కుమారస్వామికి మనశ్శాంతి కరువైంది, ఎందుకో తెలుసా?

(బి వెంకటేశ్వర మూర్తి)

బెంగళూరు: కర్ణాటకలోని మండ్యలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది. మండ్యద గండు (మండ్య మొనగాడు)గా ప్రఖ్యాతి గాంచిన రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, బహు భాషా నటి సుమలత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి   కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మధ్య ఇక్కడ ముఖాముఖీ సమరం జరుగుతున్నది. కాంగ్రెస్ టికెట్ కోసం విఫల యత్నం చేసిన సుమలత చివరకు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.

కర్ణాటకలో కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం దిన దిన గండం నూరేళ్లాయుష్షు అన్నట్టు రాజ్యమేలుతున్నది. గుండెజబ్బు రోగినైన నేను ఈ కాంగ్రెసోళ్ల సతాయింపులతో చచ్చిపోతున్నానంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి కనీసం వారానికో సారి ప్రైవేటుగానో పబ్లిగ్గానో కళ్లనీళ్లు పెట్టుకుని సీన్ క్రియేట్ చేస్తుంటారు.

సదరు సంకీర్ణ ధర్మం ద్వారా సంక్రమించిన ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ మండ్య సీటును జెడి (ఎస్)కు వదిలేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తానా అంటే తందానా అనే కాంగ్రెస్ అధిష్టానం, మీరు అంగీకరిస్తే మండ్య కాకుండా మరేదైనా సీటు నుంచి పోటీ చేయవచ్చని ప్రతిపాదిస్తే సుమలత నిర్ద్వంద్వంగా నిరాకరించారు.

మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ కంటే కూడా ఎంతో ముందుగానే దేవేగౌడ కుటుంబంలో కుదిరిన అంతర్గత ఒప్పందం మేరకు కుమారన్న కొడుకు మండ్య నుంచి, ప్రజా పనుల శాఖా మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయమైపోయింది.

పోతే హాసన్ నుంచి గతంలో ఆరు సార్లు లోక్ సభకు ఎన్నికైన జెడి (ఎస్) పెద్దాయన దేవేగౌడకు కాంగ్రెసోళ్ల నడిగి ఏదో ఒక అనువైన స్థానం ఎంపిక చేసుకోవచ్చని అనుకున్నారు. బెంగుళూరు ఉత్తర నుంచి పోటీ చేయండని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే, తాజాగా సాఫ్ట్ వేరోళ్లతో సహా అన్ని వర్గాలూ కలగలిసి గందరగోళం కలగూరగంప లాంటి దిక్కు మాలిన నగర నియోజకవర్గాల్లో రిస్కు తీసుకోడం ఇష్టం లేక మన వక్కళిగుల లెక్క కాస్త బావున్నట్టనిపించిన తుమకూరు నుంచి పోటీ చేస్తానంటూ దేవేగౌడ సిద్ధమై పోయారు.

‘‘భర్త అంబరీష్ మరణించి రెండు నెలలైనా గడవలేదు. ఇప్పుడామె  (సుమలత) రాజకీయాల్లోకి రావడం దేనికి?,“ అంటూ ప్రజా పనుల మంత్రి రేవణ్ణ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారానికి దారి తీశాయి.

మండ్య నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న అభిప్రాయం సుమలత వ్యక్తం చేసిన సందర్భంలో, ఎన్నికల హడావుడి ఇంకా ఆరంభం కాకముందు, రేవణ్ణ సంధించిన ప్రశ్నాస్త్రమిది. ఢిల్లీలో ఉండగా ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవణ్ణ చేసిన ఈ వ్యాఖ్యలు జెడి (ఎస్)కు, మండ్యలో పార్టీ అభ్యర్థికి ఎంత మాత్రం సహాయ పడవన్న సంగతిని ఆయన గమనించినట్టు లేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి కుమారస్వామి, మరికొందరు జెడి (ఎస్) నాయకులు ఒకవైపు ప్రయత్నిస్తుంటే, రెండు మూడు రోజులయ్యాక సుమలతపై “ఇది వరకు సినిమాల కోసం డ్రామాలాడింది. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలాడుతున్నది‘ అంటూ రేవణ్ణ మరోసారి పరుషమైన వ్యాఖ్యలు చేశారు.

భర్త అంబరీష్ కు మండ్యతో ఉన్న ప్రేమానుబంధాలు, ఇటీవల అంబరీష్ మరణించడం వల్ల వెల్లువెత్తుతున్న సానుభూతే ఈ ఎన్నికల్లో తనకు ప్రధాన బలమని సుమలతకు స్పష్టమైన అవగాహన ఉంది. “నేను రాజకీయాలకు కొత్తే అయినప్పటికీ ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేయడం, స్థాయి తగ్గి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నా భర్త అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన్ని అంతటి గొప్ప మనిషిని చేసిన మండ్య ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అంబరీష్ ను ఆదరించిన ఈ చక్కెర సీమ ప్రజలు నన్నూ ఆశీర్వదించగలరు,“ అంటూ ఆమె ఊరూరూ తిరిగి ప్రచారం చేస్తున్నారు.

మండ్య నుంచి అంబరీష్ రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కన్నడ చిత్రరంగంలో అతను పెద్దన్న వంటి వాడు. కుమార స్వామే నిర్మించిన జాగ్వార్ సినిమాలో హీరో అయిన నిఖిల్ గౌడ కూడా సినిమా రంగం వాడే కానీ అంబరీష్ స్థాయి వేరు.

మండ్య జిల్లాలో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో ఓ పదేళ్ల క్రితం అంబరీష్ మాటకు ఎదురుండేది కాదు. ఇదివరకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహనిర్మాణ మంత్రిగా ఉన్న అంబరీష్ ను సరిగా పని చేయడం లేదన్న కారణంతో సిఎం సిద్ధరామయ్య మంత్రి పదవి నుంచి తొలగించారు. సన్నిహిత మిత్రుడైన సిద్ధరామయ్యే ఇలా చేయడం జీర్ణించుకోలేని అంబరీష్ అంటీ ముట్టనట్టు వ్యవహరించసాగారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు అంబరీష్ కాంగ్రెస్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేదీ లేనిదీ చివరి వరకు తేల్చకుండా ఆఖరి క్షణం వరకూ నానబెట్టి, పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేశారు. ఆ దెబ్బతో మైసూరు, మండ్య జిల్లాలో పార్టీ మట్టి కొట్టుకుపోయింది. ఇపుడు సుమలత అన్యాయం చేసిన విషయం జెడిఎస్ మెడకు చుట్టుకుంటుందా? తాను ముఖ్యమంత్రిగా  ఉన్నపుడే కొడుకును లోక్ సభ సభ్యుడిగా చూడాలన్నది ఆయన కోరిక. కాని సుమలతా అడ్డొస్తూ ఉంది.

మండ్య లోక్ సభ సీటును సంకీర్ణ ధర్మం పేరుతో, ఇన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థి అయిన జెడి(ఎస్) కు కట్టబెట్టడం కాంగ్రెస్ లోని ఓ వర్గానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ పరిస్థితి ని కనిపెట్టిన బిజెపి తమ అభ్యర్థిని నిలపకుండా సుమలతకు మద్దతు ప్రకటించింది.  ఈ అంశాలన్నీ సుమలతకు అనువైనవి కాగా వక్కళిగుల ఓట్లను ఒక్కుమ్మడిగా సమీకరించడంలో తాత దేవేగౌడ చాణక్యనీతి నిఖిల్ కు కలిసొచ్చే అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *