హైదరాబాద్ లో నిర్బంధం, కోదండ్ రామ్ అరెస్టు

హైదరాబాద్ లో టిజాక్ పిలుపు ‘మిలియన్ మార్చ్’ వార్షికోత్సవం అడ్డుకునేందుకు  నగరంలో అడుగడుగునా బలగాలు మొహరించారు.

కీలక ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌ వాచ్‌.. ట్రాఫిక్‌ మళ్లింపు

శివార్లతో కలిపి మొత్తం 350 ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు

ముందస్తుగా పలువురి నేతల అరెస్టు

మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.

శనివారం తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించారు.

అయినా నిర్వహించి తీరతా మని ఆయా పార్టీల నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు దారితీసే మార్గాలన్నింటినీ ముళ్లకంచెలతో మూసివేశారు.

ఇందిరాపార్కు సమీపంలోని కట్ట మైసమ్మ టెంపుల్‌ వద్ద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. గోశాల వద్ద కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్‌ వద్ద రోడ్డు మూసివేసి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఉదయం నుంచి ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు. అటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాయకుల నివాసాల వద్ద నిఘా
హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం, విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయాల వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు.

తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నాయకులు నలమాస కృష్ణ, రవిచంద్రలను నారాయణగూడలో వారి నివాసాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తార్నాకలో ప్రొఫెసర్‌ కోదండరాం ఇంటి చుట్టూ మఫ్టీ పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి తర్వాత ఏ సమయంలోనైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకున్నా.. పోలీస్ లు వెనక్కి తగ్గారు.. ఈ మ ధ్యాహ్నం ఆయన టాంక్ బండ్ కు బయలుదేరగానే అరెస్టు చేశారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని న్యూడెమోక్రసీ నాయకులు రాంచంద్రయ్య, లింగ్యాలతోపాటు మరో 150 మందిని అరెస్టు చేశారు.

సంగారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ నాయకులు సురేశ్‌ను కాకతీయ వర్సిటీలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం, భువనగిరి,కొత్తగూడెం తదితర జిల్లాల సీపీఐ కార్యదర్శులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

విద్యానగర్‌లోని మార్క్స్‌ భవన్‌ వద్ద పీవోఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అడుగడుగునా బలగాలు
నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 12 వేలకు పైగా సిబ్బందితో రాజధాని నగరాన్ని దాదాపు అష్టదిగ్బంధనం చేశారు.

ఓయూతోపాటు కొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3 వేల మందిని నియమిస్తున్నారు.

ర్యాలీలు జరుగుతాయని భావిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూఫ్‌ టాప్‌ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

సమాచార మార్పిడి కోసం వీరికి సెల్‌ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్స్‌ అందించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సిబ్బందికి ‘స్టాండ్‌ టు’ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

అశ్వక దళాలు, టియర్‌ గ్యాస్‌ స్క్వాడ్స్, వాటర్‌ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు.

మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చే వారిని అడ్డుకునేందుకు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంతోపాటు శివార్లలో మొత్తం 350 పోలీసు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు.

( ఫోటో : బొల్లారం పోలీస్ స్టేషన్ లో టిజాక్ ఛెయిర్మన్ ప్రొ. కోదండరాం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *