నాగం కాంగ్రెస్ కు రావొచ్చు కానీ ఒక కండీషన్

అంతా అనుకున్నట్లే జరిగింది. పాలమూరు రాజకీయ నేత నాగం జనార్దన్ రెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కూడా బిజెపి నాయకత్వానికి పంపించేశారు. తన నియోజకవర్గంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమై చర్చించి బిజెపిని వీడారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తానని నాగం వెల్లడించారు. ఇప్పుడు నాగం ఎటు పోతారన్న ప్రచారం జరుగుతున్నా.. ఆయన కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మరి నాగం రాకను ఇంతకాలం అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ లోని కొన్ని శక్తులు ఇప్పుడేమంటున్నాయి? నాగం వస్తే వారి పరిస్థితి ఏంటి? నాగం కు పొగ పెడతారా? లేదంటే అందరూ కలిసి సర్దుకుపోతారా? వారు పార్టీలోనే ఉంటారా? లేదంటే కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీల్లోకి జంప్ అవుతారా? ఈప్రశ్నలు ఇప్పుడు పాలమూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి.

ఇంతకాలం నాగం జనార్దన్ రెడ్డి రాకను బలంగా వ్యతిరేకించిన వారిలో నాగర్ కర్నూలులో నాగం తో ఇంతకాలం ఢీ అంటే ఢీ అని తలపడిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఉన్నారు. నాగం ను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోరాదని ఆయన అధిష్టానంపై వత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఆయనకు తెర వెనుక గద్వాల నాయకురాలు డి.కె.అరుణ కూడా మద్దతుగా నిలిచారు. నాగం ను పార్టీలోకి తీసుకోరాదని అధిష్టానానికి విన్నవించిన వారిలో అరుణ కూడా ఉన్నారు. డికె అరుణ వర్గం మొత్తం నాగం రాకను అడ్డుకునే ప్రతయ్నం చేసినట్లు విమర్శలున్నాయి.

కానీ అధిష్టానం మాత్రం నాగం ను తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. బలమైన నాయకులుగా ఉన్న వారందరినీ కాంగ్రెస్ లోకి వస్తానంటే తీసుకోవాల్సిందే.. అని అధిష్టానం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాగం రాకను వ్యతిరేకించే వారు కొత్త పల్లవి అందుకున్నారు. నాగం వచ్చినా ఇబ్బంది లేదు కానీ.. రాగానే టికెట్ కావాలంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. నాగం మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అప్పుడు టికెట్ అడిగితే ఒప్పుకుంటామని కొత్త కండిషన్ పెట్టారు నాగం చిరకాల ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. అలా కాకుండా ఇవాళ పార్టీలో చేరి రేపే టికెట్ కావాలంటే తాము సహకరించే ప్రసక్తే లేదన్నారు.

అయితే ప్రస్తుతం కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా బాగానే ఉంది. కాబట్టి ఆయనకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే కూచుకుళ్ల కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తనకు ఇవ్వకపోతే తన కొడుకు కు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరున్నా.. ఎవరు లేకపోయినా తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నానని ఆయన చెబుతున్నారు.

మరి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే సుదీర్ఘ రాజకీయ వైరం ఉన్న నాగం, కూచుకుళ్ల ఏరకంగా మెలుగుతారన్నది ఇప్పుడు పాలమూరు రాజకీయాల్లోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *