకుండా  వెటర్నరీ సైన్సెస్ వైపు మళ్లించింది. అదే ఆయనను ఇంకాముందుకు తీసుకువెళ్ళి ఆయన్ని గొప్ప జంతు ప్రేమికుడిగా మార్చేశాయి.

నిజానికి ఆయనలో లోలోపల ఉన్న జంతుప్రేమకు అయిదు సంవత్సరాల వెటర్నరీ సైన్సెస్ కోర్సు ఒక స్పష్టమయిన రూపాన్నిచ్చింది.

‘అయిదుసంవత్సరాల వెటర్నరీ కోర్సులో కష్టాల్లో పడ్డ  చీమ దగ్గిర నుంచి ఏనుగు దాకా ప్రాణులన్నింటిని ఎలాకాపాడాలో మాకు చెబుతారు. ఈ దశలో నాకు అర్థమయిందేమిటంటే: పెంపుడు జంతువులకు కష్టాలొచ్చినపుడు చేరదీసేందుకు కాపాడేందుకు చుట్టూ జనం ఉన్నారు. వాటిని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్తారు. చిక్సిత్స చేయిస్తారు. ఆదుకుంటారు. కాని అడవుల్లో ఉండే వన్యప్రాణులకు కష్టాలొస్తే, అవి ఏమారి తమ ప్రాంతాల్లో దారి తప్పిపోతేనో, కష్టాల్లో పడితేనో, వాటిని ఆదుకునేందుకు ఎవరూ ఉండరు. అందుకే నేను ఇలాంటి దారితపప్పిన జంతువులకోసం, కష్టాల్లో ఉన్న జంతువుల కోసం తూర్పు గోదావరి జిల్లాలోని  అడవి దారిపట్టాను,’ అని ఆయన ‘ది బెటర్ ఇండియా’కు చెప్పారు.

“During the five-year course, we were thought to rescue everything from an ant to an elephant in distress. While in practice. I realized domestic animals still had humans around them to nurse and care for them or rush them to a vet in times of crisis, but the wildlife that strayed away from their habitat were voiceless and had no one to reach out to. And so, I started   visiting forests in East Godavari district in search of any injured or distressed wild animals I could help.”

జంతువులను సహజంగా ప్రేమించే స్వభావం ఆయన్ని వన్యప్రాణుల గురించి లోతుగా అధ్యయనంచే సేందుకు అనేక దేశాలు తిప్పింది.

ఆయన చెన్నై  స్నేక్ పార్క్ లో పనిచేసి  పాముల గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాడు. మొసళ్ల గురించి తెలుసుకునేందుకు అక్కడి మొసళ్ల బ్యాంకులో పనిచేశాడు. జంతువులతో పెరిగిన అనుబంధమే  ఆయన్ని  కర్నాటక షిమోగాలోని అభయారణ్యానికి తీసుకువెళ్లింది.  సింగపూర్ వైల్డ్   రిజర్వ్స్ నిర్వహించే జురాంగ్ పక్షల పార్క్ వైపు ఆయనను నడిపించింది. ఇలా ఆసియాదేశాల్లోని పలు జంతుప్రదర్శనశాలలో పనిచేసి వన్య ప్రాణులను పట్ల అనుసరించాల్సిన పద్ధతులను ఆయన బాగా ఆకళింపు చేసుకున్నారు.

రెండేళ్ల కిందట ఐఎఫ్ ఎస్ అధికారులు అనంత శంకర్,నందిని సరాలియా (దంపతులు) అటవీ శాఖ ద్వారా ఆయన్ని డెహ్రాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇండియాలో ఒక కోర్సు చేసేందు పంపించారు.

వారి సహకారంతోనే ఫణీంద్ర యుకె ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ వన్యప్రాణి వైద్యంలో ఆఫర్ చేసే కోర్సుకూడా చేశాడు. ఈ కోర్సును రాజస్తాన్, అల్వార్ జిల్లాలోని సరిస్కా టైగర్ రిజర్వులో బోధిస్తారు. ఈ కోర్సులో 26 దేశాలకు చెందిన 26  మంది అభ్యర్థులు మాత్రమే ఉంటారు.

ఫణీంద్ర జీవితంలో ఉత్కంఠ భరితమయిన అనుభవం ఒక చిరుతపులిని పట్టుకునేటపుడు ఎదురయింది.

ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో గోదావరి డెల్టా ప్రాంతంలోజరిగింది.

ఒక చిరుతపులి ఈ ప్రాంతంలోకి ప్రవేశించి నలుగురి మీద దాడి చేసి 90 అడుగుల ఎత్తున్న చెట్టుపై కెక్కి కూర్చుంది. దీనిని పట్టుకునేందుకు హుటాహుటిన రావాలని   అటవీ శాఖాధికారులు విజయవాడలో ఉన్న ఫణీంద్రకు ఫోన్ చేశారు.

చెట్టు  మీద నక్కి కూర్చున్న     చిరుతపులిని పట్టుకునేందుకు ఒక పథకం వేశారు. మత్తు ఇంజక్షన్ బాణాలు వదలి, పులి మూర్చపోయేలా చేసి కాపాడి, దానిని అడవిలో వదలిపెట్టాలి. ఇదీ ఫణీంద్ర వేసిన పథకం.

మత్తు బాణాలు వదలడం ప్రమాదంతో కూడుకున్నది. ఇది గురితప్పితే చిరుత మనిషి మీదకు దూకి చీల్చి చెండాడే ప్రమాదం ఉంది. సాధారణంగా  సర్టిఫైడ్ ట్రాంక్విలిజింగ్  వెటర్నరీ నిపుణులు మాత్రమే ఈ పని చేస్తారు. ఎనిమల్ రెస్క్యూయింగ్ లో ఉన్నత విద్య అభ్యసించిన ఫణీంద్ర ఈ మిషన్ కు అన్ని విధాలయోగ్యుడు.

మొదట చెట్టమీద ఉన్న చిరుతను వల పన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫమయ్యాయి. చిరుతు కుప్పించి ఎగిరి వలలను దాటుకుని అడవిలోకి పారిపోయింది. పారిపోయినట్లే పారిపోయి చిరుత మళ్లీ  గ్రామం మీద దాడిచేసింది. ఒక కొబ్బరి మట్టల కొట్టంలోకి దూరింది. దీనిని పట్టుకోవాలి. ట్రాంక్విలైజర్లు వదలి దానిని లోబర్చుకోవాలి. దీనికోసం కొట్టం ఎక్కి, ఒక చిన్న రంద్రంచేసుకుని దాంట్లోంచి గురి చూసి మత్తుబాణాలు సంధించాలి.

అయితే, ఫణీంద్ర తెల్లవారుజామున 5.30 సమయంలో చేసిన తొలి ప్రయత్నం గురి తప్పింది. బాగా అప్రమత్తంగా ఉన్న చిరుత ఆయన చేసిన దాడిని తప్పించుకుంది. కొట్టం మీది నుంచి ఆయన కింద పడిపోయారు. ఫిబ్రవరి 14న దీన్నంతా వందలామంది ప్రజలు, అధికారులు, పోలీసులు, డాక్టర్లు, శాసన సభ్యుడు చూస్తున్నారు.

నిజానికి గురితప్పగానే చిరుత కోపంతో ఆయన మీద లంఘించి దూకి కసబిసా రక్కేయాల్సి ఉండింది. అది జరగాలేదు. అయినా సరే,  దానితో తల్లితండ్రులు భయపడ్డారు.  ఇక దాని జోలికి వెళ్లవద్దని  వారించారు. ఫణీంద్ర వదల్లేదు. వెనకాడ లేదు. రెండో ప్రయత్నం చేశాడు. రాత్రి పదకొండున్నరకు రెండో ప్రయత్నం చేశాడు.

పదడుగుల దూరం నుంచి ట్రాంక్విలైజర్ ను గురి చూసి వదిలాడు. ఈ సారి గురి తప్పలేదు. 20 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయింది. మత్తులోకి జారుకున్న చిరుతను తర్వాత వైజాగ్ జూకు తరలించారు.

అంతకు ముందు,2018లో ఒక కొండచిలువను దాని 15 గుడ్లను కాపాడి, వాటిని తన క్లినిక్ లో 15 పిల్లలను పొదిగించి అడవిలోకి వదలి పెట్టి ఫణీంద్ర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

అదెలా జరిగిందంటే…

రాజమండ్రి కి 7 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఒక అయిదునిమిషాలు అలస్యంగా ఆయన ఆ గ్రామానికి చేరుకుని ఉంటే గ్రామస్థులు కొండచిలువు రాళ్లతో కొట్టి చంపి ఉండేవాళ్లు. కొండచిలువ గ్రామంలో ప్రవేశించిన సమాచారం అందగానే ఆయన హుటాహుటిని పరిగెత్తాడు. ఆయన వెళ్లేసరికి ఒక వ్యక్తి తన బూటు కాలుతో కొండచిలువ తలకాయని తొక్కిపట్టుకుని ఉన్నాడు. ఏక్షణాన్నైనా ఆయన దాన్ని నలిపేయగలడు. అలాంటపుడు ఫణీంద్ర అక్కడి చేరుకుని కొండచిలువని కాపాడి. దానితోపాటు  అక్కడి ఉన్న దాని గుడ్లతో పాటు కారులో తీసుకుని తన క్లినిక్ వచ్చాడు. అయితే, మరుసటి రోజు కొండచిలువ తప్పించుకుని పారిపోయింది. అయితే, ఆయన దాని గుడ్లను పొదిగించాలనుకున్నాడు.  కొంతమందిసీనియర్ వెటర్నరీ నిపుణుల సలహా తీసుకుని గుడ్లు పొదిగేందుకు అవకసరమయిన ఉష్ణోగ్రతను ఇంకుబేటర్లో  సృష్టించి వాటిని పొదిగించాడు.  ఈ గుడ్లనుంచి 8 మగ, 7 ఆడ కొండచిలువులు పుటాయి. టెంపరేచర్ నుబట్టి ఆడ మగ పిల్లలు పుడతాయని, దీని మీద తొందర్లోనే తానొక స్టడీ పేపర్ ను ప్రెజంట్ చేయబోతున్నట్లు ఆయన చెప్పాడు. ఫణీంద్ర చేస్తున్య వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలను సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. ఆయన ఇదొక విద్యగా కాకండా, వన్య ప్రాణుల మీద ఎనలేని వాత్సాల్యం, ఉపేక్షతో చేస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఫణీంద్రను మీరూ ఫేస్ బుక్ లో ఇస్టాగ్రామ్ లో  కలుసుకోవచ్చు.

photos:The Better India