తెలంగాణలో మరో జర్నలిస్ట్ సంఘం ఆవిర్భావం

తెలంగాణలో ప్రధానమైన జర్నలిస్టు సంఘాలు 3 ఉన్నాయి. అయినా జర్నలిస్టుల సమస్యల పట్ల ఆ సంఘాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయన్న విశ్వాసం జర్నలిస్టులకు లేదు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి జర్నలిస్టు సమస్యలు పరిష్కరించేదిశగా ఆ సంఘాలు పనిచేయడంలేదని జర్నలిస్టులు గగ్గోలు పెడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు జర్నలిస్టు సంఘాల నేతలు పాకులాడుతున్నారన్న విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం ఈ సంఘం ఏర్పాటైంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిబిజెఎ) పేరుతో నూతన సంఘం ఏర్పాటు చేశారు.

ఈ సంఘం ఆవిర్భావ సభకు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యపై మడమ తిప్పని పోరాటం చేయాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపైనే ఉందని కోదండరాం సూచించారు. ప్రింట్ మీడియాకు ఉన్నట్లుగానే ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్నారు. మీడియాలో పనిచేసే అన్ని విభాగాల్లోని వారికి అక్రిడేషన్లు ఇవ్వాలి. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు కేసిఆర్ సర్కారు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని విమర్శించారు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో జర్నలిస్టుల కడుపు నింపాలని కేసిఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. మాటలతో జనాలను మభ్యపెట్టినట్లుగా జర్నలిస్టులను మభ్యపెట్టడం సాధ్యం కాదన్న విషయాన్ని జర్నలిస్టులు నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ సమావేశంలో 25 మందితో టిబిజెఎ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా టెన్ టివి ప్రతినిధి రాధిక, ప్రధాన కార్యదర్శిగా రాజ్ న్యూస్ షిఫ్ట్ ఇన్ ఛార్జి జ్యోతిబసు ఎన్నికయ్యారు. కోశాధికారిగా లక్ష్మణ్, కార్యదర్శులుగా సాయి, ఆంజనేయులు, విజయ్, మోహన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సందీప్, సత్యనారాయణ, నాగరాజు, చందు నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చంద్రకళ, కిరణ్మయి, జ్యోస్న, సాయిబాబా, రామ్ తిరున్ తేజ, రాజేష్, ముఖుంద్ రెడ్డి, ప్రజ్ఞ, సత్యనారాయణ, ప్రభాకర్, రాధాకృష్ణ, మధుకర్, సత్యం, అభిరామ్ ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *