సోషల్ మీడియాకు నమస్కారం, దిగి వచ్చిన పెప్సి కంపెనీ…

(బివి మూర్తి)

బెంగుళూరు: దుక్కి దున్నడం మొదలుకొని పంట అమ్మి రొక్కం కళ్లచూసే దాకా అడుగడుగునా యుద్ధాలు చేసేందుకు అలవాటు పడిన భారతీయ రైతు మొన్న గుజరాత్ లో ఓ చారిత్రక విజయం సాధించాడు. తొమ్మిది మంది ఆలుగడ్డ రైతులపై వేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పెప్సీ శీతల పానీయాలు, చిరుతిండ్ల ఉత్పత్తి సంస్థ ప్రకటించడంతో మన అన్నదాత తొడగొట్టి మీసం మెలేసిన అపూర్వ దృశ్యాన్ని చాలా ఏళ్ల తర్వాత కనులారా వీక్షించినట్టయింది. పెప్సికో దమననీతిని ఎండగట్టి రైతుల తరఫున మద్దతు సమీకరించిన సామాజిక ప్రచార వాహిని (సోషల్ మీడియా) ని ప్రత్యేకంగా అభినందించాలి.

తమకు పేటెంట్ హక్కులున్న ఎఫ్ సి 5 రకం ఆలుగడ్డలను తమ అనుమతి లేకుండా అక్రమంగా పండించారన్నది పెప్సీకో రైతులపై చేస్తున్న అభియోగం. పంట రకాలు, రైతు హక్కుల పరిరక్షణ (పిపివి అండ్ ఎఫ్ ఆర్) చట్టం-2001 కింద పెప్సీకో ఇండియా హోల్డింగ్స్ (పిఐహెచ్) రైతులపై కోర్టులో వ్యాజ్యం వేసి భారీ నష్టపరిహారానికై (ఒక్కో రైతు నుంచి రూ. 1 కోటి) డిమాండ్ చేసింది.

విరుచుకు పడిన నెటిజన్లు

పేటెంట్ హక్కుల సాకుతో రైతులను కోర్టు కీడ్చడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ట్విటర్ ఖాతాలో ఈ సమాచారం 1.40 కోట్ల మందికి చేరింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, పూనే, బెంగుళూరుల్లో 5,000 సంభాషణలు, 1.80 కోట్ల ఇంప్రెషన్స్ నమోదయ్యాయి. `బాయ్ కాట్ పెప్సీ’ నినాదంతో పెల్లుబుకిన ట్విటర్ వ్యాఖ్యలు 1.40 కోట్లు దాటిపోగా, 10,800 సంభాషణలు, 3.9 కోట్ల ఇంప్రెషన్లు, `వియ్ డోంట్ వాంట్ దిస్ జుంక్’ అనే మరో నినాదం 86 వేల ట్విటర్లు, 1.82 కోట్ల ఇంప్రెషన్లు నమోదు చేశాయి.

సామాజిక ప్రచార వాహినిలో పెల్లుబుకిన ఆగ్రహం పెప్సీకో ప్రతినిధులకు ముచ్చెమటలు పోయించింది. న్యూయార్క్ లోని మాతృసంస్థకు కూడా సెగ తగలడంతో రైతులతో రాజీ కుదుర్చుకోవలసిందిగా ఇండియా ప్రతినిధులకు తక్షణ ఆదేశాలందాయి. ఇటు స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలూ పెప్సీకో దురాగతంపై విరుచుకుపడ్డాయి. తీక్ష్ణ పదజాలంతో పెప్సీకోను ఖండిస్తూ రాజకీయపక్షాలూ ఉనికి చాటుకున్నాయి. మూడు చోట్ల దీస్సా (బనస్కాంత), అరవిల్లి కోర్టుల్లో, అహ్మదాబాద్ లోని ఓ వాణిజ్య న్యాయస్థానంలో రైతులపై దాఖలైన కేసుల్లో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలనీ, రైతుల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితోనే రైతు పక్షం వహించిందో లేక ఈ ఎన్నికల వేళ వోట్లకోసమే డ్రామాలాడుతున్నదో తెలీదు గానీ పెప్సీకో మాత్రం ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన నెటిజన్ల ఛీత్కారాల వల్లే రైతులతో కాళ్లబేరానికి వచ్చిందన్న సంగతి ముమ్మాటికీ నిజం. 64 బిలియన్ డాలర్ల పెప్సీకో మెడలు వంచిన ఘనత మాత్రం `బాయ్ కాట్ పెప్సీ’, `వియ్ డోంట్ వాంట్ దిస్ జుంక్’ నినాదాల కోట్లాది గొంతుకల ప్రతిధ్వనులదే.

2015 లో చెన్నై నగరం కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నప్పుడు, 2016 లో వార్ధా తుఫాను పడగ విప్పినప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ పోస్టులు వందల వేల ప్రాణాలను కాపాడాయి. తమ చంద్రభవనంలో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ లంటూ, అధికారులను పరుగులు పెట్టించాం, లక్షల కోట్ల నష్టాలను నివారించామంటూ పసుప్పచ్చ టివి, ప్రింటు మీడియాల్లో ఓ అంటూ బాకాలూదించుకోడం కాదు, మొబైల్ ఫోన్ లలో గూగుల్ మ్యాప్ లను చూసుకుంటూ ఉరుకులు పరుగుల్లో బాధితుల దగ్గరికి చేరుకుని కాపాడిన దృశ్యాల వీడియోలు ఇంకా ఇంకా విచ్చుకుంటుంటే, స్ఫూర్తి పొందిన మరెందరో కార్య రంగంలో దూకి సహాయ హస్తం అందిస్తుంటే, ప్రభుత్వాలు వట్టి  మాటబొమ్మలుగా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవడం ఓ చారిత్రక సన్నివేశం. ఇక 2017లో మా గ్రామీణ క్రీడ, మా తమిళ సంస్కృతిపై మీ ఆంక్షల పెత్తనమేమిటని నిలదీస్తూ మెరీనా బీచ్ ని ముంచెత్తిన జల్లికట్టు జన సముద్రం కేవలం సోషల్ మీడియా సృష్టించిన నిరసన ప్రభంజనమనే చెప్పాలి.

తాజాగా పెప్సీకో తో రైతుల తరఫున నెటిజన్ల యుద్ధం గత ఏప్రిల్ మాసంలో మొదలైంది. బిపిన్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్, చబిల్ భాయ్ పటేల్ అనే నలుగురు రైతులపై పెప్సీకో  కోర్టులో దావా వేసిందన్న వార్త గమనించిన జతన్ ట్రస్టు వ్యవస్థాపకుడు కపిల్ షా వెనువెంటనే వీరిని సంప్రదించాడు. (రైతుల్లో సేంద్రియ (ప్రకృతి) వ్యయసాయంపై చైతన్యం కలిగించేందుకు, ప్రోత్సహించడానికి వడోదరలో కపిల్ షా గతంలో జతన్ ట్రస్టు ఏర్పాటు చేశాడు.) ఈ నలుగురిపైనే కాకుండా గత ఏడాది గుజరాత్ లోని మరో జిల్లాలో ఇంకో అయిదుగురు రైతులపై కూడా ఇదే అభియోగంపై రూ.20 లక్షలు పరిహారం కోరుతూ పెప్సీకో కేసులు పెట్టిందనీ, ఆ కేసులింకా నడుస్తూనే ఉన్నాయని అతనికి తెలియవచ్చింది. నిత్యం రైతులతో సంబంధ బాంధవ్యాలున్న మనిషి కావడంతో పెప్సీకో కేసు గురించి దేశ విదేశాల నుంచి రోజూ ప్రశ్నల మీద ప్రశ్నలు వెల్లువలై రాసాగాయి. షా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఈ కేసులకు సంబంధించిన తాజా సమాచారం గ్రూప్ లో చేరవేస్తూ, వివిధ సామాజిక వర్గాల స్పందనల ఆడియో, వీడియోలు అప్ లోడ్ చేస్తూ, ట్విటర్ వ్యాఖ్యలను క్రోడీకరిస్తూ ముందుకెళ్లేసరికి పెప్సీ వ్యతిరేక నినాదాలు వాటికవే పురుడు పోసుకుని నలుచెరగులా ప్రతిధ్వనించసాగాయి. ఇండియాతో పాటు అమెరికా నుంచి బ్రెజిల్ దాకా అనేక దేశాల నెటిజన్లు పెప్సీకో దమననీతిని ఉతికి ఆరేశారు.

ఏప్రిల్ 11న కోర్టు నోటీసు అందే దాకా తానేదో తప్పు చేసినట్టు తనకే తెలీదని హరిభాయ్ అన్నాడు. “నేనేం పెప్సీ వాళ్ల దగ్గరకెళ్లి ఆలు విత్తనాల కోసం దేబిరించలేదు. మేం చుట్టపక్కల రైతుల నుంచి, ఒక్కో సారి రైతు సంఘాల నుంచి ఇచ్చి పుచ్చుకునే పద్ధతుల్లో విత్తనాలు తెచ్చుకుంటుంటాం. అందువల్ల పెప్సీకో చెబుతున్న ఎఫ్ సి 5 విత్తనాలు నా పొలంలోకి వచ్చి ఉండవచ్చు’’ అని అతనంటున్నాడు.

రైతు సంఘాల ప్రకారం పిపివి అండ్ ఎఫ్ ఆర్ చట్టం లోని 39(1)(4) సెక్షన్ ప్రకారం పంట విత్తనాలపై రైతుకు పూర్తి హక్కు ఉన్నది. “రైతులు తాము సాగు చేసిన పంట ద్వారా సముపార్జించిన పంట విత్తనాలను, అవి ఇదే చట్టంలోని ఇతర సెక్షన్ ల మేరకు పేటెంట్ హక్కుల ద్వారా పరిరక్షింప బడినవైనప్పటికీ, ఈ చట్టం అమల్లోకి రాకముందు అన్ని హక్కులు పొంది ఉన్న విధంగానే, తదుపరి వినియోగానికై నిల్వ చేసుకోడానికీ, వినియోగించుకోడానికీ, పంట కోసం విత్తడానికీ, మళ్లీ మళ్లీ విత్తడానికీ, సహచర రైతులతో ఇచ్చి పుచ్చుకోడానికీ, పంచుకోడానికీ, విక్రయించడానికీ పూర్తి హక్కు కల్గి ఉంటార’’ని సదరు సెక్షన్ లో స్పష్టంగా నిర్దేశించినట్టు రైతు సంఘాల న్యాయ నిపుణులు వాదిస్తున్నారు.

రైతులపై పెప్సీకో కేసులో జూన్ 12న తదుపరి విచారణ జరగనున్నది. కేసు ఉపసంహరించుకుంటున్నట్టు బహుశ అదే రోజున పెప్సీకో ప్రతినిధులు న్యాయస్థానానికి తెలియజేయ వచ్చునని చెబుతున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో జరిపిన చర్చలపై అటు కంపెనీ కానీ ఇటు ప్రభుత్వం గానీ పెదవి విప్పడం లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడి తీరుతామంటూ నేతలు పలికే చిలక పలుకులతో సమస్య పరిష్కారం కాబోదు. కేసుల బేషరతు ఉపసంహరణ తప్ప ఇంకే ప్రతిపాదనా తమకు ఆమోదయోగ్యం కాదని రైతులు, రైతు సంఘాలూ, స్వచ్ఛంద సంస్థలూ తెగేసి చెబుతున్నాయి. పోతే, తప్పుడు కేసులు బనాయించి, సమయాన్ని వ్యర్థం చేసి, మానసిక క్షోభకు గురి చేసినందుకు గాను పెప్సీకో నుంచి నష్టపరిహారం డిమాండ్ చేయాలని రైతుల తరఫు న్యాయవాదులు ప్రతిపాదిస్తున్నారని తెలిసింది.

విత్తన హక్కులపై సోషల్ మీడియా సహకారంతో పెల్లుబుకిన ఈ చైతన్యం, రైతుకు సంబంధించిన అన్ని సమస్యలకూ విస్తరించి, రాజీలేని పోరాటంగా పరిణమించాలనీ, రైతన్నల బతుకులు బాగుచేసేందుకు ఉపకరించాలనీ ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *