Home Breaking వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ: నార్నె రియాక్షన్ ఇదే

వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ: నార్నె రియాక్షన్ ఇదే

373
0
SHARE

జూనియర్ ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు గురువారం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుకు దగ్గర బంధువు, జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా మామ అయిన నార్నె వైసీపీలో చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో చేరడం వెనుక కుటుంబరమైన విరోధాలు కారణం కాదని అన్నారు. ఫామిలీ విషయాలు రాజకీయాల్లోకి లాగడం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. వైసీపీలో చేరడం తన వ్యక్తిగతం అన్నారు. వైఎస్సార్ హయం నుండి ఆయనకు మద్దతుగానే ఉన్నానని తెలిపారు. జగన్ సీఎం అవాలని కాంక్షిస్తున్నానని, చంద్రబాబు పరిపాలన నచ్చకే వైసీపీలో చేరుతున్నానని స్పష్టం చేసారు. టికెట్ ఆశించి రాలేదని, తాను ఎన్నికల బరిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కృషి చేస్తానని తెలిపారు.

అయితే దీని వెనుక జగన్ స్ట్రాటజీ ఉందంటున్నారు కొందరు నేతలు. ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, ఆయన కుటుంబానికి అన్యాయం చేసి టీడీపీ పగ్గాలు పట్టుకున్నారని లక్ష్మిపార్వతితో పాటు విపక్షాలు, కొందరు సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం. తన కొడుకు తారక్ ను టీడీపీలో ప్రముఖ స్థాయిలో చూడాలనుకున్న హరికృష్ణ కలను చంద్రబాబు హరించేశారని మరికొందరి అభిప్రాయం.

అందుకే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని పార్టీ నుండి బయటకు వచ్చారని ప్రధానంగా వినిపించే మాట. కొడాలి నాని టీడీపీ నుండి బయటకు రావడం వెనుక జూనియర్ హ్యాండ్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిని ఖండించారు తారక్. “చివరి శ్వాస ఉన్నంతవరకు మా తాతగారు స్థాపించిన టీడీపీ వైపే ఉంటాను. పార్టీకి న అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండ వస్తాను. ప్రస్తుతం నా ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాను. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నాను” అని కరాఖండిగా తేల్చి చెప్పారు.

అయితే ఈసారి ఎన్నికల ముందు అవసరం ఉంటే ఎన్టీఆర్ ని మరోసారి ప్రచారానికి వాడుకోవాలని టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు హరికృష్ణ మరణించిన తొలినాళ్లలో వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో కూకట్ పల్లి అభ్యర్థిగా నిలబడిన సొంత అక్క సుహాసిని కోసం కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. దీంతో హరికృష్ణ చంద్రబాబు వలన కుంగిపోయారనే వార్తలకు కొంత బలం చేకూరినట్టైంది.

కానీ హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణతో, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకి బంధం మరింత గట్టిపడింది. వీరి సినిమాలకి సంబంధించిన ఈవెంట్స్ కి బాలయ్య హాజరవుతున్నారు. ఈ ముగ్గురు స్టేజ్ పైన కనబడితే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అబ్బాయిలిద్దరూ కూడా మా నాన్న పోయినా బాబాయ్ ఆ స్థానంలో మాకు అండగా నిలుస్తున్నారు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

ఇలాంటి తరుణంలో బాలయ్య పిలిస్తే అబ్బాయి ప్రచారానికి రాకుండా ఉంటాడా. మా నాన్న స్థానంలో బాబాయ్ మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు, బాబాయ్ అడిగిన కోరిక తీర్చకపోతే బావుండదు అని సెంటిమెంటల్ గా కనెక్ట్ అవొచ్చు. తారక్ సెంటీ అవకుండా ఎమోషనల్ గా వైసీపీ అడ్డుకట్ట వేసింది. స్వయానా తారక్ భార్య ప్రణతి తండ్రిని రంగంలోకి దించింది. వైసీపీ అధిష్టానం బాబు ఎత్తుగడలకు పైఎత్తు వేసిందంటున్నారు. చంద్రబాబు బంధువులు వరుసపెట్టి వైసీపీలో చేరడం టీడీపీకి చేదు పరిణామంగా భావిస్తున్నారు కొందరు నేతలు.

ప్రస్తుతం నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తానో లేదో తెలియదు, జగన్ గెలుపు కోసం ప్రచారం చేస్తా అనడంతో ఆయన రాష్ట్రంలో వైసీపీ తరపున ప్రచారం చేసే బాధ్యతలే చేపట్టబోతున్నారని చూచాయిగా తెలుస్తోంది. మరి పిల్లనిచ్చిన మామకి పోటీగా ఎన్టీఆర్ ప్రచారంలోకి దిగడం కష్టమే. ఒక దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టడం అంటే ఇదే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.