కెసిఆర్ ఢిల్లీ మీద కన్నేశారా?

(లక్ష్మన్ విజయ్ కొలనుపాక)

నిన్నతెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు  ప్రతికల వాళ్లకి విడివిడిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిందాంటో ఒక్క విషయం తప్ప అన్ని రొటీన్ మాటలే. కాంగ్రెస్ ద్రోహి, తెలుగుదేశం శూన్యం, టిఆర్ ఎస్ బంపర్ మెజారిటీ, అర్బన్ డెవెలప్ మెంట్, ఐటి, పెట్టబడులు … ఇలా రోజూ చెబుతున్న విషయాలనే ఆయన పత్రికల వాళ్లని ప్రత్యేక ఆహ్వానించి మరీ చెప్పారు. అయితే, అయిన చెప్పిన వాటిలో చాలా మందికి ఆసక్తి గా కనిపించిన విషయం ఒకటుంది.  అదేమిటంటే ఢిల్లీ రాజకీయాలు…ఢిల్లీ లో ఫెడరల్ ఫ్రంటు ప్రభుత్వం.

రాహుల్ గాంధీని కెటిఆర్  పనికిరాని సరుకుగా కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ అధికారంలోకి రాడని, కాంగ్రెస్ కూడా గెలవదనిచెప్పారు. అంతవరకు బాగానే ఉంది. మరి కాంగ్రెస్ రాకపోతే, ఎవరొస్తారు? ఉండేదీ మోదీయే కదా, మోదీ మళ్లీ వస్తాడని అనుకుంటున్నారా అంటే, మోదీ కూడా రాడని  అన్నారు. రాహుల్ రాక, మోదీ రాక,  2019 ఎన్నికల్లో వచ్చే వచ్చే దెవరు? దీనికి ఆయన సమాధానం … ‘చూస్తూ ఉండండి’ అనేది.

ఈ సమాధానం బట్టి ఇంటర్వ్యూ అయిపోయాక బయటకొచ్చిన జర్నలిస్టులేమనుకుంటున్నారంటే…

ముఖ్యమంత్రి కెసిఆర్ 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత ‘ఢిల్లీ కుమార స్వామి’ అవుతారు అని.  ఎందుకంటే, కెటిఆర్ ను కలుసుకుని తాపీగా టీ తాగుతూ తీరుబడిగా మాట్లాడిన ఒక సీనియర్ జర్నలిస్టు చెబుతున్న దాని ప్రకారం,  ముందస్తు అసెంబ్లీ ఎనికల తర్వాత కెసిఆర్ ‘ఫెడరల్ ఫ్రంటు’  బయటకు తీస్తారు. కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఫ్రంటు, రాష్ట్రాలకు మరిన్ని అధికారాల పేరుతో ఆయన గతంలో తిరగని రాష్ట్రాలలలో తిరుగతారు. ఫెడరల్ ఫ్రంటు కు ప్రచారం చేస్తారు.  ఆ దెబ్బతో సెంట్రల్ హంగ్ వస్తే, కెసియార్  ఫెడరల్ ఫ్రంట్  వ్యవస్థాపకుడిగా ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తారు. కేంద్రంలో చిన్న పార్టీగా ఉంటున్నా, రాజకీయాలను ఫెడరల్ ఫ్రంటు వైపు మళ్ళించిన జాతీయ నాయకుడిగా ఆయన దేశవ్యాపితంగా  గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం కేసియార్ ను ఉత్తరాది వాళ్ల కేవలం ఒకప్రాంతీయ నాయకుడిగా మాత్రమే చూస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ విజయంవతమయితే, అన్ని రాజకీయ పార్టీల నేతలు కెసియార్ ను ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆహ్వానిస్తాయని కెటిఆర్ చెప్పకనే చెబుతున్నారు. ఒక సారి ప్రధాని అయితే,  కెసియార్ మెజారిటీ సంపాదించగలరులే.

అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెల్చి, రెండోదఫా  ప్రభుత్వం ఏర్పాటుచేసి, కెసియార్ ఫెడరల్ ఫ్రంటు దేశాటనకు బయలు దేరగానే, ఇక్కడ   ప్రభుత్వ బాధ్యతలు కెటియార్  చూసుకుంటారు. ఒక వేళ ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం సఫలమయి అవకాశం వస్తే కుమారస్వామిలాగా ఆయన వచ్చే ఆగస్టు 15న  ఎర్రకోట మీద జండా ఎగరేస్తారు. ఒకవేళ అనుకోకండా మోదీ యే మళ్లీ అధికారంలోకి వస్తే, నెగోషియేట్ చేసి ఏ డిఫెన్సో, సర్ ఫేస్ ట్రాన్స్ పోర్టు లాంటి  సెంట్రల్ పదవి స్వీకరిస్తారు. రెండింటిలో ఏది జరిగినా లోక్ సభ ఎన్నికల తర్వాత అధికారికంగా కెటియార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇదీ కెటిఆర్ తో  ఇంటర్వ్యూ అయిపోయాక ఆ సీనియర్ జర్నలిస్టు పసిగట్టిన టిఆర్ ఎస్ దూరదృష్టి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *