వైసీపీకి చంద్రబాబు సీరియస్ వార్నింగ్

టీడీపీ అభిమానులు ఈరోజు కోసం చాలా రోజులుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమకు రక్షణ కరువైందని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పలువురు టీడీపీ కార్యకర్తల్ని వైసీపీవారు పొట్టనపెట్టుకున్నారని, అనేకచోట్ల దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడే లేడా అంటూ టీడీపీలో ఎదురుచూపులు మొదలయ్యాయి. అరకొరచోట్ల నేతలు… టీడీపీ కార్యకర్తలకి ఎటువంటి హాని జరిగినా సహించబోము అంటూ మీడియా ముందు ప్రకటనలు చేసినా… అవి మొక్కుబడిగానే అనిపించాయి. ఐతే.. దేవినేని అవినాష్ రూపంలో వారికి కొంచం ఊరట లభించింది. కానీ వారంతా బలంగా చంద్రబాబు నోటి నుండి తమకు అండగా ఒక స్టేట్మెంట్ రావాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా సోమవారం వారి కల నెరవేరింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ ముచ్చట తీర్చేశారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, తమ పార్టీకి నష్టం చేయాలనీ ఎవరైనా చూస్తే వారికే నష్టం కలుగుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం, ప్రతిపక్షం మాకు కొత్త కాదని, 37 ఏళ్లుగా పార్టీ జెండాని మోస్తుంది కార్యకర్తలే అన్నారు. వారిని కాపాడుకుంటామని, కాపాడుకునే బాధ్యత టీడీపీ దే అని హామీ ఇచ్చారు.
కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పార్టీని బలపరిచే సైన్యాన్ని తయారుచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టామని, ఇప్పుడు కార్యకర్తలని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత ఇవ్వాలని పోలీసులకు సూచించారు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు.