కలెక్టొరేట్ నుంచి ప్లాస్టిక్ ను తరిమేసిన కలెక్టర్, ఎలాగో తెలుసా?

ఒరిస్సాలోని కియోంఝర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ ధాకరే (2011 బ్యాచ్)విస్తరాకుల్ని కలెక్టొరేట్ లో ప్రవేశపెట్టాడు, కాకపోతే, ఆధునిక రూపాలలో. ఈ ఆకులతో కప్స్, బౌల్స్, ప్లేట్స్ తయారు చేయించి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్లాస్టిక్ ను తరిమేశాడు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎవరైనా సరే ప్లాస్టిక్ వాడటానికి వీల్లేదని సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాదు, ఏ అవసరమొచ్చినా, సాల్ (సాల వృక్షం లేదా గుగ్గిల వృక్షం Shorea Robusta) అకులతో చేసిన కట్లెరీనే వాడాలని చెప్పారు.
ప్లాస్టిక్ నిషేధించాలని ప్రజలకు ఊరికే ఉపన్యాసాలిస్తూ పోతే లాభం లేదు, ఆచరించిచూపాలనుకున్నారు. దానికి తన కార్యాలయమే సరైన మార్గదర్శకం అనుకున్నారు. అంతే. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్లాస్టిక్ ఒక సర్క్యలర్ తో మాయమయింది. కియోంఝర్ కలెక్టర్ కార్యాలయం పర్యావరణనేస్తంగా మారింది. కలెక్టర్ ఆశీష్ హెడ్ లైన్ న్యూస్ అయ్యాడు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/isro-is-not-getting-fit-woman-to-take-into-gaganyaan-crew/

నిజానికి ఒకపుడు ఈ ప్రాంతంత పెద్ద పంక్షన్ అయినా సాల్ అకులతో చేసిన విస్తరాకులనే వాడే వారు.ఎంత వ్యర్థ పదార్ధాలు వచ్చినా, ఈ అకులు చాలా తొందరగా కుళ్లిపోయేవి, ఎరువుగా మారేవి.అయితే, ప్లాస్టిక్ దాడితో ఈ విస్తకారకులు కనుమరుగయ్యాయి. చౌక గా దొరకడంతో ఇవి గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరించి పర్యావరణానికి హాని చేయడం మొదలుపెట్టాయి. ఇపుడు ఈ ప్లాస్టిక్ వదిలించుకోవడం తలకు మించిన ప్రాణమయింది.
ప్లాస్టిక్ కు రకరకాల ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నారు. కలెక్టర్ ఆశీష్ ధాకరేకి సాల్ ఆకులు ప్రత్యామ్నాయంగా కనిపించాయి. కియోంఝర్ ప్రాంతంలో ఈ ఆకులు బాగా దొరుకుతాయి. ఈ ఆకులనుంచి చేసి పాత్రలను వాడి ప్లాస్టిక్ ను తరిమేయవచ్చని ఆయన భావించారు. మొదట దీనికి కలెక్టరేట్ ను ఎంచుకున్నారు. అమలు చేశారు.
సాల్ ఆకుల విస్తరాకులు, కప్పులు, ఇతర ఆకు పాత్రలు వాడటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఇది పర్యావరణానుకూలం. రెండు , ఈ ఆకులను సేకరించి, ఆకు పాత్రలు చేసి విక్రయించడం వల్ల గిరిజనులకు ఉపాధి పెరుగుతుంది.
సాల్ ఆకులను ఎటైనా వాడవచ్చు . పచ్చి ఆకులతో , ఎండుటాకులతో పాత్రలు చేయవచ్చు. నిజానికి పచ్చి ఆకులలో ఆహారాన్ని వడిస్తే, ఆ పచ్చదనం వల్ల ఆహారం కంటికి ఇంపుగా కనబడుతుంది. ఆకు సువాసన తోడయి ఆహారం ఆహ్లాదకరంగా మారుతుంది. రుచి పెరుగుతంది.
ఈ ఆకుల విస్తర్లలో, ప్లేట్లలో, కప్పులలో ఎన్ని వేల మందికి ఆహారం వడ్డించిన వ్యర్థ పదార్థాలు మిగలవు. ఈ ఆకులలో కృశించని భాగం లేదు.
కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో వందలాది స్వయం ఉపాధి గ్రూపుల మహిళలకు చేతినిండా పని దొరికింది. వారంతా ఇపుడు హోల్ సేల్ గా ఈ ఆకులతో ప్లేట్లను, కప్పులను, పాత్రలను తయారుచేయడం మొదలుపట్టారు. ప్రస్తుతానికి 500 మంది ఇపుడు పూర్తిగా ఈ పనితో ఉపాధి పొందుతున్నారు.
ఇది తెలంగాణ జిల్లాల్లోచాలా వాటిలో కూడా సాల్ అకులు దొరుకుతాయి. ఇతర ఆకులు కూడా లభిస్తాయి. వీటన్నింటిని ఉపయోగించి ప్లాస్టిక్ , తరిమేసేందుకు మన రాష్ట్రంలో కూడా అటవీ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల అధికారులు ప్రయత్నించవచ్చు.
అన్నింటికంటే సాల్ మొక్కకు వైద్య లక్షణాలున్నాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, పళ్లు, జిగురు, ఆకులను బాగా వినియోగిస్తారు. వందల సంవత్సరాలుగా వస్తున్నవైద్యం. దీని పుష్పాల కు బ్యాక్టీరియాను చంపే లక్షణాలున్నాయి.  దీని విత్తనాలనుంచి నూనే కూడా తీస్తారు. పైల్స్, గనేరియా, చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు, విరేచనాలు, కడుపు మంట వంటి అనేక రోగాల వైద్యంలో సాల్ ఆకులు వాడతారు. సాల్ చెట్టు నుంచి వూరే బంకను కూడా వైద్యంలో వాడతారు.
ఆంధ్రప్రదేశ్ గీతాం విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన పరీక్షలలో ఈ చెట్టుకు హాని చేసే రకరకాల బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించే గుణం ఉందని కనుగొన్నారు. వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ చెట్టు విష్ణు దేవునికి ఇష్టమయిందని చెబుతారు. ఇదే విధంగా బౌద్ధులు ఈ  చెట్టుని పూజిస్తారు. బుద్ధుని ప్రసవిస్తున్నపుడు యశోధర ఈ చెట్టును ఆసరా చేసుకుందని చెబుతారు. ఇలాగే బుద్ధుడి నిర్యాణం గుగ్గిలంచెట్ల వనంలోజరిగిందని బౌద్ధుల నమ్మకం.
ఇక దీని కలప గురించి చెప్పనవసరం లేదు, చాలా దృఢమయింది.