టీడీపీలోకి వైఎస్సార్ శిష్యుడు: టికెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రాజకీయ నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. పార్టీని బలపరచుకుని ఎన్నికల్లో నెగ్గేందుకు ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక నేతలు సైతం రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా లాభం చేకూరుతుంది అనుకుంటే పార్టీ మారడానికి సైతం వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున కనిగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుండి తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. తాను కూడా టీడీపీతో కలిసి పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ముందుగానే అధినేత చంద్రబాబు నాయుడికి వివరించినట్టు పేర్కొన్నారు. కాగా తన నిర్ణయానికి మద్దతు తెలిపిన ఉగ్రసేన సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఉగ్ర నరసింహారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గతంలో తాను చేసిన అభివృద్ధికంటే మరింత పురోగతి సాధిస్తానని, నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు ఉగ్ర నరసింహారెడ్డి. ఇక తమ నాయకుడు ఉగ్రనరసింహారెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడుస్తామని ఉగ్రసేన నాయకులు తమ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో కొత్త ఒరవడి సృష్టించిన ఘనత ఉగ్ర నరసింహారెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.

కాగా ఉగ్ర నరసింహారెడ్డి పలు ఇంటర్వ్యూల్లో వైఎస్సార్ తనకు రాజకీయంగా ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో వెన్నంటే ఉన్నారని వెల్లడించారు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి తనను పార్టీ మారవద్దని, ఇదే పార్టీలో ఉండి ముందుకు కొనసాగాలని అనేకసార్లు సూచించినట్టు తెలిపారు. కానీ తన రాజకీయ మనుగడ దృష్ట్యా వైఎస్ మాటలు పక్కన పెట్టి ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా టీడీపీలో చేరతానని బాబుకి విన్నవించుకోవడం గమనార్హం.

2014 ఎన్నికల్లో కనిగిరిలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ తరపున కదిరి బాబురావు, వైసీపీ తరపున బుర్రా మధుసూదనరావులు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ ఇద్దరి మధ్యన హోరాహోరీగా పోటీ కొనసాగినప్పటికీ 7 వేల పైచిలుకు ఓట్లతో బాబురావు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేశారు. మరి గత ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టిన బాబూరావుని పక్కనపెట్టి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని బరిలోకి దింపడం నియోజకవర్గంలో అంతర్గత సెగలు రాజేస్తోంది.

కదిరి బాబురావు, టాలీవుడ్ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్నేహితులు కావడంతోనే గత ఎన్నికల్లో బాబూరావుకు టికెట్ దక్కిందని రాజకీయ వర్గాల్లో టాక్. ఈసారి కూడా బాలకృష్ణతో ఉన్న మైత్రి కారణంగా ఆయనకే టికెట్ దక్కుతుంది అని భావించారు. కానీ నియోజకవర్గంలో బాబూరావుపై వ్యతిరేకత ఉన్న కారణంగానే టీడీపీ అధిష్టానం అభ్యర్థిని మారుస్తోందని రాజకీయవర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *