కె.విశ్వనాథ్‌ పుట్టినరోజున ‘విశ్వదర్శనం’ టీజర్‌ విడుదల..

 కళాతపíస్వీ కె.విశ్వనా«థ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘విశ్వదర్శనం’. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వివేక్‌ కూచిబొట్ల పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 19న కె. విశ్వనాథ్‌  జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్‌గారి నివాసంలో విడుదల చేశారు చిత్రయూనిట్‌ సభ్యులు.
కె.విశ్వనాథ్, జనార్ధనమహర్షి,వివేక్‌ కూచిబొట్ల, తనికెళ్లభరణి, సింగర్‌ మాళవిక తదితులు పాల్గొన్నారు. టీజర్‌ విడుదల అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మన ల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధనమహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్‌ రిలీజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ–‘‘ అందరి దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్‌ గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్ధనమహర్షి ఒకరు. వారి ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’అన్నారు.
దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ–‘‘ మా అమ్మ విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆమె చిన్నప్పటినుండి  ఆయన తీసిన సినిమాల్లోని కథలను చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటినుండి విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. నాకు గురువు, దైవం అయిన తనికెళ్ల భరణి గారి దగ్గర మూడేళ్లు  అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత 100 సినిమాలకు పైగా మాటల రచయితగా పనిచేశాను. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’ అనే చిత్రాన్ని తీశాను. ఆయన్ను దర్శకత్వం చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ ‘విశ్వదర్శనం’ సినిమా ద్వారా  వచ్చింది.  వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ‘విశ్వదర్శనం’ చిత్రంలో మేము ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు.  ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాలవల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు.
వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ– ‘‘ విశ్వనాథ్‌ గారి పక్కన కూర్చుని మాట్లాడటమే అదృష్టంగా భావిస్తున్నాను. ‘విశ్వదర్శనం’ ఓ మంచి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నంలో నేను, మా నిర్మాత విశ్వప్రసాద్‌గారు భాగమైనందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. సింగర్‌ మాళవిక మాట్లాడుతూ విశ్వనాథ్‌గారంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు. ఆయన మాటన్నా, పాటలన్నా, సినిమాలన్నా అందరికీ ఎంతో ఇష్టం. అలాంటిది ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ‘విశ్వదర్శనం’లోని ఆయన కథను నా గొంతుతో డబ్బింగ్‌  చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *