టిఆర్ఎస్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్

టిఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గడిచిన రెండు రోజుల్లో రెండు షాక్ లతో సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. నిన్న పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కేసిఆర్ సర్కారుకు షాక్ ఇవ్వగా ఇవాళ సాంస్కృతిక సారథి నియామకాలపై మరో షాక్ ఇచ్చింది. ఆ నియామకాలన్నీ రద్దు చేసి మళ్లీ నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఆ నియామకాల్లో పాదర్శకత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ కు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. సాంస్కృతిక సారథి కింద చేపట్టిన నియామకాల్లో పారదర్శకత లేదని హైకోర్టు నిర్దారించింది. నియామకాలు పారదర్శకంగా లేకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సర్కారుకు మొట్టికాయలు వేసింది.

మరోసారి పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి అన్ని నియామకాలు మళ్లీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.  2 వారాల్లో ప్రకటన లు ఇచ్చి.. 3 నెలల్లో పక్రియ పూర్తి చేయాలని రసమయి బాలకిషన్ కు ఆదేశించింది హైకోర్టు.

తెలంగాణ సర్కారు సాంస్కృతిక సారథి పేరుతో 550 మంది కళాకారులకు తెలంగాణ వచ్చిన కొత్తలో ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ నియామకాల్లో పారదర్శకత లేదని విమర్శలు వచ్చాయి. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తీర్పు మంగళవారం వెలువడింది.

రసమయి బాలకిషన్ కనుసన్నల్లోనే ఈ నియామకాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారందరినీ నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక హైకోర్టు తీర్పుతో మళ్లీ నియామకాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారుకు ఇదొక పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *