ఆ సాయంత్రాల తీపి గురుతుల ఖర్చు కేవలం అర్ధరూపాయే

(బి వి మూర్తి)
నాటి అనంతపురం కాలేజీ రోజుల్ని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. నా పేరు రాజూ, జేబులో పైసా లేదూ…..అని బాలసుబ్రమణ్యం (అదేదో రాజబాబు సినిమాలో) కూనిరాగం తీసినట్టు ఉండేవి మా బతుకులు.
తండ్రి చాటున బతుకుతూ అప్పుడప్పుడూ ఏదో విధంగా కమిషన్లు కొట్టేసే నేనూ, ఆదీ, రఘూ, రాంప్రసాదూ వంటి టౌనుజీవులైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న రామూ, రాఘవయ్యా, భవానీ వంటి ధర్మవరం గ్రూపు వాళ్లయినా అందరివీ అత్తెసురు ఆర్థిక పరిస్థితులే. ధర్మవరం గ్రూపు వాళ్లే కాస్త నయం.
హాస్టల్లో టిఫినూ, భోజనమూ గడిచిపోయినా సోపూ పేస్టూ వగైరా పై ఖర్చుల కని అప్పుడప్పుడూ ఎంతో కొంత గిట్టుబాటు చేసుకుని దాన్ని సినిమాలూ షికార్లకు పొదుపుగా వాడుకుంటూ అప్పుడప్పుడు ఉదారంగా మాకూ ఖర్చు పెట్టేవాళ్లు.
 అప్పట్లో డబ్బుల్లేవంటూ ఊరికే గింజుకునేవాళ్లం కానీ కాలేజీ జీవితం ఎంజాయ్ చేయాడానికీ డబ్బులకు అస్సలు సంబంధం లేదని తర్వాత్తర్వాత చాలాసార్లు తత్వం బోధపడింది. అంతేమరి, వర్తమానం కంటే గతమెప్పుడూ తియ్యగానే ఉంటుంది.
ఒక చిన్న ఉదాహరణ చెబుతా. పాతూరులో నీలం థియేటర్ దగ్గర మా ఇంటి నుంచి గోడల మీద సినిమా వాల్ పోస్టులు చూసుకుంటూ ఏవో తిక్క ఆలోచనలతో నడుచుకుంటూ సాయంత్రం క్లాక్ టవర్ వరకూ వస్తే చాలు, ప్రసాదో ఇంకొకడో కనిపించేవాడు. ఏంరా…ఏం వోయ్…అని పలకరించుకున్నాక ఇద్దరం జేబులు తడుముకునే వాళ్లం. ఇద్దర్లో ఏ ఒక్కరి చేతికైనా ఓ అర్ధరూపాయి తగిలిందనుకో, ఇంక ఆ సాయంత్రం మా కత్తి కెదురు లేదు.
రొమ్ము విరుచుకుంటూ అక్కడే ఉన్న జనతా హోటల్ కు వెళ్లే వాళ్లం. బైటూ కాఫీకి 35 పైసలు. మేం అదే హోటలుకు దాదాపు అదే టైముకు వెళ్లి అదెన్ని సార్లు ‘బైటూ’ అని ఆర్డరు చేసి ఉంటామో మాకే తెలీదు. కానీ ఆ సర్వరు గాడిద మాత్రం ఒక్క సారి కూడా రెండు లోటాల్లో వాడే సగం సగం పంచి తెచ్చిచ్చిన పాపాన పోలేదు. ఒక లోటాలో ఫుల్ కాఫీ తెచ్చి ఇంకో ఖాళీ లోటా ఠప్ మని టేబిల్ మీద పెట్టి పోయే వాడు.
సర్వర్ గా…ద అని మాలో మేము ప్రేమగా పిలుచుకుంటాము గానీ జనతా హోటల్లో సర్వారాయుళ్లందరూ మహా మంచోళ్లే నని మాకు మాత్రం తెలియదు గనుకనా?
ఆర్డరు వేసే ముందు `స్ట్రాన్….. గ్’ అనో లేక `లై…….ట్’ అనో విశేషణం చేర్చడం తప్పనిసరి. ఇది మర్చిపోడానికి ఎంతమాత్రం వీల్లేని సంగతి. బైటూ విషయంలో కొంచెం మొండిగా వ్యవహరించినా మేం చెప్పిన ప్రకారం మహా లైటో మహా స్ట్రాంగో తీసుకొస్తాడా, ఇంక దాన్ని రెండు లోటాల్లోకి పంచుకోడం అయ్యాక మరీ స్ట్రాంగ్ గా ఉందనో లేక ఉత్త పాలు తాగినట్టు మరీ లైట్ గా ఉందనో మాలో మేం పేచీ పడుతుంటాం. మమ్మల్ని ఓరకంట గమనిస్తూ ముందుకెళ్లబోయే సర్వరన్నను ఆపి పాలో, డికాక్షనో కావాలని గోముగా అడిగితే పైకి విసుక్కునే లోపలున్న ప్రేమతో వెంటనే తెచ్చిచ్చేవాడు.
ఇలా కష్టపడి అర్ధరూపాయిలోని 35 పైసలు ఖర్చు చేసి ఎవరికి వాళ్లు ఫుల్ కాఫీ తాగి బైటకొచ్చేసరికి ప్రపంచాన్ని జయించినంత తృప్తి. మిగిలిన 15 పైసలకు జనతా హోటలుకు ద్వారపాలకుడిలా ఉన్న ఆ యొక్క కిళ్లీ షాపు వాడి దగ్గర విల్స్ ఫ్లేక్ లేదా బ్రిస్టల్ సిగరెట్టు కొని బైటూ పీలుస్తుంటే స్వర్గానికీ మనకీ మధ్య దూరం కేవలం ఒకే ఒక్క సెంటీమీటరు.
పీల్చుడు డు పంపకాలపైనా, చివరి దమ్ములో తృప్తితో కూడిన మధురానుభూతిపై గుత్తాధిపత్యం గురించి అప్పుడప్పుడూ చిన్నపాటి విభేదాలు రావడం షరామామూలే.
కానీ ఓవర్ బ్రిడ్జి పిట్టగోడ మీద కూర్చుని సిగిరెట్ తాగుతూ చెప్పుకునే కబుర్లలో ఎన్నెన్ని సబ్జెక్టుల్ని చెరిగిపడేసే వాళ్లమో! ఇక్కడ సబ్జెక్టు అంటే కేవలం ఫిజిక్సూ, కెమెస్ట్రీ వగైరాలు మాత్రమే అనుకోరాదు.
సినిమాలు మొదలుకుని సాహిత్యం దాకా, ఎంకె బ్రదర్సు బార్బర్ షాపు వాడి స్టెప్ కటింగ్ స్టయిలు మొదలుకొని కమ్యూనిస్టు రాజకీయాల దాకా అన్నింటినీ చీల్చి చెండాడే వాళ్లం.
మా కాలేజీ రోజుల్లో జనతా హోటలు కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆర్ట్స్ కాలేజ్ లో మా ఫిజిక్సు సారు రంగాచారి ఆదివారం స్పెషల్ క్లాసుంటుందని అనౌన్స్ చేసే తీరును నేనెప్పటికీ మర్చిపోలేను.
“టు డే సాటర్ డే. టుమారో సన్ డే. టుమారో మాణింగ్ గో టు జనతా హోటల్ అట్ సెవెన్ థర్టీ. జస్ట్ హాట్ హాట్ ఇడ్లీ సాంబార్. షార్ప్ యైటో క్లాక్, రూమ్ నంబర్ నైన్, ఫిజిక్స్ ల్యాబ్ రంగాచారి స్పెషల్ క్లాస్. యూ ఆల్ కమ్ విదౌట్ ఫెయిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఓకే?’’
సర్వారాయుడు మసాలాదోశ తెచ్చిపెట్టగానే, అటు చివరో ఇటు చివరో కాకుండా, సింహం ఏనుగు కుంభస్థలాన్ని చీల్చినట్టుగా మసాలాదోశని మధ్యలో తుంచి నోట్లో పెట్టుకున్నాడనుకోండి, ఆ శాల్తీ కచ్చితంగా అనంతపురం జిల్లావాడే అయ్యుంటాడని అప్పటికీ ఇప్పటికీ ఓ కొండగుర్తు ఉంది.
అంత అందమైన గుండ్రటి దోశకు మధ్యలో రంధ్రం పెట్టడం ఎందుకంటే లోపల ఉర్లగడ్డ కూర పరిమాణమెంతో తెలుసుకోడానికే నన్నమాట. కూర ఎంత ఉందో అంచనా వేసుకుని, ఒక్కో ముక్కకు ఎంతెంత నంజుకోవచ్చో ఉజ్జాయింపుగా తినాలి గానీ మసాలా దోశంటే లెక్కా జమా లేకుండా ఇష్టమొచ్చినట్టు తింటే ఎలా? దోశను ఇంత కళాత్మకంగా తినాలన్న సంగతిని మాకు నేర్పింది తల్లి వంటి జనతా హోటలే.
ఇక ఇడ్లీ సాంబారంటేనా… ధనియాలూ, చెక్కా, మొగ్గా వగైరా సిసలైన అనంతపురం బ్రాండు మసాలాతో ఘుమఘమలాడే  ఆ సాంబారు వాసనకే లాలాజలపాతాలు హాజరు. దటీజ్ జనతా హోటలు! విజిటబుల్ పలావ్ చేసేందుకు ఆ రోజుల్లో రిఫైన్డ్ ఆయిలు వాడేవాళ్లు. మధ్యమధ్యలో ఉడికిన బ్రెడ్ ముక్కలు పంటికి తగులుతుంటే, పెరుగులో ఊరిన ఉల్లి, టొమోటో ముక్కల్ని నంజుకుంటూ పలావ్ తింటుంటే నాకు నేను అక్బర్ పాదుషాలాగానో, శ్రీకృష్ణదేవరాయలు లాగానో అనిపించేవాడిని. అయితే విజిటబుల్ పలావ్ ధర మరీ ఎక్కువ,
రూపాయింబావలా! ఎప్పుడో ఐదారు నెలల కోసారి మాత్రమే అంతటి వైభవం అబ్బేది.