కర్ణాటక కాంగ్రెస్ కు మరో షాక్… ప్రొటెం స్పీకర్ గా కెజి బోపయ్య

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ప్రొటెం స్పీకర్ గా కెజి బోపయ్యను గవర్నర్ వాజూభాయ్ నియమించారు. 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాల్సిందే అని యడ్యూరప్పకు సుప్రంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిపోయింది. కాంగ్రెస్ విన్నపాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా, గత సాంప్రదాయాలను తోసిరాజని గవర్నర్ ప్రొటెం స్పీకర్ నియామకాన్ని చేపట్టారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది.

సాధారణంగా అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించే ఆనవాయితీ ఉంది. అత్యంత ఎక్కువసార్లు ఆ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా నియమితులవుతారు. పార్టీలతో సంబంధం లేకుండా సీనియార్టీనే క్రైటీరియాగా తీసుకుంటారు. దాదాపుగా అన్ని సందర్భాల్లోనూ ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యుడినే నియమిస్తూ ఉంటారు. అయితే ప్రొటెం స్పీకర్ బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే ఆయన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం.. కొత్త స్పీకర్ నియమితులైన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగించడం వరకే ప్రొటెం స్పీకర్ బాధ్యత ఉంటుంది.

కానీ కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు వేరు. హంగ్ అసెంబ్లీ ఏర్పాటైన నేపథ్యంలో ప్రొటెం స్పీకరే పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రొటెం స్పీకర్ గా నియమితులైన వ్యక్తి బిజెపి సర్కారు భవిష్యత్తును నిర్దేశించే వాతావరణం ఉంది. ఇక్కడ కెజి బొపయ్య ప్రొటెం స్పీకర్ గా కేవలం సభ్యుల చేత ప్రమాణం చేయించడమే కాకుండా బలపరీక్షను సైతం నిర్వహించే బాధ్యత ఆయన మీదే ఉంది. ఈ నేపథ్యంలో గత సాంప్రదాయాలను పక్కన పెట్టి కర్ణాటక గవర్నర్ సీనియర్ మెంబర్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించకుండా బిజెపికి చెందిన బొపయ్యను నియమించి కొత్త చర్చను లేవనెత్తారు. ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సినియర్ సభ్యుడు దేశ్ పాండే ను నియమించాలని ఇప్పటికే కాంగ్రెస్, జెడిఎస్ గవర్నర్ కు విన్నవించాయి. దేశ్ పాండే ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీకి ఎన్నికై సీనియర్ గా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి సీనియర్ సభ్యుడు ఉన్నప్పటికీ గవర్నర్ వాజుభాయ్ మాత్రం బిజెపి సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించేందుకే మొగ్గు చూపారు.

అయితే రేపటి బిజెపి కర్ణాటక సర్కారు భవితవ్యం కెజి బొపయ్య మీద ఆధారపడి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బొపయ్య గతంలో పలుమార్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన గతంలో కర్ణాటక అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేశారు. ఆయన మీద అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజ్ లేని బొపయ్యను గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమించడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎలాగైనా బలపరీక్ష నెగ్గడం కోసమే ప్రొటెం స్పీకర్ గా దేశ్ పాండే ను పక్కన పెట్టి బొపయ్యను నియమించారన్న ఆరోపణలు కాంగ్రెస్ గుప్పిస్తోంది. మరి బొపయ్య ప్రొటెం స్పీకర్ గా బిజెపిని ముంచుతారా? తేల్చుతారా అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *